మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా షూటింగ్ కు అంతరాయం ఏర్పడింది. త్వరలోనే సినిమాను తిరిగి సెట్స్ మీదకు తీసుకెళ్ళబోతున్నారు. ఈ చిత్రం జనవరి నెలలోగా పూర్తీ చేసి వెంటనే వినాయక్ దర్శకత్వంలో ‘లూసిఫర్’ రీమేక్ , మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదాళం’ రీమేక్ సినిమాలను ఏకకాలంలో పట్టాలెక్కించాలని చిరంజీవి ప్లాన్.
చిరంజీవి ఇమేజ్‌కి తగ్గట్టు ఈ దర్శకులు ఇద్దరూ కథల్లో భారీ మార్పులు చేశారు. ‘లూసిఫర్’ సినిమాకు సంబంధించి ఆకుల శివ కథను తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టుగా మార్పులు చేసారు. ‘వేదాళం’ సినిమా విషయానికి వస్తే .. కలకత్తా నేపథ్యంలో కథ నడుస్తుంది . ఈ రెండు సినిమాలూ విజయం సాధించడం వినాయక్, మెహర్ రమేష్ లకు చాలా ముఖ్యం.
వినాయక్, చిరంజీవి రీఎంట్రీతో వచ్చిన ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే వినాయక్ కు మాత్రం చేతిలో సినిమాలు లేకుండా పోయాయి. ఎలాగైనా ‘లూసిఫర్’ రీమేక్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టి మరోసారి తన స్టామినా ఏంటో చూపించాలని వినాయక్ పట్టుదలగా ఉన్నాడు.
ఇక మెహర్ రమేష్ సైతం ఇదే ఆలోచనలో ఉన్నాడు. పెద్ద హీరోలు ఎన్ని సినిమా అవకాశాలు ఇచ్చినా తను అనుకున్నంత హిట్ సినిమాలు తీయలేకపోయాడు. ఇప్పుడు మెహర్ రమేష్ ‘వేదాళం’ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. ఈ రెండు సినిమాలు ఈ ఇద్దరి దర్శకుల సినీ జీవితాన్ని మారుస్తాయో లేదో చూడాలి మరి.











