ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, జనసేనలతో కలిసి బరిలోకి దిగిన టీడీపీ… రాష్ట్ర ప్రజలకు సూపర్ సిక్స్ పేరిట బంపరాఫర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. టీడీపీ అనుకున్నట్లుగానే జనం ఆ పార్టీ ఆధ్వర్యంలోని కూటమికి భారీ విజయాన్ని కట్టబెట్టారు. ఫలితంగా ఏపీకి మరోమారు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు హామీల అమలుపై దృష్టి సారించారు. ఖజానాలో చిల్లిగవ్వ లేనప్పటికీ… క్రమంగా పరిస్థితులను చక్కదిద్దుతూనే ఎన్నికల్లోప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా టీడీపీ కూటమి సర్కారు దూసేకుపోతోంది. బుధవారం నాటి కేబినెట్ భేటీలో సూపర్ సిక్స్ హామీ అమలును ప్రస్తావించిన చంద్రబాబు… సూపర్ సిక్స్ లో ప్రధానమైన ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీని ప్రారంభిద్దామంటూ ప్రతిపాదించగా… కేబినెట్ మొత్తం ముక్తకంఠంతో అందుకు సమ్మతి తెలిపింది.
దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీని మొదలుపెట్టనున్నట్లుగా చంద్రబాబు ప్రకటించారు. ఈ పథకం కింద అర్హులైన ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందించనున్నారు. ప్రస్తుతం ఒక్కో గృహవినియోగ గ్యాస్ సిలిండర్ ధర రూ.850 దాకా ుండగా… ఒక్కో కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తే…సదరు కుటుంబానికి ఏడాదికి రూ.2,500 మేర లబ్ధి చేకూరినట్టే. అంతేకాకుండా చిన్న కుటుంబాలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు సరిపోతాయన్న వాదనలూ వినిపిస్తున్నాయి. అయితే ఈ పథకానికి అర్హతా ప్రమాణాలు ఏమిటన్న దానిపై చంద్రబాబు సర్కారు కసరత్తు చేస్తోంది. సీఎం ఆదేశాలతో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఈ వ్యవహారంపై యుద్ధప్రాతిపదికన అర్హతా ప్రమాణాలను ఖరారు చేసే పనిలో నిమగ్నమైపోయింది.
ప్రస్తుతం రాష్ట్రంలో 1.55 కోట్ల మేర వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఉచిత గ్యాస్ పంపిణీకి తెల్ల రేషన్ కార్డును ప్రాతిపదికగా తీసుకుంటే… ఏకంగా 1.47 కోట్ల మేర కుటుంబాలకు అర్హత దక్కే అవకాశాలున్నట్లు సమాచారం. ఇంతమేర కుటుంబాలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ల పంపిణీ అంటే… సర్కారుపై పెను భారం పడక తప్పదు. ఈ క్రమంలో ప్రస్తుతం ఉచిత గ్యాస్ సిలిండర్లు అమలు అవుతున్న రాష్ట్రాల్లో అర్హతా ప్రమాణాలు ఏ రీతిన ఉన్నాయి?, పథకం ఏ తీరున అమలు అవుతోందన్న దానిపై అథ్యయనం చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలతో ఇప్పటికే పౌర సరఫరాల శాఖ సీఎం ముందు ఓ నివేదికను ఉంచినట్లు సమాచారం. ఈ నివేదికను పరిశీలించిన మీదట అర్హత ప్రమాణాలకు తుది రూపు ఇచ్చే అవకాశాలున్నాయి. ఊది ఊమైనా సూపర్ సిక్స్ లో కీలకమైన ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి కూటమి సర్కారు దీపావళి పర్వదినాన్ని ఎంచుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.