టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు కక్షలన్నా, కక్ష సాధింపులన్నా పెద్దగా పడవు. అలాంటి వ్యవహారాలకు ఆయన ఆమడంత దూరంలో ఉంటారు. అందుకే కాబోలు…రాయలసీమలో జన్మించినా… ఫ్యాక్షన్ రాజకీయాలు చంద్రబాబు దరి చేరలేదు. రాజకీయాల్లోనే కాదు పాలనలోనూ ఇదే తరహా ధోరణితో ముందుకు సాగుతున్న చంద్రబాబు… తన ముందు పాలించిన నేతలు తీసుకున్న నిర్ణయాలను ఏమాత్రం బేషజాలు లేకుండానే అమలు చేసుకుంటూ వెళతారు.
అయితే సదరు నేతలు ఏర్పాటు చేసిన వ్యవస్థల్లోని లోటుపాట్లను సరిచేయడంలో చంద్రబాబు చాలా జాగ్రత్తలే తీసుకుంటారు. 2019 నుంచి ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను కొనసాగించేందుకే చంద్రబాబు నిర్ణయించారు. అయితే జగన్ జమానాలో చిందరవందరగా ఏర్పాటైన ఈ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి దానిని చక్కదిద్దే పనిని చంద్రబాబు ఇప్పుడు తన భుజస్కందాలపైకి ఎత్తుకున్నారు. త్వరలోనే ఈ వ్యవస్థను సరి చేసి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు.
2019లో అధికారం చేతికందగానే… వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసిన జగన్… దానికి గ్రామ స్వరాజ్యమంటూ పేరు పెట్టుకున్నారు. అంతేకాకుండా వాలంటీర్ వ్యవస్థకు అనుబంధంగా గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. ఈ రెండు వ్యవస్థలు రాష్ట్ర రూపురేఖలను మార్చేస్తాయంటూ జగన్ బాకాలు ఊదారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 15,004 సచివాలయాలను ఏర్పాటు చేశారు. వీటిలో 13,291 గ్రామ పంచాయతీలకు గాను 11,152 గ్రామ సచివాలయాలు ఉన్నాయి. అదే సమయంలో పట్టణాల్లో 3,842 వార్డు సచివాలయాలు ఉన్నాయి. గ్రామ సచివాలయాల్లో 95,533 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా… వార్డు సచివాలయాల్లో 31,592 మంది పనిచేస్తున్నారు. ఈ లెక్కన రాష్ట్రంలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో 1,27,175 మంది పనిచేస్తున్నారు. వీరిలో నేరుగా నియమితులు అయిన వారు 1,19,804 మంది కాగా… 7,372 మందిని వివిధ విభాగాల నుంచి సచివాలయ వ్యవస్థలోకి తీసుకున్నారు. నేరుగా జరిగిన నియామకాల్లో వైసీపీకి అనుకూలంా ఉన్న వారికే అగ్ర తాంబూలం లభించింది. అంతేకాకుండా వైసీపీ నేతలు చెప్పిన పనులకే వీరు అత్యధిక ప్రాధాన్యమిచ్చారన్న ఆరోపణలూ లేకపోలేదు.
రాష్ట్ర ప్రజలకు నేరుగా వారి గ్రామాల్లోనే అన్ని రకాల సేవలు అందించేందుకు ఉద్దేశించిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను కొనసాగించేందుకే చంద్రబాబు నిర్ణయించారు. అయితే జగన్ జమానాలో జరిగిన పొరపాట్లు తమ హయాంలో పునరావృతం కాకుండా చూసే దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం సచివాలయాల వ్యవస్థపై సమీక్షించిన చంద్రబాబు… రాష్ట్రంలో ఉన్న సచివాలయాలు, వాటిలో పనిచేస్తున్న ఉద్యోగులు, సదరు ఉద్యోగుల ద్వారా ప్రజలకు అందుతున్న సేవలపై వివరాలు సేకరించారు. అదే సమయంలో ఈ వ్యవస్థ లోటుపాట్లపై కూడా చంద్రబాబు ఆరా తీశారు. గతంలో పంచాయతీకి ఒకే ఒక్క గ్రామ కార్యదర్శితో పనులన్నీ పూర్తి అవుతుండగా… మండల స్థాయిలో వాటికి సంబంధించిన ఇతరత్రా పనులు జరిగేవి.
సచివాలయాల వ్యవస్థ వచ్చిన తర్వాత మండల స్థాయిలో ఉండే సిబ్బంది ప్రతి గ్రామంలో అందుబాటులోకి వచ్చారు. మరి అలాంటప్పుడు ప్రజలకు సేవలు మరింత సులభతరంగా అందాలి కదా. ఆ దిశగా పనులు జరుగుతున్నాయా? లేదా? అన్నదానిపైనా చంద్రబాబు ఆరా తీశారు. అయితే సేవల విషయంలో కొంత మేర ఇబ్బంది ఉన్న విషయాన్ని గుర్తించిన చంద్రబాబు,… సచివాలయ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తే తప్పించి ఈ వ్యవస్థ ఫలప్రదం కాదన్న అంచనాకు చంద్రబాబు వచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా రాజకీయ నేతల ప్రభావం సచివాలయాలపై పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపైనా ఆలోచన చేయాలని ఆయన అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా జగన్ ప్రవేశపెట్టారన్న కారణంగా సచివాలయ వ్యవస్థను రద్దు చేయకుండా దానిని ఉన్నతంగా తీర్చిదిద్దే బృహత్కార్యానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు.