భారత ప్రధాని నరేంద్రమోదీ రాజకీయాల్లోకి వచ్చి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రాసిన ప్రత్యేక కథనం ది హిందూ పేపర్లో ప్రచురితమైంది. తన 48 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో మార్పులను దగ్గరుండి చూశానని, అయితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేశాన్ని ముందుకు నడిపించడానికి సమర్థవంతమైన నాయకత్వం చాలా ముఖ్యమని మోదీ 25 ఏళ్ల ప్రస్థానాన్ని విశ్లేషిస్తూ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సమర్థవంతమైన నాయకత్వం కేవలం రాజకీయాల వల్ల మాత్రమే సాధ్యం కాదని, అది ప్రజల్లో సంపాదించుకునే నమ్మకంపై ఆధారపడి ఉంటుందని చంద్రబాబు రాసుకొచ్చారు.
గత దశాబ్ద కాలంలో భారతదేశంలో జాతీయ రహదారులు 91,287 కిలోమీటర్ల నుండి 1,46,000 కిలోమీటర్లకు పైగా విస్తరించాయని, విమానాశ్రయాలు 74 నుండి 160కి పైగా పెరిగాయని మౌలిక వసతుల కల్పనను ఉదాహరించారు. అలాగే PM గతి శక్తి, 80 కోట్ల మందికి ఉచిత బియ్యం, గ్రామీణ ప్రాంతాల్లో కుళాయి నీటి కనెక్షన్లు 17% నుండి 82%కి పెరగడం మోదీ నిరంతర కృషికి నిదర్శనమని చెప్పారు.
సాంకేతికతను దేశ నిర్మాణానికి, సంక్షేమాన్ని ప్రజలకు నేరుగా చేరవేసేందుకు మోదీ ఉపయోగించిన తీరు అద్భుతమని చంద్రబాబు కొనియాడారు. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెమీకండక్టర్ మిషన్, క్వాంటమ్ మిషన్, PLI పథకాల ద్వారా భారత్‌ను గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజాల సరసన నిలిపారని చెప్పారు.
అంతేకాకుండా అంతరిక్ష రంగాన్ని ప్రైవేట్ రంగానికి తెరవడంతో స్కైరూట్, పిక్సెల్, అగ్నికుల్ వంటి స్టార్టప్‌లు దూసుకుపోతున్నాయని చంద్రబాబు వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభాలు, మహమ్మారులు, యుద్ధాలు, భౌగోళిక అస్థిరతలు తలెత్తినప్పటికీ భారతదేశం స్థిరమైన ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
టీమ్ ఇండియా భావనతో కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే దేశాభివృద్ధి సాధ్యమని మోదీ నమ్ముతారని, కోఆపరేటివ్ అండ్ కాంపిటీటివ్ ఫెడరలిజం ద్వారా రాష్ట్రాలకు అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించారని తెలిపారు. మోదీ సుపరిపాలన భారత్‌లో సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపిందని చంద్రబాబు రాశారు. రిమిత ఆలోచనల నుంచి ఆశయాల వైపు, సంకోచం నుంచి విశ్వాసం వైపు దేశ అభివృద్ధి పథాన్ని మోదీ మళ్లించారంటూ ప్రశంసించారు. రాబోయే రోజుల్లో వికసిత్ భారత్ 2047 కల నెరవేరడమే కాకుండా, ప్రపంచంలోనే అత్యున్నత శక్తిగా భారత్ నిలుస్తుందని చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆర్టికల్‌ని పీఎమ్‌వో స్పెషల్‌గా షేర్ చేసింది.. ఆ కథనాన్ని అందరూ చదవాలని సూచించింది.. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..











