పేదల ఆదాయం, జీవనప్రమాణాలు పెరిగి 2029 నాటికి పేదరికం లేని సమాజం ఏర్పడాలన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆర్థిక అసమానతలు తొలగాలనే లక్ష్యంతో P-4 అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రధాని మోదీ, తాను, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఆలోచించేది రాష్ట్ర అభివృద్ధి కోసమేనన్నారు. డాక్టర్ B.R.అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరులో నిర్వహించిన P-4 ప్రజావేదిక సభలో చంద్రబాబు మాట్లాడారు. భగవంతుడు కరుణిస్తే భవిష్యత్తులో పింఛను మొత్తాన్ని మరింత పెంచుతామని గుడ్‌న్యూస్ చెప్పారు. భర్త చనిపోయిన మహిళలకు గత ప్రభుత్వం పింఛన్లు ఇవ్వలేదని..71,380 మందికి ఈ నెలలో రూ.4వేల చొప్పున పంపిణీ చేస్తామన్నారు.
వైసీపీ పాలనలో కేంద్రం 94 పథకాలకు ఆర్థిక సాయం చేస్తే ఆ డబ్బును ఇతర అవసరాలకు మళ్లించడం వల్ల రాష్ట్రాన్ని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టే పరిస్థితికి తీసుకొచ్చారని ఆరోపించారు చంద్రబాబు. కూటమి సర్కార్ వచ్చాక రాష్ట్రవాటా చెల్లించి 74 పథకాలను పునరుద్ధరించామన్నారు. గతంలో ఉద్యోగుల PF వాడేశారని..రూ.7,500 కోట్లు తిరిగి వారికి చెల్లించామన్నారు. సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం అమలుచేస్తుందన్నారు చంద్రబాబు. ఈ నెలలోనే అన్నదాతా సుఖీభవ పథకాన్ని అమలుచేస్తామని, పాఠశాలలు తెరిచేలోగా ఎంతమంది పిల్లలుంటే అందరికీ రూ.15 వేల చొప్పున తల్లికి వందనం..ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామన్నారు. ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయాలని కొందరు కుయుక్తులు పన్నుతున్నారని పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో పాస్టర్ మరణిస్తే, ఎవరో చంపారని బురదజల్లాలని ప్రయత్నించారన్నారు. తనది డేగకన్ను అని..ఎవరు తప్పు చేసినా టెక్నాలజీతో కనిపెడతానన్నారు చంద్రబాబు.
ఇక అన్ని హాస్పిటల్స్‌లో రోగుల వివరాలు సేకరించి AIతో ఇంటిగ్రేట్ చేస్తామన్నారు చంద్రబాబు. వ్యాధులు రాకుండా, వచ్చిన తర్వాత ఏం చేయాలనే అంశంపై గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి పని చేస్తామన్నారు. కుప్పంలో ఓ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామన్నారు. ఆరు నెలల్లో ఆ జిల్లాలో, రెండేళ్లలో రాష్ట్రంలో పూర్తిచేస్తామన్నారు.
ఒకప్పుడు కోనసీమలో GDP మెరుగ్గా ఉంటే..కరవు జిల్లా అనంతపురం వెనుకబడి ఉండేదన్నారు చంద్రబాబు. ఇప్పుడు కోనసీమ వెనుకంజలో ఉంటే, అనంతపురం భాగ్యనగర జిల్లాగా మారుతోందన్నారు. జూన్ 12 నుంచి పాలనలో గేర్ మారుస్తానని స్పష్టం చేశారు చంద్రబాబు. ఇటీవల గోదావరిలో స్నానానికి దిగి 8 మంది పిల్లలు మృత్యువాతపడగా వారి కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఆర్థికసాయం మంజూరు చేశారు.