వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికార పగ్గాలు చేపట్టాక.. ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్న ఆందోళనలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే పరిమితికి మించి అప్పులు చేసిన జగన్ సర్కారు.. మరింత అప్పు కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చైర్మన్ గా పనిచేసి రిటైర్ అయిన ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు రజనీష్ కుమార్ ను జగన్ సర్కారు సలహాదారుగా నియమించుకున్న సంగతి తెలిసిందే. ఎప్పుడైతే రజనీష్ కుమార్ ఆ బాధ్యతల్లోకి ఒరిగిపోయారో.. అప్పుడే జగన్ సర్కారుకు కొత్తగా అప్పులు పుట్టుకొచ్చాయి. మొన్నటికి మొన్న ఏకంగా రూ.10.5 వేల కోట్ల అప్పు పుట్టగా.. తాజాగా కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం మరో రూ.18.5 వేల కోట్ల అప్పు పుట్టేందుకు మార్గం సుగమం అయ్యింది. వెరసి ‘‘లియో న్యూస్’’ చెప్పినట్లుగా జగన్ సర్కారుకు రజనీష్ కుమార్ గోల్డెన్ లెగ్ గానే పరిణమించారన్న వాదనలకు బలం చేకూరింది.
తాజా అప్పు ఎలాగంటే..?
మూల ధన సమీకరణలో లక్ష్యాల మేరకు ఫలితం సాధించిన రాష్ట్రాలకు కొత్తగా అప్పు తీసుకునేందుకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఇలా కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం కొత్తగా అప్పు తీసుకునే వెసులుబాటు 11 రాష్ట్రాలకు లభించింది. ఈ జాబితాలో ఏపీ కూడా ఉంది. కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం జగన్ సర్కారుకు ఇప్పటికిప్పుడు రూ.2,665 కోట్ల మేర అప్పు తీసుకునే వెసులుబాటు కలిగింది. అంతేకాకుండా మరో రూ.15,721 కోట్ల అప్పుకు కూడా ఏపీకి వెసులుబాటు లభించింది. అయితే ఈ రూ.15,721 కోట్ల అప్పును జగన్ సర్కారు 2021-22 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనూ తీసుకోవాల్సి ఉంది. వెరసి కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఏపీకి కొత్తగా రూ.18,500 కోట్ల మేర అప్పు లబించినట్టే.
అప్పులు సరే.. తీర్చేదెలాగో?
జగన్ సర్కారు ఈ రెండున్నరేళ్ల కాలంలోనే ఏకంగా రూ.1.7 లక్షల కోట్ల మేర అప్పు చేసింది. రాష్ట్ర విభజన సమయంలో నెత్తిపై పడిన అప్పు, చంద్రబాబు ఐదేళ్ల పాలనలో అయిన అప్పు.. తాజాగా జగన్ సర్కారు చేసిన అప్పుతో రాష్ట్రం ఇప్పటిదాకా తీసుకున్న మొత్తం అప్పు రూ.5 లక్షల కోట్ల దాకా చేరిపోయినట్టే. ఓ వైపు ఆదాయ మార్గాలు అంతకంతకూ తగ్గిపోతుండగా.. దొరికిన చోటల్లా అప్పులు చేసుకుంటూ.. కొత్త అప్పుల కోసం సరికొత్త మార్గాలు వెతుక్కుంటూ సాగుతుంటే.. జగన్ ఐదేళ్ల పాలన ముగిసేలోగా ఏపీ అప్పు రికార్డు స్థాయికి చేరిపోవడం ఖాయమనే చెప్పాలి. మరి ఇంతేసి అప్పులు తీసుకుంటూ ఉంటే.. ఆ అప్పులను తీర్చడం ఎలా? వాటికి వడ్డీలు కట్టేదెలా? భవిష్యత్తులో వడ్డీలు కట్టేందుకు కూడా అప్పులు చేయక తప్పదా? అన్న వాదనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి.











