ప్రజలకు కష్టం వచ్చిన స్థితిలో ఒక పాలకుడిగా చంద్రబాబు ఎలా వ్యవహరిస్తారో మరోసారి నిరూపితం అయింది. పదేళ్ల క్రితం విశాఖపట్నంలో హుదూద్ తుపాను వచ్చినప్పుడు చంద్రబాబు వ్యవహరించిన తీరు, అధికార యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించిన తీరును ఇప్పటికీ అందరూ గుర్తు చేసుకుంటారు. విశాఖపట్నంలో అతి తక్కువ కాలంలోనే సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేయడంలో చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ ఎంతో సమర్థంగా ఉందని అందరూ అంటారు.
ఇప్పుడు విజయవాడలో వచ్చిన విలయం కారణంగా చంద్రబాబు అలానే పర్యవేక్షిస్తున్నారు. ఒకేరోజులో కురిసిన అత్యంత భారీ వర్షపాతంతో పాటు ఎగువన కురిసిన వర్షాలకు విజయవాడ నగరం మునిగిపోయింది. రెండు రోజులుగా ప్రజలు నిస్సహాయ స్థితిలో ఉండగా.. చంద్రబాబు మాత్రం వారికి సాయం చేసేందుకు తపన పడుతూనే ఉన్నారు. ఉదయం నుంచి నేడు తెల్లవారే వరకూ కనీసం నిద్ర పోకుండా పని చేస్తు్న్నారు. గత రాత్రి విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే చంద్రబాబు ఉండిపోయారు. తన బస్సును అక్కడే పార్క్ చేసి.. అక్కడే అధికారులతో సమీక్ష చేపట్టారు. వరద తీవ్రత తగ్గేంతవరకూ ఇక్కడే ఉంటానంటూ ప్రజలకు సందేశం పంపారు. సహాయక, పునరావాస చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తూ.. క్షేత్ర స్థాయికి వెళ్తూ ప్రజలకు ధైర్యం చెబుతూ ఉన్నారు.
మళ్లీ నేడు ఈ తెల్లవారు జామున 4.30 గంటలకు మరోసారి అధికారులతో చంద్రబాబు సమీక్షలో పాల్గొన్నారు. హోంశాఖ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత కూడా ఈ రివ్యూలో పాల్గొని.. సహాయక చర్యల గురించి పర్యవేక్షిస్తూ, మరింత మెరుగైన చర్యల కోసం సమాలోచనలు చేశారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి చంద్రబాబు నిర్విరామంగా విజయవాడలో పర్యటిస్తూ వరద పరిస్థితులను సమీక్షించారు. నగరంలోని అజిత్ సింగ్ నగర్, కృష్ణలంక, ఇబ్రహీంపట్నం, ఫెర్రీ, జూపూడి, మూలపాడు ప్రాంతాల్లో పర్యటించారు. వివిధ ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు వచ్చి చేరడంతో ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో కూడా బాధితుల వద్దకు వెళ్లి చంద్రబాబు సమస్యలు తెలుసుకున్నారు.
ఈ విలయాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలని చంద్రబాబు కోరారు. ఎవరూ అధైర్య పడొద్దని ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఇటు వరద బాధితులకు తక్షణం ఊరట కలిగించేలా ఆహార పదార్థాలను సకాలంలో అందించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఆహారాన్ని సత్వరం కనకదుర్గ గుడి ద్వారా తయారు చేయించాలని చంద్రబాబు ఆదేశించారు. దాదాపు 50 వేల మందికి పులిహోర రెడీ చేయాలని కోరారు. ఇంకా విజయవాడలోని ప్రైవేటు హోటల్స్ యజమానులను పిలిపించి కూడా చంద్రబాబు మాట్లాడారు. నేటి ఉదయంలోగా లక్ష మందికి ఫుడ్ రెడీ చేయాలని వారికి సూచించారు. ఇలా వరద సమయంలో బాధితులకు అండగా ఉంటూ, వారికి అన్ని రకాలుగా ఆదుకునేందుకు చంద్రబాబు రేయింబళ్లు పని చేస్తూనే ఉన్నారు.