పద్ధతి ప్రకారం ఎలాంటి మలుపులు లేకుండా రాజకీయ వాతావరణం కొనసాగితే గనుక.. రాష్ట్ర శాసనసభకు 2024 లో ఎన్నికలు రావాలి. కానీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంచనా ప్రకారం.. రెండేళ్ల ముందుగానే ఎన్నికలు రాబోతున్నాయి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా పార్టీ శ్రేణులతో జరిగిన సమావేశలో బయటపెట్టారు. ఆయన ఉద్దేశం.. జగన్ సర్కారు కూలిపోతుందని కాదు గానీ.. కేంద్రం జమిలి ఎన్నికలకోసం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో 2022లోనే ఎన్నికలు వస్తాయని భావిస్తున్నారు.
అమలాపురం పార్లమెంట్ టీడీపీ నేతలతో చంద్రబాబు నాయుడు శుక్రవారం సమావేశం నిర్వహించారు. 2022 నాటికి జమిలి ఎన్నికలు వస్తాయని, ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండాలని తమ క్యాడర్ కు చంద్రబాబు పిలుపు ఇచ్చారు. కరోనా తగ్గాక రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని, పార్టీ శ్రేణులతో ప్రత్యక్ష సమావేశాలు కూడా ఉంటాయని చంద్రబాబు నాయుడు చెప్పారు.
జగన్ కి డబ్బు పిచ్చి ఎక్కువ అందుకే దోచుకు తింటున్నారని, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని డిమాండ్ చేయకుండా రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. కేసుల మాఫీ కోసం కేంద్రం కాళ్లు పట్టుకున్నారని అన్నారు. తెలంగాణ విషయానికి వస్తే క్యాబినెట్‌లో అంతా టిడిపి నుంచి వెళ్ళిన వారే ఉన్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
చిత్తూరు జిల్లాలో జడ్జి రామకృష్ణ కుటుంబం మీద జరుగుతున్న వరుస దాడులకు నిరసనగా, దళిత సంఘాలు పిలుపు ఇచ్చిన చలో మదనపల్లి సందర్భంగా టిడిపి నేతలని హౌస్ అరెస్ట్ చేయడాన్ని చంద్రబాబు ఖండించారు. కొవిడ్ నియంత్రణలో జగన్ చేతులెత్తేశారని ఆయన అన్నారు. విద్యుత్ మోటార్లకు మీటర్ల పేరుతో రైతుల మెడకు ఉరి తాళ్లు బిగిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.
ముందే ఎన్నికలు నిజమేనా..
జమిలి ఎన్నికల గురించి కేంద్రంలోని మోడీ సర్కారు ఎప్పటినుంచో మాట్లాడుతూనే ఉంది. ప్రస్తుతం మోడీ సర్కారు అటు లోక్ సభలోను, రాజ్యసభలో దాదాపుగా బిల్లులు నెగ్గించుకునే పరిస్థితిలో ఉంది. ఇలాంటి సమయంలోనే దేశం మొత్తానికి సంబంధించిన అనేక కీలక బిల్లులు అమల్లోకి వచ్చేస్తాయనే వాదన ఉంది.
అలాగే మోడీ సర్కారు సుదీర్ఘకాల ఎజెండా అంశాల్లో జమిలి ఎన్నికలు కూడా ఒకటి. ఆ నేపథ్యంలో ఈ విడతలోనే కార్యరూపం దాల్చవచ్చునని పలువురు అంచనా వేస్తున్నారు. 2022 లో వివిధ రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికల నాటికి.. మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు అన్నింటినీ కూడా రద్దు చేసేసి.. జమిలి ఎన్నికలకు వెళ్లే ఆలోచన కేంద్రానికి ఉన్నదని పలువురు అంచనా వేస్తున్నారు.
చంద్రబాబునాయుడు కూడా అదే అంచనాలతో రెండేళ్ల ముందే జగన్ పాలనకు పరీక్ష తప్పదని, 2022లోనే ఎన్నికలు వస్తాయని అంటున్నారు. మరి ఆయన జోస్యం ఏమేరకు ఫలిస్తుందో వేచిచూడాలి.