ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా, మన దేశంలోనూ విలయం సృష్టించిందనే చెప్పాలి. మన దేశంలో కోటి మందికిపైగా కరోనా భారిన పడ్డారు. లక్షా 45 వేల మంది మృత్యువాత పడ్డారు. ఇంతటి విలయం సృష్టించిన కోవిడ్ కు ఎట్టకేలకు భారత్ లోనే తయారైన రెండు టీకాలు కోవిషీల్డ్, కోవాగ్జిన్ మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం కరోనా సెస్సు వేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. కరోనా టీకా ప్రతి ఒక్కరికీ ఉచితంగా ఇస్తామని ప్రకటించిన కేంద్రం కరోనా సెస్సు రూపంలో జనం నుంచి పిండుకోవాలనే యోచనలో కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది.
కరోనా సెస్సు అందరిపై..
కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల కిందటే రెండు కంపెనీల కరోనా టీకాలకు అనుమతి ఇచ్చింది. ఆయా కంపెనీల నుంచి కేంద్రం టీకా మందు సేకరించి రాష్ట్రాలకు ఉచితంగా సరఫరా చేయనుంది. ఒక్కో డోసు రూ.230 చొప్పున రెండు డోసులు కలపి రూ.460 అవుతోంది. రవాణా, నిల్వ, ఇతర ఖర్చులన్నీ కలపి ఒక్కో వ్యక్తికి టీకా వేయడానికి కేంద్ర ప్రభుత్వానికి రూ.600 దాకా ఖర్చవుతుందని లెక్కగట్టారు. ఈ లెక్కన దేశంలోని 136 కోట్ల మందికి టీకా ఉచితంగా వేస్తే కేంద్రంపై రూ. 81600 కోట్ల భారం పడే అవకాశం ఉంది. ఈ ఏడాది డిసెంబరు నాటికి కనీసం సగం జనాభాకు టీకా వేసినా కేంద్రం ప్రభుత్వంపై రూ.40000 కోట్లపైగా భారం పడనుంది. ఈ ఖర్చును ప్రజల నుంచే వసూలు చేయాలని కేంద్రం కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. జీఎస్టీకి తోడు కరోనా సెస్సు కూడా విధించి 2021లో కనీసం రూ.40000 కోట్లు వసూలు చేయాలనే ఉద్దేశంతో కేంద్రం ఉన్నట్టు సమాచారం అందుతోంది.
Must Read ;- స్వదేశీ కొవాగ్జిన్ చూసి వాళ్లు ఏడుస్తున్నారా..?
ఎంత వేస్తారు?
కరోనా కారణంగా ఇప్పటికే 3 కోట్ల మంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయారు. పన్నులు కూడా విపరీతంగా పెరిగాయి. పెట్రోలు డీజిల్ ధరలు జీవిత కాల గరిష్ఠ స్థాయిలో ఉన్నాయి. ఇక జీఎస్టీ సంగతి చెప్పే పనే లేదు. 3 శాతం నుంచి 24 శాతం దాకా వసూలు చేస్తున్నారు. ఇప్పటికే విద్యారంగం వృద్ధికి అరశాతం పన్ను వసూలు చేస్తున్నారు. దానికి అదనంగా కరోనా సెస్సును మరో అరశాతం వసూలు చేసే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వానికి మొత్తం జీఎస్టీ ఆదాయం ఏటా రూ.13 లక్షల కోట్లుగా ఉంది. దీనికి అదనంగా కరోనా సెస్సు ద్వారా రెండు సంవత్సరాల్లో మరో లక్ష కోట్లు పిండుకోవాలని కేంద్రం భావిస్తోంది. అందుకు సంబంధించి ఆర్థిక శాఖ కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది.
అందరికీ ఉచితంగా టీకా అంటే ఇదేనా?
దేశంలో ప్రజలందరికీ టీకా ఉచితంగా వేస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిల్లోనూ వాగ్దానాలు చేశారు. ఇప్పుడు కరోనా టీకా ఉచితంగా వేసి, సెస్సు పేరుతో ప్రజల నుంచి పిండుకోవాలని చూస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కరోనా టీకా పేరుతో మరో బాధుడుకు సిద్దం కావడంపై విపక్షాలు ఆందోళనకు సిద్దం అవుతున్నాయి.