అమరావతిలో చెస్ అకాడమీ ఏర్పాటు చేయడానికి ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపీ ఆసక్తి చూపిస్తున్నారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి లోకేశ్‌ని కలిసి.. చెస్ అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. హంపీ వినతిపై మంత్రి లోకేశ్ సానుకూలంగా స్పందించారు. చెస్ అకాడమీ స్థాపనకు ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
బాల్యంలోనే చదరంగంలో ప్రావీణ్యం సాధించిన కోనేరు హంపీ.. చిన్న వయసులో ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్ స్థాయికి ఎదిగారు. చెస్‌లో అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ఎన్నో విజయాలు అందించారు. చెస్ ఒలంపియాడ్ 2026లో భారత మహిళల జట్టు కాంస్య పతకం సాధించింది. వ్యక్తిగత విభాగంలో కోనేరు హంపీ బ్రాంజ్ మెడల్ అందుకున్నారు. ఈ విజయాలు సాధించిన కోనేరు హంపీని, ఆమె జట్టులోని ఇతర సభ్యులను మంత్రి లోకేశ్ అభినందించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కేవలం పరిపాలన నగరంలా కాకుండా.. విద్య, వైద్య, వ్యాపార, వినోదాలతో పాటు క్రీడలకు కేంద్రంగా రూపొందించాలనేది సీఎం చంద్రబాబు సంకల్పం. ప్రజా రాజధాని మాస్టర్ ప్లాన్‌లో భాగంగా అమరావతిలో స్పోర్ట్స్ సిటీ అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో మాజీ క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్ క్రికెట్ అకాడమీ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్.. బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు చేస్తున్నారు. ఇదే క్రీడలో టాప్ ప్లేయర్‌గా ఉన్న పీవీ సింధు.. విశాఖపట్నంలో భారీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్థాపిస్తున్నారు.
విద్యా శాఖలో సిలబస్, బోధన వంటి అకాడమిక్ అంశాల్లో అనేక సంస్కరణలు తీసుకొస్తున్న మంత్రి లోకేశ్.. విద్యార్ధులకు క్రీడల పట్ల ఆసక్తి పెంచాలని భావిస్తున్నారు. చదువుతో పాటు స్పోర్ట్స్ ఇతర ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌తో.. స్టూడెంట్స్ శారీరికంగా, మానసింగా బలంగా తయారవుతారు. చదరంగం వంటి మెదడుకు పదును పెట్టే క్రీడలతో చదువుపైనా ఆసక్తి పెరుగుతుంది. అందుకే కూటమి ప్రభుత్వం క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహిస్తోంది. అన్ని క్రీడలకు చెందిన స్పోర్ట్స్ అకాడమీలతో.. అమరావతి స్పోర్ట్స్ సిటీని ప్రపంచస్థాయి క్రీడా నగరంలా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు.











