మెగాస్టార్ చిరంజీవితో ఇప్పుడు యువ హీరోలు కూడా పోటీ పడలేకపోతున్నారు. మొన్న ఆచార్య, నిన్న గాడ్ ఫాదర్, నేడు వాల్తేరు వీరయ్య.. ఇలా చకచకా సినిమాలు చేసేసుకు వెళుతున్నారు. చిరంజీవి మళ్లీ స్పీడ్ పెంచేశారేమోననిపిస్తోంది. ముఖ్యంగా అరవయ్యేళ్లు పైబడిన వయసులో కూడా ఆయన పరుగుల పెట్టడం విశేషం. ఈ విషయంలో ఆయన మనోభావాలు ఎలా ఉన్నాయో మీడియా ముఖంగా పంచుకున్నారు. ఆ విశేషాలు చూద్దాం.
తెలుగు సినిమాకు ఇది స్వర్ణయుగమా అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ ‘అసలు మన తెలుగు సినిమా ఎప్పటి నుంచో స్వర్ణయుగంలోనే ఉంది. అదిప్పుడు కొత్తగా వచ్చింది కానేకాదు. దానిని నేటితరం దర్శకులు, హీరోలు కొనసాగిస్తున్నారు’ అన్నారు. ‘వాల్తేరు వీరయ్య’ గురించి మాట్లాడుతూ తన అభిమానులు ఏం కోరుకుంటారో దానిని ఇవ్వడానికి తాను తపన పడుతుంటానని, వైవిధ్యభరితమైన సినిమాలు, పాత్రలు చేయడాన్ని ఇష్టపడతానని అన్నారు. ‘ఈ సినిమాలో పాత చిరంజీవిని మళ్లీ చూస్తారు. ‘రౌడీ అల్లుడు’, ‘ఘరానా మెగుడు’, ‘ముఠా మేస్త్రీ’ల్లో నేను ఎలా ఉన్నానో ‘వాల్తేరు వీరయ్య’లో కూడా అలానే ఉంటాను. షూటింగ్‌ను బాగా ఎంజాయ్ చేశాను’ అని వివరించారు.
‘దర్శకుడికి, ఫైట్ మాస్టర్‌కు, కొరియోగ్రాఫర్‌కు నేను పూర్తి స్వేచ్ఛనిస్తా. వాళ్లు సీన్ ఓకే అనే వరకూ స్పాట్ నుంచి కదలను. మొదటి సినిమా చేసినప్పుడు ఎలా ఉన్నానో.. ఇప్పటికీ అలానే పనిచేస్తున్నా. ఒక సినిమా బాగా రావాలంటే చాలా మంది కష్టపడాల్సిందే. అమితాబ్ మాకు స్ఫూర్తి. ఆయన నేటికీ యువ హీరోలతో పోటీపడి నటిస్తుంటారు. ఇక రవితేజ గురించి చెప్పాలంటే ఆరోజుల్లో ఎలా ఉన్నాడో ఈరోజూ అలానే ఉన్నాడు. అతని ఎనర్జీ ఈ సినిమాకు మరింత ప్లస్ అయ్యింది. ఈ పాత్రకు రవితేజ అయితే బాగుంటుందని అందరం అనుకున్నాం. ఇద్దరం డైలాగ్‌లు మార్చుకున్నాం. తన ఇడియట్ సినిమాలోని డైలాగ్ ను నేను.. నా సినిమాలోని డైలాగ్ ను తను చెప్పాడు. ఫ్యాన్స్‌కు కిక్ ఇవ్వడం కోసమే అలా చేశాం.’ అని వివరించారు.
మంచి సినిమాకు ఆదరణ ఎప్పుడూ ఉంటుంది
ఈ సంక్రాంతికి మైత్రీ సంస్థ నుంచే రెండు సినిమాలు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. మంచి సినిమా ఎప్పుడైనా విజయం సాధిస్తుందని, బయ్యర్లను, ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. సినిమాకు టెక్నాలజీ కంటే కంటెంట్ ముఖ్యమని నమ్మేవాళ్లలో నేనూ ఒకడ్ని. బాబీ కూడా ఈ విషయంలో అలానే ఆలోచిస్తారని అన్నారు. తనకు కమర్షయల్ సినిమాలంటేనే ఇష్టమన్నారు. ‘నాకేం కావాలి అనేదానికన్నా ప్రేక్షకులకు ఏం కావాలి అనేదే ఎక్కువ ఆలోచిస్తా. కంటెంట్ ఉంటే సీక్వెల్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. కథలో ఎన్ని పాటలున్నాయి, ఎన్ని ఫైట్స్ ఉన్నాయనేది చూడను. కథలో ఎంత ఎమోషన్ ఉందో చూస్తా. అందరూ కథలు వింటారు.. కానీ నేను కథను చూస్తాను. కథ చెప్పేటప్పుడే విజువలైజ్ చేసుకుంటా. ప్రేక్షకులు ఇచ్చే ప్రతి రూపాయికి వాళ్లకు ఏం అందిస్తున్నామనేది చూస్తా’ అని వివరించారు. మనిషికి ఓర్పు చాలా అవసరమన్నారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఎదురు తిరిగితే మన అహం చల్లారుతుందేమో కానీ సినిమాకు భారీగా నష్టం వస్తుందన్నారు. అందుకే నేను చాలా సంయమనంతో వ్యవహరిస్తా. దర్శకత్వం చేయగలనన్న నమ్మకం వస్తే తప్పకుండా దర్శకత్వం చేస్తానని అన్నారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని శిరసావహించాలి
టికెట్ ధరల విషయంలో ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయంపై స్పందిస్తూ ప్రభుత్వ నిర్ణయాలను మనం గౌరవించాలని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు తన ధన్యవాదాలు తెలిపారు. ‘బాబి నాకు పెద్ద అభిమాని. ఓ అభిమానిగా అతడిని ఇష్టపడ్డాను. దర్శకుడిగా దాసోహమయ్యా. డైరెక్టర్‌గా మంచి మార్కులు సంపాదించాడు. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి.. వాళ్ల నాన్న చిన్నదినం జరిగిన వెంటనే షూటింగ్‌కు వచ్చాడు. అంత కమిట్‌మెంట్ అతనికి ఉంది. ఈ సినిమా హిందీలో కూడా ‘పుష్ప’లాగా మంచి ఆదరణ లభిస్తుందని అనుకుంటున్నా’ అన్నారు. గొప్ప నటుడుగా, మంచ మనిషిగా.. ఎలా ఉండాలనుకుంటున్నారు అని ప్రశ్నిస్తే ‘మంచి నటుడు అనేది నాకు దక్కిన గొప్ప వరంగా భావిస్తా.. అది నా అదృష్టం కూడా. కానీ అది శాశ్వతం కాదన్నది నిజం. మంచితనం అనేది శాశ్వతం. మనం చనిపోయినా అది మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతుంది. రియల్ హీరోగా ఉంటూ రీల్ హీరోగా ఎక్కువకాలం కొనసాగాలన్నదే నా కోరిక’ అని సమాధానమిచ్చారు.
-హేమసుందర్