కరోనా జన్మస్థలం ఏది అంటే, ప్రపంచమంతా చైనా అనే అంటుంది ఒక్క చైనా తప్ప. ప్రపంచాన్ని సంవత్సరకాలం పైగా పట్టి పీడిస్తుంది కరోనా. ఈ భయంకరమైన వ్యాధిని ప్రపంచానికి అంటించిన దేశంగా చైనాను ప్రపంచమంతా నిందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రపంచ నిందల నుండి బయటపడడానికి, ఆ తప్పుని వేరొకరి పైన వేసే ప్రయత్నం చేస్తున్నట్లుంది చైనా. తమ పరిశోధనలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయంటూ చైనా ప్రభుత్వం, అక్కడి శాస్త్రవేత్తలు, మీడియా కలిసి ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.
కరోనా పాపం మాది కాదు
కరోనా ఇటలీ లో పుట్టింది… కాదు అమెరికాలో… అది కూడా కాదు ఐరోపా దేశాల్లో… అది కూడా తప్పే భారత్ లో పుట్టింది, ఇది ఫైనల్ అంటుంది చైనా. కరోనా పాపం చైనాదే అంటూ ప్రపంచం అంతా వేలెత్తి చూపుతుంటే మాది కాదంటే కాదు అనే మొండి వాదనకు దిగింది. 2019 లోనే కరోనా వివిధ దేశాలలో వెలుగుచూసిందని, మా దేశం మొదటిది కాదని వాదించుకుంటూ వచ్చింది. కానీ, ఎక్కడా ఎప్పుడూ వీటికి ఆధారాలు చూపలేదు చైనా. మొదటగా ఇటలీని నిందించిన చైనా, ఆ తర్వతా ఇంకో దేశం అంటూ మాట మారుస్తూ చివరికి భారత్ పైన పడింది.
ఫుడ్ శ్యాంపుల్స్ అందుకు నిదర్శనం
ఈ మధ్య కాలంలో చైనా దిగుమతి చేసుకున్న కొన్ని ఫుడ్ శ్యాంపుల్స్ లో కరోనా వైరస్ ని కనుగొనింది చైనా ఫుడ్ కంట్రోల్ బోర్డ్. వాటి ఆధారంగా పరిశోధనలు చేశామని, దాని ప్రకారం ఈ వైరస్ గతేడాది ఎండాకాలంలోనే బయటపడిందని, కాబట్టి మా దేశంలో పుట్టింది కాదంటూ అర్థం లేని వాదనలు చేయడం మొదలుపెట్టింది. వారి ఆరోపణలు పట్టించుకుంటున్న వారు కనిపించడం లేదు. మునుపు ఇలాంటి ఆరోపణలు ఎన్నో చేసింది చైనా. పైగా వారి ఆధారాలు నమ్మడానికి కూడా ఇతర శాస్త్రవేత్తలు కూడా సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు.
భారత దేశమే మూల స్థానం
చైనా శాస్త్రవేత్తల సరికొత్త కధనం ప్రకారం, కరోనా భారత్ లో దాదాపు 2019 మార్చిలోనే పుట్టిందట. కలుషిత నీరు, జంతువుల ద్వారా మనుషులకు ఇబ్బడిముబ్బడిగా వ్యాపించిందట. కానీ అది బయటకు రాకుండా చేసి భారత్ యావత్ ప్రపంచాన్ని మోసం చేసింది. వైరస్ స్ట్రెయిన్ల జన్యు క్రమం విశ్లేషించిన మీదట ఈ నిర్ణయానికి వచ్చినట్లు వాళ్లు వెల్లడించారు. ఇదంతా వినడానికి ఎంత హాస్యాస్పదంగా ఉందంటే కరోనా నింద నుండి తప్పించుకునే ప్రయత్నంలో చైనా తనని తానే ప్రపంచం ముందు చులకన చేసుకుంటుంది. ఇలాంటి ప్రేలాపనలు, అర్ధం లేని పరిశోధనలు ఆధారంగా చూపించడం వల్ల ఉపయోగం ఏమో కానీ, చైనా శాస్త్రవేత్తల సామర్ధ్యం, కచ్చితత్వం, నిజాయితీ పట్ల అందరికీ అనుమానాలు రాక మానవు.