ప్రస్తుతం ఏపీలో అమలవుతున్న అబ్కారీ చట్టం ప్రకారం ఏ వ్యక్తి అయినా మూడు ఫుల్ బాటిళ్ల మందు కలిగి ఉండవచ్చు. నిల్వ చేసుకోవచ్చు. వెంట తీసుకువెళ్లడం కూడా నేరం కాదు. ఈ నిబంధనలతో ఏపీకి ప్రతి నెలా రూ.600 కోట్ల నష్టం వాటిల్లుతోందని అబ్కారీ అధికారులు అంచనా వేశారు. తెలంగాణ కన్నా ఏపీలో బ్రాండెడ్ మద్యం ధరలు 200 శాతం అధికంగా ఉన్నాయి.
దీంతో చాలా మంది తెలంగాణ నుంచి ఏపీకి మద్యం తరలిస్తున్నారు. కొందరు పెద్దఎత్తున అక్రమంగా తరలిస్తున్నారు. మరికొందరు మూడు ఫుల్ బాటిళ్ల నిబంధనలు అనుసరిస్తూ చట్టం ప్రకారం మందు తరలిస్తున్నారు. దీంతో ఏపీలో తెలంగాణ బ్రాండెడ్ మద్యం ఏరులై పారుతుంది. కొందరు తెలంగాణ నుంచి మద్యం తరలించడాన్నే ఉపాధిగా మలచుకున్నారు. దీంతో అక్రమార్కులను అదుపు చేయడం పోలీసులకు సవాలుగా మారింది.
మూడు బాటిళ్లు ఏపీవి అయితేనే..
ఏ రాష్ట్రానికి చెందిన మద్యం అయినా మూడు బాటిళ్లు కలిగి ఉండవచ్చని ఏపీలో అబ్కారీ చట్టం చెబుతోంది. దీన్ని ఆసరా చేసుకుని బ్రాండెడ్ మద్యం ఏపీలోకి తీసుకువస్తున్నారు. గతంలో ఓ వ్యక్తి వద్ద మూడు బాటిళ్లు మాత్రమే ఉన్నా పోలీసులు అరెస్టు చేశారు. సదరు వ్యక్తి హైకోర్టును ఆశ్రయించడంతో, ఏపీ అబ్కారీ చట్టం ప్రకారం మూడు బాటిళ్లు కలిగి ఉండటం నేరం కాదని కోర్టు తేల్చి చెప్పింది.
దీంతో మూడు బాటిళ్లు తెస్తున్న వారిని పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు అదుపు చేయలేకపోతున్నారు. అందుకే ఏపీ మద్యం అయితే మాత్రమే మూడు బాటిళ్లు కలిగి ఉండవచ్చనే విధంగా ఎక్సైజ్ చట్టంలో సవరణలు చేయాలని ఆ శాఖ ఉన్నత అధికారులు ప్రభుత్వాన్ని కోరారని తెలుస్తోంది. త్వరలో ఈ చట్టానికి సవరణ జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే ఇక తెలంగాణ నుంచి మందుబాబులు మద్యం తెచ్చుకోవడం సాధ్యం కాదు. మూడు బాటిళ్లు తెచ్చుకున్నా సరే స్మగ్లింగ్ కిందకు వస్తుంది.
త్వరలో మద్యం మాల్స్, విశాఖలో ఫ్లోటింగ్ క్యాసినో
ఏపీలో అన్నీ బ్రాండ్లు దొరికే విధంగా మద్యం మాల్స్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. తెలంగాణ నుంచి అక్రమ మద్యం పెద్ద ఎత్తున ఏపీలోకి తీసుకువస్తున్నారు. పోలీసులు ఎంత ప్రయత్నించినా అడ్డుకోలేకపోతున్నారు. తెలంగాణతో ఏపీకి సుదీర్ఘ బోర్డర్ ఉండటంతో పోలీసులు కేవలం చెక్ పోస్టుల వద్ద మాత్రమే చెకింగ్ చేయగలుగుతున్నారు. కృష్ణా నదిలో అనేక చోట్ల చిన్న చిన్న బోట్ల సాయంతో ఏపీలోకి అక్రమంగా మద్యం సరఫరా అవుతోందని తెలుస్తోంది. వీటన్నింటికి చెక్ పెట్టే విధంగా తెలంగాణ ధరకు పోటీగా ఏపీలో మద్యం మాల్స్ పెట్టాలని ప్రభుత్వం యత్నిస్తోందని తెలుస్తోంది.
విశాఖలో ఫ్లోటింగ్ క్యాసినో ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. పర్యాటకరంగం అభివృద్ధి పేరుతో క్యాసినో, మద్యం దొరికే విధంగా విశాఖ సముద్ర తీరంలో ఫ్లోటింగ్ క్లబ్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తెరమీదకు తెచ్చారు. చాలా మంది క్యాసినో కోసం గోవా వెళుతున్నారని, దాని వల్ల ఏపీ ఆదాయం కోల్పోతోందని అధికారులు ఓ అంచనాకు వచ్చారని తెలుస్తోంది. ఏపీ ఆదాయం పెంచడంతోపాటు వినోద పరిశ్రమ అభివృద్ధికి అవకాశం దొరుకుతుందని అధికారులు భాష్యం చెబుతున్నారు.
పెట్రోలు, డీజిల్‌కు కూడా నిబంధనలు పెడతారేమో…
పొరుగు రాష్ట్రాలకన్నా ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఏపీ సరిహద్దుల్లోని పొరుగు రాష్ట్రాల పెట్రోలు పంపుల వారు బోర్డులు ఏర్పాటు చేసుకున్నారు. ఏపీ ధరలతో పోల్చితే తమ వద్ద ధర ఎంత తక్కువో తెలిపే బోర్డులను పెట్టారు. కర్నాటక సరిహద్దులోని ఓ పెట్రోలు పంపులో ఏపీ కన్నా లీటరు పెట్రోలు రూ.7, లీటరు డీజిల్ రూ.5 తక్కువని పెద్ద పెద్ద బోర్డులు పెట్టారు. దీంతో భారీ వాహనాలతో పాటు ఏపీలోని సరిహద్దు గ్రామాల వాహనదారులు పొరుగు రాష్ట్రాల్లోని సరిహద్దు పెట్రోలు పంపుల్లో ఆయిల్ తెచ్చుకుంటున్నారు.
మద్యం తెచ్చుకోడానికి చట్టం ఇచ్చే అనుమతుల్ని తొలగించడానికి చట్టమే మారుస్తున్న తరుణంలో.. దీన్ని కూడా నియంత్రిస్తారేమోనని వినియోగదారులు చర్చించుకుంటున్నారు. ఏమో ఏదైనా జరగొచ్చు.