నూతన వ్యవసాయ చట్టాలపై 40 రైతు సంఘాలు కేంద్రంతో ఏడోసారి జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. రైతు సంఘాల నాయకులు ప్రధానంగా నూతనంగా తీసుకు వచ్చిన మూడు చట్టాల రద్దుకు పట్టు పట్టారు. దీంతో చర్చలు ముందుకు సాగలేదు. చట్టాలను పూర్తిగా రద్దు చేసేందుకు కేంద్రం ససేమిరా అంటోంది. దీంతో రైతు సంఘాలతో ఏడోసారి జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. కాంట్రాక్టు వ్యవసాయం, కార్పొరేట్లు సరుకును పెద్దఎత్తున నిల్వ చేసుకునే వీలు కల్పించడంతోపాటు, మద్దతు ధరకు చట్టబద్దత లేకపోవడంపై రైతు సంఘాలు పట్టుపట్టాయి. నూతన చట్టాలు పూర్తిగా రద్దుకు వారు డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రులు అంగీకరించకపోవడంతో చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఈ నెల 8న మరోసారి సమావేశం కావాలని రైతు సంఘాలు, కేంద్ర మంత్రుల బృందం నిర్ణయించింది.
కేంద్రం కాలయాపన చేస్తోందా?
దాదాపు మూడు లక్షల మంది రైతులు ఢిల్లీ రోడ్లపై చలికి వణుకుతుంటే కేంద్రం చట్టాల రద్దుపై కాలయాపన చేస్తోందని రైతు సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఇప్పటికే నలుగురు రైతులు చలికి తట్టుకోలేక చనిపోయారని, ఇంకా చలి తీవ్రత పెరుగుతోందని, కేంద్రం మాత్రం చట్టాల రద్దుకు అంగీకరించడం లేదని వారు ఆగ్రహంతో ఉన్నారు. నూతన చట్టాల్లో సవరణలు చేసేందుకు మాత్రమే కేంద్రం చర్చలకు పిలుస్తోందని, ఇది తమకు ఆమోదయోగ్యం కాదని 40 రైతు సంఘాల నాయకులు స్పష్టం చేశారు. నూతన చట్టాలు రద్దు చేసే వరకు ఢిల్లీని వీడేది లేదని వారు కుండ బద్దలుకొట్టారు.