ఐఏఎస్, ఐపీఎస్ అంటే.. మన దేశంలో అత్యున్నత స్థాయి ప్రభుత్వ సర్వీసుల్లో ఉండే ఉద్యోగులు. సాధారణంగా అంతంత పెద్ద హోదాల్లో ఉండే అధికారులంతా సూటూ బూటూ వేసుకుని, టిప్పుటాపుగా తిరుగుతూ ఉంటారని మనం అనుకుంటాం. చాలా సందర్భాల్లో అలాగే జరుగుతూ ఉంటుంది. మామూలు మనుషులకు తెలిసిన ప్రపంచంలో జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు తరహా అధికారులన్నమాట. వారు సామాన్యుల్లాగా ప్రవర్తించడం వేరే సంగతి.. సామాన్యులతో కలివిడిగా కలిసే సందర్భాలు కూడా అరుదుగానే ఉంటుంటాయి.
అలాంటి అరుదైన సందర్భం బుధవారం నాడు చోటు చేసుకుంది.
చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా, తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి, తిరుపతి మున్సిపల్ కమిషనర్ గిరీషాలు తిరుపతి సమీపంలోని పూడి గ్రామంలో వెళుతున్నారు. చక్కటి గ్రామీణ వాతావరణంలో వెళ్తున్న వారికి.. పచ్చటి చేలు కనిపించాయి. పొలాల్లో కూలీలు ఎంచక్కా నాట్లు వేస్తున్నారు. ఆ దృశ్యం వారిని ఊరించింది. చిన్నతనంలో తామెరిగిన పొలం పనులు గుర్తుకొచ్చాయి. అంతే ఇక ఆగవలసిన అవసరం ఏముంది?
సూటూ బూటూ, హోదా గీదా తీసి పక్కన పడేశారు. ప్యాంట్లను కూడా మోకాళ్ల దాకా మడుచుకున్నారు. పైగుడ్డలు తలకు చుట్టారు. అడుసుపొలాల్లో దిగి కూలీలతో కలిసి వరి నాట్లు వేసేశారు.
అప్పటిదాకా చురుగ్గా నాట్లు వేస్తూ వచ్చిన రైతన్నలకు.. వారికి నారు కట్టలు అందివ్వడమే సరిపోయింది. అల కాసేపు తమ ముచ్చట తీరేలాగా పొలాల్లో నాట్లు వేసిన తర్వాత.. గట్టు మీదికి వచ్చారు. తమ చిన్నాటి జ్ఞాపకాలు పంచుకుంటూ ఈ ముగ్గురు అధికార్లు కబుర్లు చెప్పుకున్నారు. దేశానికి అన్నం పెట్టే మట్టి మనుషుల అవతారంలోకి పరావర్తనం చెందే అవకాశం ఇచ్చిన రైతుకు కృతజ్ఞతలు చెప్పి ముందుకు కదిలారు.
ఈ ముగ్గురిలో తిరుపతి మునిసిపల్ కమిషనర్, ఐఏఎస్ అధికారి, పిఎస్ గిరీశ కు కుడి చేయి ఉండదు. సాధారణంగా రైతులు తమ ఎడమ చేతిలో నారు కట్ట పట్టుకుని.. కుడిచేత్తో నాట్లు వేస్తుంటారు. కానీ.. ఉత్సాహం కొద్దీ పొలంలోకి దిగిన గిరీశ మాత్రం పక్కనుంచి రైతు నారు కట్ట పట్టుకుని ఉండగా.. తన ఎడమచేతితోనే నాట్లు వేయడం గమనార్హం.
Must Read ;- మెట్టు దిగిన మోడీ అన్నదాతలు దిగలేదబ్బా