పేదల సంక్షేమమే ధ్యేయంగా, వారు సమాజంలో ఎవరిపైనా ఆధారపడకుండా స్వేచ్ఛగా, ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశ్యంతో ఏపీ ప్రభుత్వం ముందుకువెళ్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ శాశ్వత ఇళ్ల పట్టాలు అందించే బృహత్తర కార్యక్రమాన్నిఓ ఉద్యమంలా చేపట్టింది. నెల్లూరు నగరంలోని పూలే విగ్రహం కూడలి వద్ద సర్వేపల్లి కాలువకట్ట ప్రాంతంలో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న ప్రజల ఇళ్ల స్థలాల కల నెరవేరింది. ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు అమరావతిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. దశాబ్దాలుగా ప్రభుత్వ, ఆక్రమిత స్థలాలలో ఉంటూ రేకుల షెడ్లలో కాలం వెళ్లదీస్తున్న పేదలకు శాశ్వత భద్రత కల్పించడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.
ఈ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఒక్క నెల్లూరు నగరంలోనే రూ.600 కోట్ల విలువైన ఆస్తులపై పేదలకు శాశ్వత హక్కులు కల్పించారు. మొత్తం 22.31 ఎకరాల విస్తీర్ణంలో 939 మంది లబ్ధిదారులకు అధికారులు పట్టాలు అందజేశారు. విశేషం ఏమిటంటే, ఈ లబ్ధిదారులలో ఏకంగా 701 మంది మహిళలే ఉండటం నిజమైన మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలిచింది. ఈ పరంపర ఇక్కడితో ఆగదని, వచ్చే సంక్రాంతి నాటికి నెల్లూరు నగరంలో మరో 4 వేల పేద కుటుంబాలకు కూడా ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. కేవలం నెల్లూరు మాత్రమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా నెల్లూరు, విజయవాడ, మంగళగిరి ప్రాంతాల్లో ఇప్పటివరకు సుమారు 60 వేల కుటుంబాలకు ఏకంగా రూ.52 వేల కోట్ల విలువైన ఆస్తులను ఇళ్ల పట్టాల రూపంలో అందజేసి ఒక రికార్డు సృష్టించారు.
గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల పట్టాలు పొందాలంటే నానా ఇబ్బందులు పడాల్సి వచ్చేదని, లంచాలు ఇస్తేనే పత్రాలు చేతికివచ్చేవని లబ్ధిదారులు గుర్తుచేసుకుంటున్నారు. కానీ నేడు కూటమి ప్రభుత్వంలో ఎలాంటి పైసా లంచం ఇవ్వకుండా, అత్యంత పారదర్శకంగా పట్టుచీర, పసుపు, కుంకుమలతో మర్యాదపూర్వకంగా ఇళ్ల పట్టాలను పేదల చేతికి అందిస్తున్నారు. మంత్రి నారాయణ ప్రత్యేక చొరవతో సర్వేపల్లి కాలువకట్ట ప్రాంత వాసుల 60 ఏళ్ల కష్టాలకు శాశ్వత పరిష్కారం దొరికిందని, త్వరలోనే జాఫర్ సాహెబ్ కాలువ ప్రాంతంలోనూ ఈ కార్యక్రమం విస్తరించనుందని వెల్లడించారు.
ఇదే సందర్భంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేయడం, రాజముద్రతో కూడిన కొత్త పాస్‌పుస్తకాలను రైతులకు అందజేయడం వంటి చర్యల ద్వారా ప్రభుత్వం పరిపాలనలో పారదర్శకతను చాటుకుంటోంది. పేదలకు కేవలం ఇళ్ల స్థలాలే కాకుండా, ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్, సంజీవని వైద్య సేవలు, దీపం-2 ఉచిత గ్యాస్, స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాలను జోడించి అందిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ, పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఈ ఇళ్ల పట్టాల పంపిణీ మహాయజ్ఞం ప్రస్తుతం ఏపీలో సామాజిక ఉద్యమంలా విజయవంతంగా కొనసాగుతోంది.











