ఏ రంగంలో అయినా ఉన్నత స్థాయికి చేరడానికి ఒక జీవితకాలం సరిపోదు. ఒకవేళ ఆ లక్ష్యాన్ని సాధిస్తే అదే వారికి లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్ అవుతుంది. ఇక దశాబ్దాల తరబడి టాప్ ప్లేస్‌లో కొనసాగడం కోటికి ఒక్కరికి కూడా సాధ్యం కాదు. అలాంటి కోట్లలో ఒకడు.. తెలుగు నేలపై ఒకే ఒక్కడు.. మాజీ సీఎం.. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. 90వ దశకంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నాటి నుంచి తెలుగువారి అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్, తెలుగు రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ చంద్రబాబు అంటే కాదనే వారెవరూ ఉండరు. ఈ మూడు దశాబ్దాల కాలంలో ఆయన లేని పోలిటిక్స్‌ను ఊహించలేం.
మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు.. నిజాం రాజ్యంలో తెలుగు భాష మాట్లాడే తెలంగాణ ప్రాంతం కలిసి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడిన రోజు నవంబర్ 1, 1956. అప్పటి నుంచి గడిచిన ఏడు దశాబ్దాల కాలంలో ఎంతో మంది మహా మహులు తెలుగు రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు. ఒక దశలో రాష్ట్ర రాజకీయాలను శాసించారు. అయితే అత్యంత చిన్న వయసులోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టి.. అందరి కంటే ఎక్కువ కాలం.. అత్యధికంగా ప్రభావం చూపించిన మహోన్నత నాయకుడు ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే. ఆయనకంటే ముందు, ఆయన సమకాలికులు, ఆయన కళ్ల ముందే ఎదిగిన ఎంతో మంది గొప్ప నేతలు, ముఖ్యమంత్రులు ఎంత మంది వచ్చినా.. వారి ప్రాభవం స్వల్ప కాలమే నడిచింది.. వారి ప్రభావం కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది.
ఆధునిక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను రెండు భాగాలుగా విభజిస్తే.. మొదటి అర్ధ భాగం మొత్తం నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి, పీవీ నరసింహారావు చుట్టూనే తిరుగుతంది. వీరు ముగ్గురు ముఖ్యమంత్రులుగా ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. అయితే రాష్ట్ర రాజకీయాల్లో ఇమడ లేక.. సవాళ్లు, సంక్షోభాలు తట్టుకోలేక.. ఢిల్లీ దర్బారుకు తరలిపోయారు. నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి పదవి చేపట్టినా, పీవీ నరసింహారావు ప్రధానమంత్రి అయినా.. ఏపీ పాలిటిక్స్‌లో వీరి పాత్ర పరిమితమే.
తర్వాత కాలంలో తెలుగు రాజకీయాల్లో శిఖరాగ్ర స్థాయికి చేరిన నాయకుల్లో ఎన్టీఆర్, వైఎస్సార్, కేసీఆర్, జగన్ ముఖ్యమైన వారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి మొదటి ఎన్నికల్లోనే తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్.. రెండో సారి ముఖ్యమంత్రి అయ్యాక రెండేళ్లు నిండకుండానే మరణించారు. నాలుగు దశాబ్దాలకు పైగా ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలిన ఎన్టీఆర్ రాజకీయ జీవితం నిండా పదిహేనేళ్లు కూడా పూర్తి చేసుకోకుండానే స్వర్గస్తులయ్యారు. పేదల పెన్నిధిగా పేరుగాంచిన వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా రాష్ట్ర రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి చేరినా దురదృష్టవశాత్తూ, హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంతో లైమ్ లైట్లోకి వచ్చిన కేసీఆర్ కూడా.. 2009 నుంచి ఇప్పటి వరకూ తెలంగాణ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా నిలిచారు. అయితే ఆయన రాజకీయ భవితవ్యం 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉందని పరిశీలకుల అభిప్రాయం. తండ్రి వైఎస్సార్ మరణంతో ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్ జగన్.. ఒక్క ఛాన్స్ అంటూ ఏపీ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనిస్తున్న వాళ్లవరైనా.. జగన్ రెడ్డి ఏక్ బార్ కా రాజా అని అనుకుంటే అది వాళ్ల తప్పు కాదు.
ముఖ్యమంత్రి పదవిలోకి రాగానే ఏ రాజకీయ నాయకుడైనా మొదట ఆలోచించేది ఆ సీటు నిలబెట్టుకోవడం గురించే. అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే తర్వాత ఎన్నికల్లో విజయం కోసం తాపత్రయం మొదలవుతుంది చాలామందికి. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తప్ప రాజకీయాల ఊసెత్తని ఎకైక నాయకుడు చంద్రబాబు. ఎన్ని సంక్షోభాలు ఎదురైనా, ఎన్ని పరాజయాలు వచ్చినా ఆత్మవిశ్వాసంతో నిలబడిన పోరాట యోథుడు, అధికారంలో లేని సమయంలో కూడా ప్రజా సమస్యలపై గళమెత్తిన జన నాయకుడు.. అక్రమ కేసులతో అరెస్టు చేసి జైల్లో నిర్భందించినా ఏమాత్రం అధైర్య పడకుండా నియంతృత్వ పాలకులకు ఎదురు నిలిచిన మేరునగ ధీరుడు చంద్రబాబు నాయుడు.
రెండు దశాబ్దాలు అడ్వాన్స్‌గా ఆలోచించే చంద్రబాబు విజన్‌కు ప్రత్యక్ష సాక్ష్యం సైబరాబాద్. ఒకప్పుడు రాళ్లు రప్పలతో నిండి ఉన్న ప్రాంతం ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలకు ఏమాత్రం తీసిపోని స్థాయికి డెవలప్ అయిందంటే ఆయన ఎంత మందు చూపుతో ఆలోచించారో అర్ధం చేసుకోవచ్చు. హైకెట్ సిటీ నుంచి అమరావతి వరకు చంద్రబాబు చేపట్టిన ప్రాజెక్టులు, ఆయన తీసుకొచ్చిన విధానాలు గత మూడు దశాబ్దాల నుంచి తెలుగు రాజకీయాల్లో , తెలుగు ప్రజల జీవితాల్లో చెరిగిపోని ముద్ర వేశాయి.. ఆయన్ని ఎదురులేని మనిషిగా నిలబెట్టాయి.