ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని సీఐడీ పోలీసులు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో అరెస్టు చేసి.. విచారించి.. ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టి.. సుమారు 10 గంటల హైడ్రామా అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైల్‌కు పంపించారు. అయితే చంద్రబాబును జైలుకు పంపించిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో సీఐడీ పోలీసులు స్కామ్ జరిగిందని చెబుతున్న నిధులు రూ. 270 కోట్లు. కానీ అంతకంటే ముందు శనివారం సీఐడీ చీఫ్ మీడియాతో మాట్లాడుతూ రూ. 550 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పారు. కానీ సీఐడీ తాను కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో మాత్రం రూ. 270 కోట్ల స్కామ్ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్‌లో జరిగిందని పేర్కొన్నారు. స్కీమ్ జరిగిన సమయంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగారని.. ఆయన కనుసన్నల్లోనే ఈ మొత్తం వ్యవహారం అంతా జరిగిందని సీఐడీ పోలీసులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది.
ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్‌లో రూ. 270 కోట్ల స్కామ్ చేయాల్సిన అవసరం ఆయనకు ఉందా? అనేది ప్రశ్న. 2014 లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయ్యే నాటికి అంతకుముందే ఆయన 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అప్పటికే సుమారు 34 సంవత్సరాలుగా రాజకీయ నాయకులుగా ఉన్నారు. మంత్రిగా పనిచేశారు.. ప్రతిపక్ష నేతగా కూడా పనిచేశారు. అంతటి రాజకీయ అనుభవం ఉండి.. అలాగే తన భార్య ఎప్పటి నుంచో వ్యాపారం కొనసాగిస్తుండగా.. తాను కూడా రాజకీయాల్లోకి వచ్చిన తరువాత అనేక వ్యాపారాలు కూడా చేశారు. ఇంతటి ఆదాయ వనరులు ఉండగా.. కేవలం రూ. 270 కోట్లను స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ నుంచి తీసుకున్నారంటే.. అది ఎంత మేరకు నిజం అనేది ప్రశ్నార్థకం గా ఉంది. ఎందుకంటే చంద్రబాబు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు.. అయన నిజంగానే అవినీతి చేయాలంటే.. కేవలం రూ. 270 కోట్లు చేస్తారా? అనేది అందరిముందు ఉన్న ప్రశ్న. అవినీతి చేయాలనుకుంటే వేల కోట్లను చేస్తారు కానీ.. మరీ లెక్కపెట్టుకున్నట్టు రూ. 270 కోట్లను చేయరని సాధారణంగా రాజకీయాలు అవగాహన ఉన్న ప్రతి ఒక్కరూ చెబుతారు. అలాగే టీడీపీ నేతలతోపాటు ఇతర ప్రతిపక్ష నేతలు కూడా చంద్రబాబు అవినీతి చేశారంటే.. అది ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నిస్తున్నారు.
చంద్రబాబు నాయుడు 1977 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. మొదటి సారి ఎమ్మెల్యలేగా గెలిచిన తరువాత రెండేళ్లకే ఆయన మంత్రి అయ్యారు. ఆ తరువాత కూడా మంత్రిగా కొనసాగారు. 1994లో ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత కొన్ని సంవత్సరాల్లోనే పలు వ్యాపారాలను ప్రారంభించారు. ఆ వ్యాపారాల ద్వారానే ఆయన సంపాదన చేసుకుంటూ వస్తున్నారని అందరికీ తెలిసిందే. పెళ్లి తరువాత భార్య తరపున నుంచి వచ్చిన నిధులతో.. తన భార్యపేరుతో మరో వ్యాపారం ప్రారంభించారు. ఇలా సుమారు 45 సంవత్సరాలకుపైగా ఆయన రాజకీయాల్లో ఉంటూ.. వ్యాపారాలు చేస్తూ ఆదాయం గడిస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. సాధారణ జనం కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.
చంద్రబాబు నాయుడు ఒకేసారిగా రాజకీయాల్లోకి రాలేదు. పైగా ఆయన వారసత్వ రాజకీయాలతో రాజకీయాల్లోకి రాలేదు. తాను విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. చదువు ముగిసిన తరువాత యువజన రాజకీయాల్లో కొనసాగారు. అనంతరం ఎమ్మెల్యేగా గెలిచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రజాప్రతినిధిగా తన 28 ఏళ్ల వయస్సులోనే వచ్చారు. అప్పటి నుంచి ప్రస్తుతం 74 సంవత్సరాల వయస్సు వరకు ఆయన అనేక వ్యాపారాలు చేశారు.. తన భార్య కూడా వ్యాపారాల్లో ఉన్నారు. ఇన్నిరకాలుగా ఆయన ఆదాయం వస్తుంటే.. తాను ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రభుత్వ సొమ్మును లూటీ చేసి స్కామ్‌ల పేరుతో తాను కొల్లగొట్టాల్సిన అవసరం ఏముందని చంద్రబాబు కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తాను ఏమీ ఏకాఏకిగా రాజకీయ నాయకుడిగా మారలేదని.. అలాగే ఒకేసారి తనకు వందలు, వేల కోట్లు రాలేదని చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడి స్వయంగా చెప్పారు. అలాగే తన ఎన్నికల అఫిడవిట్లో కూడా తనకు ఉన్న ఆస్తులను సక్రమాంగా ప్రకటిస్తున్నారు. ఇంత నిజాయితీగా ఉండే చంద్రబాబు కేవలం రూ. 270 కోట్లకు స్కామ్ చేశారని సీఐడీ పోలీసులు సిట్ అధికారులు ఆరోపించడం.. ఏసీబీ కోర్టుకు తీసుకెళ్లడం.. అక్కడి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడం అంతా కుట్రలో భాగంగానే జరిగిందనేది అర్థం అవుతుందని చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు, ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు.
ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయించి తన పెళ్లిరోజు నాడే జైలుకు పంపించడం కుట్ర పూరితంగా చేశారని టీడీపీ నేతలు, ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇక్కడ మరో విషయంపై కూడా ప్రజలు, ప్రతిపక్షాలు ఆలోచిస్తున్నాయి. అదేమిటంటే ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి తాను ఎంపీగా ఎన్నికైన సమయంలో అన్ని వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి. ఆయన చేసిన వ్యాపారం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఆయనకు తన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరు చెప్పి రాజకీయాల్లోకి వచ్చారు.. అలాగే రాజశేఖర్‌రెడ్డి పేరు చెప్పుకునే వ్యాపారాలు చేశాడు. ఇలా ఆయన మొత్తం తన తండ్రిని అడ్డుపెట్టుకొని సంపాదన చేశారనే విమర్శలు ఉన్నాయి. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చనిపోయిన తరువాత తననే సీఎంను చేయాలని జగన్ ఎమ్మెల్యేలతో సంతకాల సేకరణ కూడా చేశారని ప్రచారం సాగింది. ఆయన చేసిన విధానం నచ్చకనే కేంద్రంలో ఉన్న వారి కాంగ్రెస్ పార్టీనే జగన్‌ను అక్రమాస్తుల కేసులో అరెస్టు చేయించి.. తరువాత జైలుకు పంపించింది. సుమారు 16 నెలలకు పైగా జగన్ జైలులో ఉన్నారు.
జగన్ ఏమైనా రివెంజ్ తీసుకుంటే అప్పటి కాంగ్రెస్ అధిష్టానంగా ఉన్న సోనియాగాంధీ, ఇతరులపై తీసుకోవాలని అంతేగానీ.. జగన్ జైలుకు వెళ్లడానికి ఎటువంటి సంబంధం లేని చంద్రబాబు నాయుడిపై అనవసరంగా కుట్రపూరితంగా అవినీతి ఆరోపణలు చేసి జైలు పంపారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. జగన్ లాగా చంద్రబాబు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఏనాడు ఆదాయం పొందలేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. అలా చేసి ఉంటే ఆయన గతంలో 9 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నో స్కీమ్‌లు తీసుకొచ్చారు. వాటిలో ఎక్కడా అవినీతి జరిగినట్టు ఆరోపణలు లేవు. ఆ తరువాత రాష్ట్ర విభజన తరువాత కూడా అనేక ప్రభుత్వ పథకాలను అమలు చేశారు. వాటిలోనూ అవినీతి ఆరోపణలు లేవని.. కానీ కావాలని స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్‌లో రూ. 270 కోట్లు అవినీతి జరిగిందని.. ఆధారాలు ఉన్నాయని చెబుతూ సీఐడీ పోలీసులు సిట్ అధికారులు కేసును చంద్రబాబుపై పెట్టి.. కేసులో ఎక్కడో చివర ఉన్న చంద్రబాబును అరెస్టు చేసి జైలుకు పంపించడం కుట్ర పూరితంగా.. దురుద్దేశంతో కావాలనే చేశారని అర్థం అవుతుందని ప్రతిపక్షాలు, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.