ఏపీలో కొందరు పోలీసు అధికారులు వ్యవహరిస్తున్న తీరు, ఏపీలో చోటుచేసుకుంటున్న సంఘటనల నేపథ్యంలో మాజీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఏపీ పోలీసు అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మాచర్ల ఘటన నేపథ్యంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం ఘాటైన వ్యాఖ్యలు చేసింది. 40ఏళ్ల ఇండస్ట్రీ, పొరుగురాష్ట్రంనుంచి వచ్చే రాజకీయనాయకుడు అని చెబుతూ పోలీసు అధికారుల సంఘం పేరుతో ప్రకటన వెలువడింది.
అయితే ప్రభుత్వాల్లో అన్ని విభాగాల్లో ఉద్యోగసంఘాలు ఉంటాయి. అలాగే పోలీసు అధికారుల సంఘం కూడా అలాంటింది. ఆ ఉద్యోగసంఘాలు ఉద్యోగ సంక్షేమం కోసం, తమ హక్కులకోసం పోరాడుతుంటాయి. అది ప్రజాస్వామ్యంలో ఓ భాగం. అలా ఉంటేనే వ్యవస్థలకు మనుగడ ఉంటుంది. ఆ సంఘాలు విశ్వసనీయతను కోల్పోకూడదంటే.. సదరు సంఘాలు లేదా సంఘాల్లోని ఎవరికి ఏకపక్షంగా మద్దతు ఇవ్వకూడదు.. పక్షపాతం చూపించకూడదు. కాని కొందరు వ్యక్తులు చేస్తున్న కామెంట్లు.. ఏపీ పోలీసు అధికారుల సంఘానికి చెడ్డపేరు తీసుకొస్తున్నాయనే చర్చ మొదలైంది.
వైసీపీ అంటే భయమా..
చంద్రబాబు లేదా ఇతర ప్రతిపక్ష నాయకులు చేసిన విమర్శలపై ఏపీ పోలీసు అధికారుల సంఘం స్పందిస్తుంది సరే.. కాని వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి బహిరంగంగానే బొంగులో పోలీసులు అన్నప్పుడుగాని, కొందరు సీఐలు తమ కాళ్లు పట్టుకున్నారని చెప్పినప్పుడుకాని, తరువాత వేరే ప్రాంతంలో పోలీసులపై వైసీపీ దాడి చేసినట్టుగా ఫొటోలు బయటకు వచ్చినప్పుడు, అధికార పార్టీ ఎమ్మెల్యే ఓ ఎస్సైని ఫోన్లో తిట్టినప్పుడు గాని పోలీసు అధికారుల సంఘం సరైన రీతిలో స్పందించలేదనే కామెంట్లు వచ్చాయి. అంటే వైసీపీ ఏం చేసినా ఆ సంఘం స్పందించదని, కేవలం టీడీపీనే టార్గెట్ గా చేస్తుందని విమర్శలూ వస్తున్నాయి.
ఇందుకు కారణం కూడా ఉంది. తాము అధికార వైసీపీపై స్పందిస్తే.. వైసీపీ సీఎం సొంతజిల్లాలోని దేవునికడపలో పోలీసు హౌసింగ్ సొసైటీ స్కాంని బయటకు తీస్తుందనే భయం కూడా ఆ సంఘంలో ఉన్న కీలక వ్యక్తుల్లో ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. ఇంతకీ ఆ కేసు ఏంటనే విషయం పరిశీలిస్తే.. ఇది 2016లో ఈ కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటి పోలీసు అధికారుల సంఘం గౌరవ అధ్యక్షుడు, అప్పటి దేవుని కడప పోలీస్ హౌసింగ్ సొసైటీ ప్రసిడెంట్ నర్రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గతంలో అరెస్టయ్యారు కూడా.
2004నుంచి..
2004లో కడప పోలీస్ హౌసింగ్ సొసైటీని ఏర్పాటు చేశారు. దేవుని కడప ప్రాంతంలో కొంత భూమిని కేటాయించారు. కానిస్టేబుల్ స్థాయినుంచి ఎస్పీ స్థాయి అధికారులవరకు దాదాపు 450మందికి భూములు కేటాయించారు. ఇక్కడే ఆరోపణలు తలెత్తాయి. కొంతమందికి లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు జరిగాయని, కోట్లు చేతులు మారాయని ఆరోపణలు వచ్చాయి. రూ.1.02కోట్ల మేర అక్రమాలు జరిగాయని, రూ.550చొప్పున మెంబర్‌షిప్ ఫీజు ఉంటే.. అప్పట్లో రూ.20వేల చొప్పున సోసైటీ పెద్దలు వసూలు చేశారని, ఆ డబ్బు రాయలసీమ గ్రామీణ బ్యాంకులో జమ అయిందని చెబుతున్నారు. అయితే అప్పటి ఎస్పీ సజ్జనార్ బదిలీ తరువాత.. సొసైటీలో సభ్యుడైన రిజర్వ్ విభాగంలో పనిచేస్తున్న ఎ.బాలాజీ అనే కానిస్టేబుల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సొసైటీ సభ్యులకు తెలియకుండా ఆ డబ్బు మొత్తం విత్ డ్రా అయిందని ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై 2016వరకు పలు ఫిర్యాదు అందాయి. ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. కర్నూలు జిల్లానుంచి వచ్చిన సీఐడీ టీం రికార్డులను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టింది.
2016లో విచారణ.. అరెస్టు..
ప్రస్తుతం ఏపీ పోలీసు అధికారుల సంఘం గౌరవ అధ్యక్షుడిగా ఉన్న నర్రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని 2004లో దేవుని కడప హౌసింగ్ సొసైటీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణపై అరెస్టు చేశారు. 2016 నవంబరు 4న కడపలో ఈ అరెస్టు జరిగింది. ఈ సొసైటీలో అక్రమాలు జరిగాయని జిల్లా సహకార అధికారి విచారణలో తేలడంతో చంద్రశేఖర్ రెడ్డితోపాటు మరో 25మందిపై కేసులు నమోదయ్యాయి. ఈ అక్రమాలపై అప్పటి టీడీపీ ప్రభుత్వం సీఐడీ విచారణకు కూడా ఆదేశించింది. అప్పటి జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ సీఐడీకి కేసును అప్పగించారు.
సజ్జనార్ పేరు.
ప్రస్తుత సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ అప్పట్లో కడప ఎస్పీగా ఉన్నారు. దీంతో ఆయన పేరుకూడా ప్రస్తావనకు వచ్చింది. ఇక ఈ సొసైటీలో మొత్తం 19మంది ఉండగా ఎస్పీ హోదాలో సజ్జనార్ ప్రమోటర్ గా వ్యవహరించారు. కాగా ఈ వ్యవహారంలో ఎస్పీ పాత్ర చాలా నామమాత్రంగా ఉంటుందని చెబుతున్నారు. సొసైటీ బాధ్యులదే కీలకపాత్రగా ఉంటుందని చెబుతున్నారు. కేవలం సంచలనం కోసమే సజ్జనార్ పేరును తెరపైకి తెచ్చారని, ఈ సొసైటీలో జరిగిన అక్రమాల విషయంలో సజ్జనార్ జోక్యంగాని, సజ్జనార్ పాత్ర గాని లేదని, జిల్లా ఎస్పీ హోదాలో ఆ అవకాశం ఉండదని చెబుతున్నారు.
బాధ్యులదే పాత్ర..
ఈ విషయంలో అప్పట్లో బాధ్యుడిగా గుర్తించి..అప్పటి సొసైటీ ప్రసిడెంట్ నర్రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. తరువాతి కాలంలో ఆయన బయటకు వచ్చారు. ప్రస్తుతం ఏపీ పోలీసు అధికారుల సంఘం గౌరవ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. తమను టీడీపీ ప్రభుత్వం అరెస్టు చేసిందన్న కోపంతోనే చంద్రబాబు లక్ష్యంగా అవకాశం దొరికినప్పుడల్లా పోలీసు అధికారుల సంఘం పేరును అడ్డంపెట్టుకుని విమర్శలు చేస్తున్నారనే కామెంట్లు సోషల్ మీడియాలో వస్తున్నాయి.
ఇక్కడే మరో విషయం ఉంది. వాస్తవానికి సమాజంలో ఓ హోదాలో ఉన్న వ్యక్తులు చేసే కామెంట్ల పట్ల తమ వర్గం, తమ తోటి ఉద్యోగులు లేదా తమ సంబంధీకులపై ప్రభావం చూపే పరిస్థితి ఉంటే కచ్చితంగా ప్రశ్నించవచ్చు. అయితే ఆ పరిస్థితి తలెత్తిన ప్రతిసారీ..వ్యక్తుల, పార్టీల, సామాజిక వర్గాల తేడా లేకుండా స్పందిస్తేనే సదరు సంఘాలకు, అసోసియేసన్లకు విలువ ఉంటుందనే చర్చ మొదలైంది.