CJI NV Ramana Is Deeply Dissatisfied With The Attitude Of Police :
ఏపీలో ప్రజల భద్రత, నేరాల నియంత్రణ కోసం పనిచేస్తున్న పోలీసులపై ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు రేకెత్తుతున్నాయి. అధికార పార్టీ నేతలు చెప్పినట్టుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం.. ప్రతిపక్షాలకు చెందిన నేతలను టార్గెట్ గా చేసుకుని అక్రమ కేసులు బనాయిస్తోందన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న అక్రమ మైనింగ్ ను పరిశీలించేందుకు వెళ్లిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై వైసీపీ శ్రేణులు దాడికి దిగితే.. వారిపై కేసులు పెట్టాల్సిన పోలీసులు.. బాధితుడైన దేవినేనిపైనే కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైలుకు పంపిన వైనమే ఇందుకు నిదర్శనమని చెప్పాలి. ప్రతిపక్షాలకు చెందిన నేతలు అన్యాయం జరిగిన కుటుంబాలను పమార్శించేందుకు కూడా వీల్లేదన్నట్లుగా మొన్నటికి మొన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ ను అడుగడుగునా అడ్డగించడంతో పాటు ఆయననూ అరెస్ట్ చేసి రోజంతా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పిన వైనం కూడా పోలీసుల తీరును స్పష్టం చేసేదేనని చెప్పాలి.
ఈ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ఈ తరహా పోలీసుల వైఖరి ఏపీలోనే కాదు.. దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ఉన్నట్టేనని చెప్పాలి.ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు చెప్పినట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపైనా విమర్శలు రేకెత్తుతున్నాయి. దీనిపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తనదైన శైలి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కొంతమంది పోలీసు అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని వ్యాఖ్యానించింది. అధికార పార్టీ నేతల ప్రాపకం కోసం ఏంచేసేందుకైనా సిద్ధపడుతున్నారని ఆక్షేపించింది. అధికార పార్టీ నేతల రాజకీయ ప్రత్యర్థులను పోలీసులు వేధింపులకు గురిచేస్తున్న ఘటనలు ఎక్కువవుతున్నాయని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజలకు సేవలు అందించాల్సిన పోలీసులు అధికార పక్షానికి కొమ్ముకాయడం కలవరపరిచే అంశం అని వెల్లడించింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ఇటువంటి పరిస్థితులు కనిపిస్తుండడం దురదృష్టకరమని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇలాంటి దుస్సంప్రదాయానికి తెరపడాల్సిన అవసరం ఉందని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
జస్టిస్ ఎన్వీ నోట నుంచే..
చత్తీస్ గఢ్ కు చెందిన ఓ పోలీసు అధికారికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. పోలీసులు కచ్చితంగా చట్టానికి లోబడి వ్యవహరించాలని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈ తరహా విచారణలు, సంచలన వ్యాఖ్యలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. ప్రజా ప్రతినిధులు వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న వైనాన్ని సరిదిద్దే క్రమంలో జస్టిస్ ఎన్వీ రమణ తనదైన శైలిలో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ సాగుతున్నారు. ఈ క్రమంలోనే యావత్తు దేశంలోని పోలీసుల తీరుపై ఆయన తనదైన శైలి అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే.. పద్ధతి మార్చుకోవాలని సలహా ఇచ్చారు.
Must Read ;- జగన్ కేసులపై సుప్రీంలో ప్రత్యేక ధర్మాసనం