వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు, విద్యుత్ వ్యవస్థ స్తంభించిపోయింది. కరెంట్, మంచినీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ సమస్యకు ప్రధాన కారణం ప్రభుత్వం చేతకానితనం అంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. ఆయన వరదల పరిస్థితిపై మీడియా మీట్ నిర్వహించారు.
వరదలు వస్తున్నాయంటూ సీడబ్ల్యూసీ ఎప్పటికప్పుడు లెక్కలు ఇస్తుంది కానీ ఈ ప్రభుత్వం ఎక్కడా పట్టించుకోలేదు అని చంద్రబాబు అన్నారు. వరి, పత్తి, మొక్కజొన్న, అరటి, కంది పంటలు దెబ్బతిన్నాయని, వరదల్లో నష్టపోయిన వారికి రూ.10 వేలు ఇవ్వాలని బాబు డిమాండ్ చేశారు. హుధూద్ సమయంలో ఎలాంటి ప్యాకేజీ ఇచ్చామో.. అలాంటి ప్యాకేజీ ఇవ్వాలన్నారు. అంటువ్యాధులు రాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
దేశంలో ఎక్కువ కరోనా కేసులు ఏపీలోనే వస్తున్నాయని, ఎందుకు కరోనాను నియంత్రణ చేయలేకపోయారని ప్రశ్నించారు.
ప్రభుత్వానికి కరోనాకు కూడా కులం గుర్తుకొస్తోందన్నారు. డాక్టర్లు, నర్సులు ముందే హెచ్చరించారు.. పీపీఈ కిట్లు ఇవ్వమని అడిగితే పట్టించుకోలేదని, ప్రజల ప్రాణాలు, ఆరోగ్యమంటే లెక్కలేదని చంద్రబాబు అన్నారు.
అమరావతి కోసం www.apwithamaravati.com వెబ్ సైట్ పెట్టామని, ఆ వెబ్ సైట్ ద్వారా రాజధానిపై 13 జిల్లాల ప్రజలు అభిప్రాయాలు చెప్పాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.