ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన రాజకీయ ప్రత్యర్థి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నిజంగానే బిగ్ షాక్ ఇచ్చారు. పాలనలో తనదైన దూకుడుతో సాగే చంద్రబాబు.,.. జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులకు తాగునీటి పథకాన్ని ప్రకటించి జగన్ తో పాటు వైసీపీ శ్రేణులను విస్మయానికి గురి చేశారు. పులివెందుల నుంచి ఇప్పటిదాకా మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఓ సారి కడప ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన జగన్… తన కంచుకోటగా చెప్పుకునే పులివెందులకు ఇప్పటిదాకా మంచినీటి సౌకర్యాన్ని కల్పించిన పాపాన పోలేదు. ఆ వెలితిని తీర్చే దిశగా అడుగులు వేసిన చంద్రబాబు… ఏ ఒక్కరూ ఊహించని విధంగా పులివెందులకు మంచి నీటి పథకాన్ని మంజూరు చేశారు. ఈ దెబ్బతో జగన్ ఉక్కిరిబిక్కిరి కావడం ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి.
జగన్ తో పాటు ఆయన ముఖ్య అనుచరుడు, మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్ కు కూడా చంద్రబాబు మంచి నీటి పథకాన్ని ప్రకటించారు. వైసీపీ జమానాలో అసెంబ్లీలో చంద్రబాబును హేళన చేసి మాట్లాడుతూ తనదైన శైలిలో వ్యంగ్యోక్తులు విసిరిన బుగ్గన… తన నియోజకవర్గ ప్రజలకు కనీసం తాగునీటి సౌకర్యాన్ని కూడా అందించలేకపోయారని కూటమి సర్కారు తన తాజా నిర్ణయంతో తేల్చి చెప్పింది.
రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జల్ జీవన్ మిషన్ పై సుదీర్ఘంగా చర్చ జరగగా… కేంద్ర ప్రాయోజిత పథకమైన మిషన్ ను సక్రమంగా అమలు చేయడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోందని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లో తాగు నీటి సమస్యలపై ప్రస్తావన రాగా…కిడ్నీ సమస్యలతో సతమతమవుతున్న ఉద్ధానం ప్రాంతంలో తాగునీటి ప్రాజెక్టుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్భంగా పులవవెందుల, డోన్ ల ప్రస్తావన రాగా… చంద్రబాబు వెనువెంటనే ఆ రెండు నియోజకవర్గాలకు కూడా తాగునీటి ప్రాజెక్టులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పథకాల కింద ఉద్ధానం, పులివెందుల, డోన్ నియోజకవర్గాల్లో 10 లక్షల మంది చొప్పున తాగు నీటి వసతిని కల్పిస్తారు. ఇందుకు అవసరమైన మేర నిధుల కేటాయింపునకు కూడా కేబినెట్ అక్కడికక్కడే ఆమోద ముద్ర వేసింది.
పులివెందులకు తాగు నీటి పథకాన్ని ప్రకటించడం ద్వారా చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారని చెప్పక తప్పదు. సీఎంగా, విపక్ష నేతగా, ఎంపీగా పనిచేసిన జగన్… తాను ఎంతగానో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టానంటూ భారీ ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తనతో పాటు తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, తల్లి వైఎస్ విజయమ్మలను గెలిపించిన పులివెందుల ప్రజలకు జగన్ కనీసం తాగు నీటి సౌకర్యాన్ని కూడా అందించడంలో విఫలమయ్యారని చెప్పక తప్పదు. ఈ విషయం జనానికి చేరేలా చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించి పులివెందులకు తాగు నీటి సౌకర్యాన్ని ప్రకటించినట్టుగా విశ్లేషణలు సాగుతున్నాయి.
2014లో కూడా సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు… జగన్ గెలిచిన పులివెందులకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారు. పులివెందుల పరిధిలో పూర్తి కాకుండా ఉన్న పలు సాగునీటి ప్రాజెక్టులను చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకుని మరీ పూర్తి చేయించారు. ఈ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలకు స్వయంగా చంద్రబాబు హాజరయ్యారు కూడా. రాజకీయాలు రాజకీయాలే… అభివృద్ధి అభివృద్ధే అన్న చందంగా సాగే చంద్రబాబు… జగన్ ను టార్గెట్ చేయాలని కాకున్నా…పులివెందులకు తాగు నీటి పథకాన్ని కేటాయించి వ్యూహాత్మకంా వ్యవహరించారని చెప్పక తప్పదు.