ఏపీకి మరో గుడ్‌న్యూస్ చెప్పింది కేంద్రం. ఉత్తరాంధ్రుల చిరకాల వాంఛ విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. గురువారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వాల్తేరు డివిజన్‌ను విశాఖ రైల్వే డివిజన్‌గా మారుస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గురువారం రాత్రి కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. కొత్తగా రాయగడ రైల్వే జోన్‌ను ఏర్పాటు చేసి దానిని విశాఖ రైల్వే జోన్ పరిధిలోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు కేంద్రమంత్రి. రైల్వే జోన్ ఏర్పాటు కోసం పోస్ట్ ఫ్యాక్టో అప్రూవల్ ఇచ్చినట్లు తెలిపారు.
విశాఖ రైల్వే డివిజన్ పరిధిలో పలాస – విశాఖపట్నం – దువ్వాడ, కూనేరు – విజయనగరం, నౌపాడ జంక్షన్ – పర్లాకిమిడి, బొబ్బిలి జంక్షన్ – సాలూరు, సింహాచలం నార్త్ – దువ్వాడ బైపాస్, వడ్లపూడి – దువ్వాడ, విశాఖ స్టీల్ ప్లాంట్ – జగ్గాయపాలెం స్టేషన్లు ఉండనున్నాయి. వాల్తేరు డివిజన్‌లోని కొత్తవలస – బచేలి, కూనేరు – తెరువలి జంక్షన్, సింగాపురం రోడ్ – కోరాపుట్ జంక్షన్, పర్లాకిమిడి – గుణుపూర్ స్టేషన్ల పరిధితో కొత్తగా రాయగడ రైల్వే డివిజన్ ఏర్పాటు కానుంది.
విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుతో దాదాపు పదేళ్ల క్రితం నాటి విభజన హామీ పట్టాలెక్కినట్లయింది. పదేళ్లుగా విశాఖ వాసులు రైల్వే జోన్ కోసం పోరాడుతున్నారు. తాజాగా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో ఉత్తరాంధ్ర వాసుల చిరకాల స్వప్నం నెరవేరినట్లయింది. రైల్వే జోన్ పూర్తి స్థాయిలో ఏర్పాటైతే కొత్తగా 3 వేల వరకు ఉద్యోగాలు రావడంతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధి మరింత వేగవంతం కానుంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీలో పెండింగ్ హామీలపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి భారీగా నిధులు సాధించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ పునర్నిర్మాణం కోసం దాదాపు రూ.11 వేల కోట్లకుపైగా భారీ ప్యాకేజీ ప్రకటించింది. ఇక రెండు రోజుల క్రితం నారా లోకేష్ ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు.