కోవిడ్ కారణంగా గత తొమ్మిది నెలలుగా మూతపడ్డ సినీ థియేటర్లు డిసెంబర్ 4 నుంచి అంటే రేపటి నుంచే దశల వారీగా తిరిగి తెరుచుకోనున్నాయి. కేంద్ర ప్రభుత్వ అన్ లాక్ ప్రక్రియలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం థియేటర్ల పునః ప్రారంభానికి ఎప్పుడో అనుమతులు ఇవ్వగా…తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇటీవలే థియేటర్లను తెరుచుకోవచ్చని ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పటివరకు తెలంగాణ థియేటర్లు ప్రారంభం కాకపోవడం వల్లే చాలా మంది నిర్మాతలు తమ కొత్త చిత్రాలను విడుదల చేయలేకపోయారు. మరోవైపు కొత్త చిత్రాలు విడుదల లేకపోవడంతో ఏపీ థియేటర్లు కూడా పూర్తిస్థాయిలో తెరుచుకోలేదు. కేవలం చాలా స్వల్ప సంఖ్యలోనే అక్కడ థియేటర్లను ఆరంభించారు.
తెలంగాణలో ఎట్టకేలకు థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతులు వచ్చినప్పటికీ అన్ని థియేటర్లు ఒకే తేదీన ఓపెన్ కావని తాజా సమాచారం. డిసెంబర్ 4న ముల్టీఫ్లెక్స్ లు, యజమాని సొంతగా నిర్వహించుకునే థియేటర్లలలో సినిమా ప్రదర్శనలు మొదలవుతాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత ఈ నెల 11న కొన్ని థియేటర్లు, 18న ఇంకొన్ని థియేటర్లు ప్రారంభం కావచ్చునని అంటున్నారు. సింగిల్ థియేటర్లను లీజుకు తీసుకున్న లీజుదారులు యజమానులకుముందుగా మాట్లాడుకున్న విధంగా లీజు మొత్తాన్ని ఈ సమయంలో చెల్లించలేమని, థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులను పరిగణలోనికి తీసుకుని పర్సెంటేజ్ పద్దతిలో చెల్లిస్తామని చెబుతున్నారట.
దాంతో వారి మధ్య ఇంకా చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. బహుశా ఈ నే 18 నుంచి లీజు థియేటర్లు అధికభాగం తెరుచుకోవచ్చునని భావిస్తున్నారు. ఈ నెల 25న సాయిధరమ్ తేజ్ నూతన చిత్రం `సోలో బ్రతుకే సో బెటర్‘ విడుదల ఉండటంతో అప్పటికి పూర్తి స్థాయిలో థియేటర్లు మొదలు కావచ్చునని కూడా వినిపిస్తోంది. ఇదిలావుండగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినీ పరిశ్రమకు ఇటీవల ప్రకటించిన రాయితీలకు సంబందించిన జీవో ఇంకా విడుదల కాలేదు. జి.హెచ్.ఎం.సి. ఎన్నికల కారణంగా ఈ నెల 5 తర్వాత ఎప్పుడైనా విడుదల కావచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆ జీవో వస్తే సినిమా థియేటర్లకు ప్రకటించిన విద్యుత్ రాయితీ అమలవుతుందని, దానివల్ల థియేటర్ల నిర్వహణా భారం కొంతమేర తగ్గుతుందని చాలా మంది థియేటర్ల యజమానులు ఎదురు చూస్తున్నారు. ఆ జీవో చుసిన తర్వాత థియేటర్లను ఆరంబించాలనుకునే యజమానులు లేకపోలేదు. మరోవైపు ఇలాంటి రాయితీలు ఏపీలో తమకు కూడా ప్రకటిస్తే కొంతమేర ఉపశమనంగా ఉంటుందని అక్కడి థియేటర్ల యజమానులు కొండంత ఆశగా ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే అక్కడి థియేటర్లను తెరిచేందుకు యజమానులు కాస్త తటపటాయిస్తున్నారు. మొత్తం మీద వివిధ తేదీలలో దశలవారీగానే థియేటర్లు తెరుచుకుంటాయన్నది సుస్పష్టం. హైదరాబాద్ నగరంలో ఈ నెల 4న మహేష్ బాబుకు చెందిన ఎ ఎంబి మల్టీఫ్లెక్స్ తో పాటు ఇతర ముల్టీఫ్లెక్స్ కనీసం ఐదు ఆటలతో ప్రారంభమవుతాయని చెబుతున్నారు. ఎన్ని ఆటలైనా ప్రదర్చించుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ ప్రేక్షకులు వచ్చే దానిని బట్టి షోలు పెంచుతామని యాజమాన్యాలు అంటున్నాయి.
Must Read ;- మహేష్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నానంటున్న కామెడీ డైరెక్టర్