దేశానికి వెన్నెముకగా నిలుస్తున్న వ్యవసాయ రంగంలో కొత్తగా తీసుకొచ్చిన మూడు చట్టాలను వ్యతిరేకిస్తూ అన్నదాతలతో నరేంద్ర మోదీ సర్కారు సోమవారం ఏడోసారి చర్చలకు సిద్ధమైంది. ఇప్పటి దాకా ఆరు పర్యాయాలు కేంద్రం చర్చలు జరిపినా… అన్నదాతలు తమ డిమాండ్లు నెరవేరే దాకా నిరసనలు విరమించేది లేదని తెగేసి చెప్పారు. ఈ క్రమంలో సోమవారం నాటి ఏడో దఫా చర్చల్లో మూడు చట్టాల రద్దుతో పాటు కనీస మద్దతు ధరలపై రైతులతో కేంద్రం చర్చలు జరిపేందుకు ఒప్పుకుంది. ఈ నేపథ్యంలో ఏడో దఫా చర్చలతోనైనా తమ డిమాండ్లకు కేంద్రం ఓకే చెబుతుందా? లేదంటే… తాము చెప్పినట్లుగానే అన్నదాతలు మరింత కాలం పాటు తమ ఆందోళనలను కొనసాగిస్తారా? అన్న అంశంపై యావత్తు దేశ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.
నెల రోజులకు పైగా రైతుల ఆందోళనలు
సాగు రంగంలో కీలక మార్పులు చేస్తున్నట్లుగా ప్రకటించిన నరేంద్ర మోదీ సర్కారు.. కొత్తగా మూడు చట్టాలను ప్రతిపాదించడంతో పాటుగా వాటిని పార్లమెంటులో పెట్టి ఆమోదించేసింది. అయితే, ఈ చట్టాలతో తాము తీవ్రంగా నష్టపోతామని రైతాంగం ఆందోళన బాట పట్టింది. కొత్త సాగు చట్టాలతో తమకు న్యాయమేమీ జరగకపోగా… కార్పొరేట్లకు, మధ్య దళారీలకు మాత్రమే సదరు చట్టాలు ఉపయుక్తంగా ఉన్నాయని, అంతేకాకుండా కనీస మద్దతు ధర అనేది కలగానే మిగిలిపోతుందని, తమ పంట ఉత్పత్తులను విక్రయించుకునేందుకు ఇప్పటిదాకా ఎంతగానో ఉపయోగపడిన వ్యవసాయ మార్కెట్లు కనుమరుగు కావడం ఖాయమన్న వాదనలతో రోడ్డెక్కిన అన్నదాతలు… దేశ రాజధాని ఢిల్లీని నలుదిక్కులా ముట్టడించేశారు. నెల రోజులకు పైగా అక్కడే ఉంటూ రోడ్లపైనే తింటూ అక్కడే నిద్రిస్తూ తమదైన శైలి ఆందోళనలు కొనసాగిస్తున్నారు. తొలుత ఈ ఆందోళనలను పెద్దగా పట్టించుకోని మోదీ సర్కారు… రైతన్న ఆందోళనలు అంతకంతకూ తీవ్రతరం కావడంతో దిగిరాక తప్పలేదు. తాము తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేసేందుకు ససేమిరా అంటున్న మోదీ సర్కారు.. వాటిలో సవరణలకు మాత్రం సిద్ధమని ప్రకటించింది. ఈ క్రమంలో చర్చలకు రావాలంటూ కేంద్రం ఇచ్చిన పిలుపునకు రైతులు కూడా సరేనన్నారు.

కేంద్రం ఆరు చర్చల్లో ఒక్కో తరహా ప్రతిపాదనలు
కేంద్రం ప్రతిపాదించిన మేరకు ఇప్పటిదాకా ఇరుపక్షాల మధ్య ఆరు విడతలుగా చర్చలు జరిగాయి. ఆరు పర్యాయాలు కూడా కొత్త సాగు చట్టాలను పూర్తిగా రద్దు చేయాల్సిందేనని పట్టుబట్టిన అన్నదాతలు… అందుకు ప్రత్యామ్నాయంగా ఎలాంటి ప్రతిపాదనలను అంగీకరించేది లేదని కూడా తేల్చి చెప్పారు. అదే సమయంలో కేంద్రం మాత్రం ఒక్కో దఫా చర్చల్లో ఒక్కో తరహా ప్రతిపాదనలను రైతుల ముందు ఉంచుతూ వచ్చింది. తొలుత అసలు కొత్త సాగు చట్టాల రద్దు అన్న మాటపై చర్చకే ససేమిరా అన్న కేంద్రం… ఆ తర్వాత దానిపై చర్చకు తలొగ్గక తప్పలేదు. అంతేకాకుండా రైతులు చేస్తున్న మరో ప్రధాన డిమాండ్ కనీస మద్దతు ధరపైనా చర్చకు కేంద్రం ఒప్పుకుంది. ఆరో దఫా చర్చల్లో ఈ ప్రతిష్టంభన తొలగిపోతుందని అంతా భావించినా… అందుకు తగ్గట్లుగా ఫలితం అయితే రాలేదు. ఇరు వర్గాలు కూడా తమ తమ వాదనలకే కట్టుబడి సాగడంతో ఆరోదఫా చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. అయితే మరోమారు చర్చలకు ఇరువర్గాలు అంగీకరించి… సోమవారం నాడు ఏడో దఫా చర్చలకు సుముఖత వ్యక్తం చేశాయి.
సర్వత్రా ఆసక్తి
ఈ క్రమంలో సోమవారం నాడు జరగనున్న ఏడో దఫా చర్చలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొత్త సాగు చట్టాల రద్దు, కనీస మద్దతు ధరపై చర్చించేందుకు కేంద్రం అంగీకరించిన నేపథ్యంలో రైతులు కూడా కాస్తంత పట్టు విడుపులు ప్రదర్శించే అవకాశాలు కనిపిస్తున్నా… కొత్త చట్టాలను రద్దు చేసేందుకు ఒప్పుకుంటేనే ఆందోళనలను విరమిస్తున్నామని అన్నదాతలు చెబుతుండటంతో ఈ దఫా చర్చలు కూడా సానుకూల ఫలితాలను ఇచ్చే అవకాశాలు లేవన్న వాదనలు బలంగానే వినిపిస్తున్నాయి. కొత్త సాగు చట్టాలను రద్దు చేయడంతో పాటుగా కనీస మద్దతు ధరకు హామీ ఇవ్వాలంటూ అన్నదాతలు గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. కొత్త చట్టాల రద్దు మాటను పక్కనపెట్టి వాటికి అవసరమైన సవరణలకు తాము సిద్ధంగా ఉన్నామని, కనీస మద్దతు ధరపై కూడా అన్నదాతల సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని కూడా కేంద్రం చెబుతోంది. ఈ నేపథ్యంలో ఈరోజు చర్చల్లో కూడా ఆశించిన పురోగతి కనిపించే అవకాశాలే లేవన్న మాట వినిపిస్తోంది.
చర్చలు విఫలమైతే..
ఇదిలా ఉంటే… ఈ దఫా చర్చలు విఫలమైతే… చర్చల్లో తమ డిమాండ్లను పరిష్కరించకుంటే… తాము చేపడుతున్న ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని కూడా అన్నదాతలు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటి దాకా కొనసాగిన ఆందోళనలకు మించి నిరసనలు కొనసాగిస్తామని, కొత్త సాగు చట్టాలను రద్దు చేసేదాకా ఆందోళనలను విరమించే ప్రసక్తే లేదని కూడా అన్నదాతలు ఇప్పటికే ప్రకటించేశారు. ఆందోళనల్లో భాగంగా ఇప్పటికే ప్రకటించినట్టుగా ఈ నెల 6వ తేదీతో పాటు రిపబ్లిక్ డే సందర్భంగా ఈ నెల 26న ఢిల్లీలో ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించి తీరతామని కూడా రైతులు తేల్చి చెప్పారు. మొత్తంగా ఈ దఫా చర్చలు గనుక విఫలమైతే.. అన్నదాతల ఆందోళనలు మరింత ఉధృతం కావడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇదే విషయాన్ని మోదీ సర్కారు కూడా పసిగట్టినా… తన పంతాన్ని నెగ్గించుకునేందుకు తనదైన శైలి వ్యూహాలను అమలు చేసేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో నేడు జరగనున్న ఏడో దఫా చర్చలు సఫలం అయితే ఫరవా లేదు గానీ… విఫలమైతే మాత్రం పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలు లేకపోలేదు
Also Read: 1949 తర్వాత ఇప్పుడే.. వణుకుతున్న ఢిల్లీ











