వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి తీరు మారలేదు. లిక్కర్ కేసులో అరెస్టయిన చెవిరెడ్డి సిట్ అధికారులను బెదిరిస్తున్నారు. సిట్‌లో ఎవరెవరు పని చేస్తున్నారో తెలుసు, మీ అందరి చరిత్రలు తెలుసు, మీ అంతు తేలుస్తా అంటూ ఆయన చిందులు తొక్కుతున్నట్లు సమాచారం. విచారణలో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా ఈ బెదిరింపులకు పాల్పడుతూండటంతో ఆ రికార్డెడ్ వీడియో కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు అధికారులు.
లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి 3 రోజుల సిట్ కస్టడీ గురువారం సాయంత్రంతో ముగిసింది. దర్యాప్తు బృందాలు మూడు రోజుల్లో 200కు పైగా ప్రశ్నలు అడగ్గా..ఆయన ఏ ఒక్కదానికీ సరైన సమాధానమివ్వలేదు. పైగా దర్యాప్తు అధికారులను బెదిరించి, హెచ్చరించినట్లుగా సమాచారం. విచారణకు సహకరించకుండా పెద్దపెద్దగా కేకలు వేసినట్లు, దర్యాప్తు అధికారులను శాపనార్థాలు పెట్టినట్లు తెలిసింది. ఆయన దురుసు ప్రవర్తనంతా సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఈ ఫుటేజ్‌ను సిట్ అధికారులు న్యాయస్థానానికి సమర్పించనున్నారు సిట్ అధికారులు.
సిట్ అధికారులు ఎంత ఓపికగా ప్రశ్నించినా..మీరడిగిన దానికి నేను సమాధానం చెప్పను. నేను చెప్పేదే మీరు రాసుకోండంటూ చెవిరెడ్డి రంకెలు వేశారు. ఆయన విచారణకు సహకరించకపోవటంతో ఓ దశలో సిట్ అధికారులూ తీవ్రంగానే స్పందించినట్లు సమాచారం. మీరడిగిన దానికి సమాధానం చెప్పటానికి మీ కస్టడీలో మేం లేం. మా కస్టడీలోనే మీరున్నారనే సంగతి మరిచిపోవద్దు. మద్యం కుంభకోణంలో మీ ప్రమేయంపై అన్ని సాంకేతిక ఆధారాలూ ఉన్నాయి. గట్టిగా కేకలు వేసి దబాయించిన మాత్రాన మీరు తప్పించుకోలేరంటూ సిట్ అధికారులు వార్నింగ్ ఇవ్వడంతో చెవిరెడ్డి వెనక్కి తగ్గినట్లు సమాచారం.
లిక్కర్ స్కామ్ ముడుపుల సొమ్మును గత సార్వత్రిక ఎన్నికల్లో ఎవరెవరికి అందజేశారు? ఎవరి ఆదేశాల మేరకు ఈ సొత్తు పంపిణీ చేశారు? అని ప్రశ్నించగా తానెప్పుడూ మద్యం సొమ్ము ముట్టనేలేదని చెవిరెడ్డి పాత పాటే పాడారు. రాజ్ కెసిరెడ్డి, ఆయన అనుచరగణం మీకు అందజేసింది మద్యం ముడుపుల సొమ్మే కదా అని అడగ్గా.. సమాధానం చెప్పకుండా తనను అక్రమంగా ఈ కేసులో ఇరికించారంటూ కేకలు వేసినట్లు తెలుస్తోంది. మద్యం ముడుపుల సొమ్ము తరలింపునకు మీ ఆదేశాలతోనే తుడా వాహనాలు పంపించారు కదా అని ప్రశ్నించగా.. అవేవీ తనకు తెలియదన్నారు. తుడా వాహనాల గురించి అప్పటి తుడా వీసీ అండ్ ఎండీగా పనిచేసిన అధికారులను కాకుండా తనను ఎందుకు అడుగుతున్నారని చెవిరెడ్డి ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం. విచారణలో వెల్లడించిన అంశాలకు సంబంధించి అధికారులు వాంగ్మూలాలు సిద్ధం చేయగా, చెవిరెడ్డి వాటిపై సంతకాలు పెట్టకుండా చించేసినట్లు సమాచారం.
సిట్ విచారణ కొనసాగుతున్నంతసేపు చెవిరెడ్డి ఆహారం తినకుండా, నీళ్లు తాగకుండా ఉన్నారు. నీరసిస్తే విచారణ ఆపేస్తారనే ఎత్తుగడతోనే ఆయన ఇలా వ్యవహరించారని సిట్ వర్గాలు చెబుతున్నాయి. సిట్ అధికారులు చెవిరెడ్డి తరఫు న్యాయవాది దృష్టికి ఈ విషయాలన్నీ తీసుకెళ్లారు. ఇష్టపూర్వకంగానే ఆహారం తీసుకోవట్లేదంటూ ఆయనతో లిఖితపూర్వక వాంగ్మూలం తీసుకున్నారు.











