అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై రంపంతో దారుణంగా దా*డి చేసిన ఉన్మాది హేమంత్‌ను పోలీసులు 24 గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు. దా*డి అనంతరం పరారైన నిందితుడు ఆత్మకూరు అటవీ ప్రాంతంలోని పొదల్లో దాక్కున్నట్లు సమాచారం అందడంతో ప్రత్యేక పోలీసు బృందాలు మెరుపు వేగంతో రంగంలోకి దిగి అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.
పోలీసులు లొంగిపోవాలని హెచ్చరించినప్పటికీ హేమంత్ వినకుండా ఇనుప ముక్కతో రాప్తాడు సీఐ వెంకటేష్‌పై ఎదురుదా*డికి దిగాడు. ఈ దా*డిలో సీఐ ఎడమ భుజానికి తీవ్ర గాయమవ్వగా, మరో సీఐ వెంకటరమణ కిందపడి గాయపడ్డారు. హెచ్చరికగా గాల్లోకి కాల్పులు జరిపినా నిందితుడు లొంగకపోవడంతో, ఆత్మరక్షణార్థం పోలీసులు అతని కాళ్ల లక్ష్యంగా కాల్పులు జరిపారు.
ఈ ఎదురుకాల్పుల్లో నిందితుడి రెండు మోకాళ్ల కిందిభాగంలోకి ఆరు బుల్లెట్లు దూసుకెళ్లాయి. తీవ్రంగా గాయపడిన హేమంత్‌ను అంబులెన్స్‌లో అనంతపురం ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించి శస్త్రచికిత్స అందిస్తున్నారు. జిల్లా ఎస్పీ జగదీశ్ ఆసుపత్రికి చేరుకుని వైద్యులతో మాట్లాడారు. నిందితుడి పరిస్థితి విషమంగా ఉందని, గాయపడిన సీఐ ఆరోగ్యం నిలకడగా ఉందని ఎస్పీ తెలిపారు.
కాగా, నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపి పట్టుకున్నారన్న వార్త తెలియడంతో బాధితురాలి స్వగ్రామమైన అయ్యవారిపల్లిలో సంబరాలు అంబరాన్నంటాయి. బాలికను తీవ్రంగా గాయపరిచిన ఉన్మాదికి పోలీసులు తగిన గుణపాఠం చెప్పారంటూ గ్రామస్థులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. బాధితురాలి కుటుంబానికి పూర్తి న్యాయం చేయడంతో పాటు, పాఠశాలల్లో బాలికల భద్రతకు మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.











