భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేరు, ఫొటోలతో ఉన్న ఫేక్ ట్విట్టర్ అకౌంట్‌పై CJI పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడురోజుల క్రితమే జస్టిస్ ఎన్వీరమణ భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే ఆయన పేరుతో ట్విట్టర్ అకౌంట్ ఉండడం, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాక కూడా ఆ ఫేక్ అకౌంట్‌లో పలు పోస్టులు పెట్టడం గమనించిన CJI జస్టిస్ ఎన్వీ రమణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలోనూ పలువురు సెలబ్రిటీలు,ప్రముఖుల పేర్లతో ఫేక్ అకౌంట్లు ఉన్న విషయం కూడా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. సోనూసూద్, స్మృతి ఇరానీ, ఆలీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్, గడ్కరీ తదితరుల పేర్లతో పాటు పలువురు హీరో, హీరోయిన్ల పేర్లతో నకిలీ ఖాతాలను క్రియేట్ చేసిన కొందరు వ్యక్తులు అభ్యంతరకర పోస్టులను పెట్టినట్లు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా పెద్ద యెత్తున నకిలీ ఖాతాలను తొలగించేందుకు ట్విట్టర్ గతంలో ప్రయత్నించింది.
గతేడాది మేలో..
కాగా జస్టిస్ ఎన్వీ రమణ పేరుతో గతేడాది మే నెలలో ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ అయింది. వాస్తవానికి ట్విట్టర్ మాత్రమే కాదు.. సోషల్ మీడియాలో జస్టిస్ ఎన్వీ రమణకు ఎలాంటి అకౌంట్లు లేవు. అయితే @NVRamana పేరుతో ఈ అకౌంట్ క్రియేట్ చేశారు. 98 పోస్టులు చేశారు. ఈ అకౌంట్‌కి 5859మంది ఫాలోవర్లు కూడా ఉన్నారు. ఇంతమంది ఫాలోవర్లలో చాలామందికి ఆ ట్విట్టర్ అకౌంట్ నకిలీదని తెలియకపోవచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. రెండురోజుల క్రితం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌కు మద్దతు తెలుపుతూ దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై భారతదేశ జాతీయ జెండాను ప్రదర్శించారు. ‘స్టే స్ట్రాంగ్ ఇండియా’ అనే సందేశాన్ని బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించారు. అబుదాబి భారత రాయబార కార్యాలయం ఈ మేరకు ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ఆ వీడియోను ఎన్వీ రమణ పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేశారు. కొన్ని కామెంట్లను కూడా చేశారు.
మోదీ ప్రభుత్వం కొవిడ్ నియంత్రణకు ప్రయత్నిస్తోందని అర్థం వచ్చేలా..
మోదీ ప్రభుత్వం కొవిడ్ నియంత్రణకు శతవిధాలా ప్రయత్నిస్తోందని అర్థం వచ్చే కామెంట్లు పెట్టారు. దీంతోపాటు జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవల్ దౌత్యం, చొరవ కారణంగానే భారత్‌కి అమెరికా ఔషధ ముడిపదార్థాల సరఫరాకు అంగీకరించిందని పోస్టు చేసి మళ్లీ డిలీట్ చేశారు. ఇందుకు పీఎంఓ అకౌంట్‌ను ట్యాగ్ చేశారు. కొవిషీల్డ్ టీకా తయారీకి కావాల్సిన ముడి పదార్థాల ఎగుమతులపై నిషేధం ఎత్తివేస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని ఉద్దేశిస్తూ ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ట్విట్టర్ అకౌంట్ విషయం, పోస్టుల విషయం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దృష్టికి రావడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ట్విట్టర్‌లో తన పేరుతో ఫేక్ అకౌంట్‌ని సృష్టించి పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ అకౌంట్ ఎవరు క్రియేట్ చేశారు, ఎందుకు క్రియేట్ చేశారు అనేది తేలాల్సి ఉంది. కాగా జస్టిస్ ఎన్వీ రమణ భారత ప్రధాన న్యాయమూర్తిగా కాకుండా అడ్డుకునేందుకు పలు విధాలుగా ప్రయత్నాలు జరిగాయన్న ప్రచారం ఉన్న నేపథ్యంలో ఈ ట్విట్టర్ అకౌంట్ వెనక ఉన్నది ఎవరు అనే చర్చ నడుస్తోంది.











