ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన నిరుపేదలకు మరోసారి గుడ్‌న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. NTR భరోసా పింఛను పథకం కింద కొత్త లబ్ధిదారుల ఎంపిక కోసం సోమవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ అధికారికంగా ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు సచివాలయాల్లో ఈ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అర్హత ఉండి ఇంతవరకు పింఛను అందుకోని అర్హులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. దరఖాస్తు నమూనాలను సచివాలయాలతో పాటు అధికారిక వెబ్‌సైట్ల నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కల్పించారు..
కొత్త పింఛన్ల దరఖాస్తుల ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, వేగంగా పూర్తి చేసేందుకు అధికారులు పక్కా షెడ్యూల్ రూపొందించారు. సోమవారం నుంచి ఈ నెల 16 వరకు దరఖాస్తుల స్వీకరణ, ఆన్‌లైన్ నమోదు, EKYC తనిఖీలు కొనసాగుతాయి. సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్ లేదా వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ కార్యదర్శుల ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుంది. ఆన్‌లైన్ చేసిన వెంటనే దరఖాస్తుదారునికి రసీదు అందజేస్తారు. ఆరు అంచెల తనిఖీ విధానం ద్వారా అర్హులను ఎంపిక చేయనున్నారు. దరఖాస్తుదారుల అర్హతను నిర్ధారించేందుకు 2019 డిసెంబరులో జారీ చేసిన జీవో 174నే అధికారులు ప్రామాణికంగా తీసుకుంటున్నారు..
ఈ నెల 17 నుంచి 21 వరకు సాధారణ అర్హతల తనిఖీ, క్షేత్రస్థాయి పరిశీలన, వృత్తిపరమైన పింఛన్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుంది. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల దరఖాస్తులు ఎంపీడీవో లేదా మున్సిపల్ కమిషనర్ లాగిన్‌కు, ఒంటరి మహిళల దరఖాస్తులు తహసీల్దారు లాగిన్‌కు వెళతాయి. అలాగే చేనేత, మత్స్యకారుల వంటి వృత్తిపరమైన పింఛన్ల దరఖాస్తులను సంబంధిత శాఖల జిల్లా అధికారులకు పంపిస్తారు. ఈ నెల 22 నుంచి 24 వరకు వివిధ స్థాయిల అధికారుల పరిశీలన పూర్తయిన తర్వాత, 25, 26 తేదీల్లో బడ్జెట్ ప్రతిపాదనలు, ప్రభుత్వ ఆమోద ప్రక్రియ ముగియనుంది..
దరఖాస్తుదారులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రంతో పాటు, ఆయా కేటగిరీలకు తగిన సర్టిఫికెట్లను (వితంతువులకు భర్త మరణ ధ్రువీకరణ పత్రం, దివ్యాంగులకు సదరమ్ సర్టిఫికెట్ మొదలైనవి) సమర్పించాల్సి ఉంటుంది. వివిధ దశల పరిశీలన తర్వాత అర్హులుగా తేలిన వారికి ప్రభుత్వ ఆమోదానికి అనుగుణంగా కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నారు. SERP ఏ నెల నుంచి మంజూరు ఉత్తర్వులు జారీ చేస్తుందో, అప్పటి నుంచే పింఛను వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మొత్తం ప్రక్రియను జిల్లా కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించనున్నారు..
రాష్ట్రంలో ప్రస్తుతం 61.92 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని, ఇందుకు నెలకు రూ.2,693.90 కోట్లు వెచ్చిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జనాభా ప్రాతిపదికన రాష్ట్రంలో 12.88 శాతం మందికి పింఛన్లు అందుతున్నాయని వెల్లడించింది. ఇటు వృద్ధాప్య, వితంతు పింఛన్లను రూ.4 వేలకు, దివ్యాంగుల పింఛనును రూ.6 వేలకు పెంచి ఇస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు కొత్త వారికి తలుపులు తెరిచింది. ఈ నెలలో దరఖాస్తుల ప్రక్రియ పూర్తయిన అనంతరం, రాబోయే అక్టోబరు 1 నుంచి కొత్త పింఛన్ల పంపిణీ ప్రారంభం కానుంది..











