ఇప్పుడు పట్టుబట్టకపోతే.. ఇంకెప్పటికీ ఏమీ చేయలేం. చివరకు బొమ్మలా మిగిలిపోవాల్సిందే. ఇదే ఇప్పుడు జనసేనలో జరుగుతున్న చర్చ. సామాజిక లెక్కలు చూసుకుంటే తమకే తిరుపతి అనుకూలమని మొదటి నుంచీ జనసేన బీజేపీతో వాదిస్తోంది. కాని జూనియర్ పార్టనర్‌గా జనసేనను చూస్తున్న బీజేపీ.. ఈ అవకాశం తామే వినియోగించుకోవాలని.. బలపడాలని భావిస్తోంది. అందుకే తామే పోటీ చేస్తామని అంటోంది. బీజేపీ అధిష్టానానికి జనసేన నేతలకు మధ్య జరిగిన చర్చల్లో ఏ విషయం తేల లేదు. అటు బీజేపీ ఇవ్వడానికి ఒప్పుకోలేదు.. ఇటు వదిలి పెట్టడానికి పవన్ కల్యాణ్ సైతం ఒప్పు కోలేదు. దీంతో అదలా పెండింగ్‌లోనే పెట్టి.. మెల్లగా పవన్ కల్యాణ్‌ని సవరదీయాలని బీజేపీ ఆలోచిస్తున్నట్లు వార్తలొచ్చాయి.
తిరుపతి సీటు వదిలి పెట్టొద్దని పవన్‌కు సూచన
కాని పవన్ కల్యాణ్‌కు సలహాలు ఇస్తున్న వారు మాత్రం.. తిరుపతి సీటు వదిలిపెట్టొద్దని సూచిస్తున్నారు. గతంలో చిరంజీవి ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు.. పవన్ ఫ్యాన్స్ కూడా అధికంగా ఉన్న ప్రాంతమిది. అందుకే పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. అసలు ముందే వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉంటే.. తెలుగు దేశం సైతం జనసేనకు మద్దతిచ్చేదని వారు వాదిస్తున్నారు. ఇప్పటికైనా తెలుగుదేశం నుంచి పరోక్ష సహకారం అందుకోవచ్చని.. వైసీపీ పరాజయమే లక్ష్యంగా టీడీపీ ఎత్తుగడలు ఎటూ ఉంటాయని వారంటున్నారు. బీజేపీకి మాత్రం అలాంటి మద్దతు టీడీపీ నుంచి రాదని వారంటున్నారు.
Must Read ;- జనసేనానికి ఢిల్లీ సిగ్నల్స్ నిజమేనా? బిల్డప్పా?
బీజేపీపై ప్రజల్లో అసంతృప్తి
ప్రజల్లో సైతం ప్రత్యేక హోదా, అమరావతి, పోలవరం ఇలా ప్రతి విషయంలోనూ బీజేపీ వైఖరి విమర్శలకు గురైంది. పైకి కనపడని అసంతృప్తి బీజేపీపై ప్రజల్లో తీవ్రంగా ఉంది. పైగా జీవీఎల్, సోము వీర్రాజు లాంటివారు అడ్డగోలుగా చేసిన వాదనలు.. ఏపీకి వ్యతిరేకంగా చేసిన ప్రయత్నాలు అన్నీ వారి మనసుల్లో అలాగే ఉన్నాయి. ఇవన్నీ జనసేన నేతలు బీజేపీ అధిష్టానానికి ఈసారి గట్టిగానే చెప్పారట. అవన్నీ పట్టించుకోకుండా దూకుడుగా పోతే తిరుపతి సీటు వైసీపీకే పోతుందని.. జగన్‌కి ముకుతాడు వేయలేరని చెప్పారట.
డైలమాలో బీజేపీ అధిష్టానం
దీంతో బీజేపీ అధిష్టానం డైలమాలో పడినట్లు చెబుతున్నారు. ఒకవైపు ఏపీ బీజేపీ నేతలు మాత్రం ఎట్టి పరిస్ధితుల్లో ఈ సీటు జనసేనకు వదలొద్దని వాదిస్తున్నారు. అంతే కాదు.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సైతం.. సోము వీర్రాజు ద్వారా ఆ ప్రయత్నాన్ని మరింత గట్టిగా చేస్తున్నారని సమాచారం. ఈ మధ్యే వైసీపీ ఎమ్మెల్యే రోజా జనసేనకు తిరుపతిలో పోటీ చేసే అర్హత లేదని అనటం.. బీజేపీ పోటీ చేయడంలో తప్పు లేదని అనటంతో.. జనాల్లో అనుమానాలు మరింత పెరిగాయి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకునే బీజేపీ అధిష్టానం తిరుపతి సీటు జనసేనకే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరికొన్ని రోజులు ఆగితే కాని అది నిజమో కాదో తెలియదు.
Also Read ;- రాటుదేలుతున్న జనసేనాని