అవ్వల రాజ్యం వచ్చినట్లుగానే ఉంది. మొన్నటి దాకా గంగవ్వ గంగవ్వ అంటూ కలవరించిన నోళ్లు నేడు కనకవ్వ కనకవ్వ అంటూ కలవరిస్తున్నాయి. ఎక్కడో ప్రారంభమైన వీరి జీవితాలు ఇంకెక్కడెక్కడికో పోతున్నాయి. చివిరికి సెలబ్రిటీలు మారి కుర్రకారు ఆటోగ్రాఫ్ లు అడిగే స్థాయికి వెళుతున్నాయంటే దాని వెనుక వీరికున్న కృషి, జీవితంపై కసి ఎలాంటిదో అర్ధమవుతుంది. మాటల గారడీ చేస్తూ గంగవ్వ ఎదిగిపోతే, పాటలతో తనదైన బాటలో సాగుతూ కనకవ్వ అందులో ఒదిగిపోతోంది.
‘మై విలేజ్ షో’ తో గంగవ్వ మాటల గారడీ చేసేసింది. కనకవ్వ అంటారా ఆమె పెదాలు కదిలితే జానపదాలు పలుకుతాయి. ఈ ఇద్దరూ వయసూ అరవైకి పైబడినా ఇరవైలో ఉండే ఉత్సాహమే కనిపిస్తుంది. అందుకే గంగవ్వ ఈ వయసులోనూ బిగ్ బాస్ షో గడప తొక్కి అక్కినేని వారసుడు నాగార్జునతో ఆటాడుకుంటోంది. ఈసారి కనకవ్వ వంతు వస్తుందేమో చూడాలి. ఈ అవ్వల గోలేంట్రా.. హవ్వ అని మీరు ముక్కున వేలేసుకుంటే వారికే పోయేదేమీ లేదు. అరవైలోనూ ఇరవైలా ఆడేస్తూ పాడేస్తున్న ఈ గువ్వల గురించి ఇంకా ఏమని వర్ణించాలి?
ఇద్దరి జీవితాల్లోనూ ఎన్నో సారూప్యాలు
జీవన సమరంలో వీరి బతుకు బండి ఒకప్పుడు భారంగానే కదిలింది.. కానీ వారిలో అంతర్గత దాగున్న ప్రతిభ సామాజిక మాధ్యమాల పుణ్యమా అని ఆ బతుకు బండిని జెట్ స్పీడుతో దూసుకు పోయేలా చేసింది. ఇద్దరి కుటుంబాలు చిన్నవి కావు. గంగవ్వకు 8 మంది మనవళ్లు, మనవరాళ్లు. భర్త 15 ఏళ్లు గా దుబాయ్ లో ఉద్యోగం చేస్తూ అక్కడే కాలం చేశాడు. కష్టాలను తనలోనే దిగమింగుకున్న గంగవ్వ కూలీనాలీ చేసుకుంటూ గడిపింది. కానీ ఓ రోజు ఆమె తలుపును అదృష్ట దేవత తట్టింది.. గంగవ్వాలే.. లేచి నీ విలేజ్ వైపు అని చెప్పిందో ఏమో ‘మై విలేజ్ షో’కు అంకురార్పణ చేసింది. డబ్బుకు డబ్బు.. పేరుకు పేరు.. ఇకనేం.. రాత్రికి రాత్రే గంగవ్వ జీవితం మారిపోయింది. బిగ్ బాస్ ముందు ఎస్ బాస్ అనే రకం కాదు గంగవ్వ.. బాస్ తో శభాష్ అనిపించుకోవాలన్నది ఆమె తాపత్రయం.
కనకవ్వ పక్కా లోకల్..
కనకవ్వ పై ఇంకా మన బిగ్ బాస్ దృష్టి పడలేదు.. కానీ మాస్ లో మసాలా పాటలతో దూసుకుపోతోంది. ‘గూట్లేమో కూసున్నాయి.. గురియన్నె పాయిరాలు’ రాలు అంటూ కనకవ్వ పాట పాడుతుంటే మైమరచిపోనిదెవ్వరు? ఈ అవ్వది కూడా తెలంగాణయే. ఊరు వడిగపల్లి. చిన్పప్పటి నుంచి అవ్వ, అమ్మ తప్ప బయటి ప్రపంచం తెలియదు కనకవ్వకు. అన్ని పాటలూ అమ్మ నుంచే వచ్చాయంటుంది కనకవ్వ. ఇల్లు ఊడుస్తూ ఒకపాట, వంట చేస్తూ ఇంకో పాట.. ఇలా ఒకటా రెండా ఆ బుర్రలో ఎన్నున్నాయో ఆమెకే తెలియదు.
‘టిక్ టాక్ లల్లో మా పాటలు చూసి ఇవి మనం పాడిసినవే.. మనమే ఎందుకు పాడకూడదు’ అని కనకవ్వ పిల్లలు అనే వారట. కనకవ్వ కుటుంబం కూడా చాలా పెద్దది. మొత్తం 12 మంది అక్కచెల్లెళ్లు. ఇప్పుడున్నది మాత్రం ఎనిమిది మందే. చిన్నప్పుడు ఎగురుకుంటూ బొమ్మలాటల్లో పాడేవాళ్లం. నా ఇంట్లో నేను పాడుకునేదాన్ని ఇలా బయటికొచ్చి పాడతాననుకోలేదు’ అంటోంది కనకవ్వ. ఆమెకు వాళ్ల పాడే ‘రామ రామ ఉయ్యాలో’ అనే బతుకమ్మ పాటంటే బాగా ఇష్టమట. కనకవ్వ పాటలోని తాత్వికతకు అందరూ ముగ్ధులవుతుంటారు.
‘పూలకు రంగులుంటాయిగానీ పూజకు రంగులుంటాయా.. పువ్వులాంటిదే నీ ఆత్మ, పూజలాంటిదే పరమాత్మ’ అంటూ ఆమె పాడుతుంటే అలాంటి పాటలు ఎలా పుట్టాయి.. అవి ఆమె చెంతకు ఎలా చేరాయి అని కూడా అనిపిస్తుంది. ఇలాంటి ఆణిముత్యాలు ఇంకెన్నిటిని మన సామాజిక మాధ్యమాలు మనకు అందిస్తాయో చూడాలి.
– హేమసుందర్ పామర్తి