యువగళం నవశకం సభ జరిగిన తీరు ఉత్తరాంధ్రలో టీడీపీకి ఎంతటి బలాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ దెబ్బతో ఇక ఉత్తరాంధ్రలో వైసీపీ వాష్ అవుట్ అనే అభిప్రాయం వ్యక్తం అవుతూ ఉంది. ఇప్పటికే యువగళం నవశకం సభను చూసి తాడేపల్లి ప్యాలెస్‌లో కాళ్లు వణుకుతున్నాయి. అయితే, టీడీపీ ఇదే ఊపులో మరో రెండు అతి భారీ సభలను నిర్వహించాలని తలపెట్టింది. ఆ రెండు సభలు ఒకటి కోస్తాంధ్ర నడిబొడ్డున, మరొకటి రాయలసీమలో నిర్వహించనున్నారు.
విజయనగరం జిల్లా పోలిపల్లిలో నిర్వహించిన ఇలాంటి భారీ సభల్లాంటివి మరో రెండు త్వరలోనే నిర్వహిస్తామని చంద్రబాబు ప్రకటించారు. అమరావతిలో ఒకటి.. తిరుపతిలో మరొకటి నిర్వహించనున్నారు. ఎన్నికలకు మరో మూడు నెలల సమయం ఉన్నందున టైం చూసుకొని ఈ భారీ సభలను నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో నిర్వహించిన ఈ యువగళం నవశకం సభకి భారీగా జనాలు తరలివచ్చారు. ఇప్పుడు మరో రెండు సభలు అని చంద్రబాబు ప్రకటించగానే.. జగన్ కు భయం పట్టుకుంది. త్వరలో నిర్వహించబోయే ఆ రెండు సభలు జగన్‌కి తలనొప్పిగా మారబోతున్నాయి.
పైగా అమరావతి, తిరుపతిలో నిర్వహించే సభా వేదికలపై నుంచి మేనిఫెస్టోను ప్రకటిస్తామని చంద్రబాబు వెల్లడించారు. టీడీపీ-జనసేన పొత్తును ముందుకు తీసుకెళ్తామని, భవిష్యత్ కార్యక్రమాలపై కీలక ప్రకటనలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. మీరు ఒక్క అడుగు ముందుకు వేసి మమ్మల్ని గెలిపిస్తే.. మేం మీకోసం వంద అడుగులు ముందుకు వేసి మిమ్మల్ని గెలిపిస్తాం అంటూ చంద్రబాబు ఉత్సాహం నింపారు. మీరు ఒక త్యాగం చేస్తే.. మేం వంద త్యాగాలు చేసి ఆంధ్రప్రదేశ్ ను పైకి తీసుకురావడానికి రెడీగా ఉన్నట్లు చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు.
ఇప్పటికే రాష్ట్రం వైసీపీ విముక్తం కావాలని.. జగన్ చేసిన పాపాలు రాష్ట్రాన్ని శాపంలా చుట్టుకున్నాయని టీడీపీ చెబుతూ వస్తోంది. జగన్ రాజకీయాలకు ఏ మాత్రం పనికిరాని వ్యక్తి అని అటు జనసేన కూడా బలంగా వాదిస్తూ వస్తోంది. అది ప్రజలు కూడా నిజమేనని నమ్ముతున్నారు. అందుకే ప్రస్తుతం టీడీపీ, జనసేన ప్రజా కార్యక్రమాలకు విపరీతమైన జనాదరణ ఉంటోంది. ఇదే ఉత్సాహంతో రెండు పార్టీలు ముందుకు వెళ్తూ.. తాడేపల్లి ప్యాలెస్ లో జగన్ ను నిద్ర పోనివ్వకుండా చేస్తున్నారు.