వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహిళల భద్రతపై పెద్ద లెక్చర్లే ఇస్తారు. తాను సీఎం అయ్యాక.. దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో లేని విధంగా తమ ప్రభుత్వం మహిళల రక్షణ కోసం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. తన కేబినెట్ లో ఏకంగా హోం శాఖనే ఓ మహిళా నేతకు అప్పగించినట్లుగానే చెప్పుకుంటున్నారు. అయినా.. గానీ మహిళలపై దాడులు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఏపీలోనే అధికంగా చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లెక్కల ప్రకారం జగన్ అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలోనే ఏకంగా 500 మంది మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యాచారాలు, లైంగిక వేధింపులు జరిగాయి. మరి ఇన్నేసి ఘటనలు నమోదు అవుతుంటే.. మహిళా భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న జగన్ సర్కారు వాటిని ఆపలేకపోతున్నట్లే కదా. ఈ క్రమంలోనే శుక్రవారం విజయనగరం జిల్లాలో ఓ అమ్మాయిపై ఆమె ప్రేమికుడే పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై సీఎం హోదాలో జగన్ ఆరా తీశారట. ఘటనలపై ఆరా తీయడం, వివరాలు సేకరించడం ఓకే.. మరి తాము చెబుతున్నట్లుగా మహిళలపై వరుసపెట్టి జరుగుతున్న ఈ ఘోరాలకు జగన్ సర్కారు ఎప్పుడు చెక్ పెడుతుందన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.
మరో యువకుడితో మాట్లాడొద్దట
విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చౌడువాడలో శుక్రవారం చోటుచేసుకున్న దారుణం వివరాల్లోకి వెళితే.. తనతో పెళ్లి నిశ్చయమైన యువతి వేరే యువకుడితో మాట్లాడుతోందని జిల్లాలోని నవరకు చెందిన రాంబాబు.. చౌడువాడకు చెందిన యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఊహించని ఈ ఘటన నుంచి ఆ యువతిని రక్షించేందుకు యత్నించిన ఆమె సోదరి, ఆమె కుమారుడు కూడా ఈ ఘటనలో గాయపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు.. బాధితులు ముగ్గురిని విజయనగరం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవల సదరు యువతితో రాంబాబుకు వివాహం నిశ్చయమైంది. అయితే, ఆ యువతి మరో యువకుడితో మాట్లాడుతోందని రాంబాబు ఆగ్రహంతో ఊగిపోయాడు. చివరకు పెళ్లి రద్దు చేసుకున్నాడు. దీంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ చెలరేగింది. నిన్న రాత్రి ఇరు కుటుంబాలను పిలిచి పోలీసులు రాజీ కుదర్చడంతో పోలీసుల సూచనలతో వివాహం చేసుకునేందుకు రాంబాబు ఒప్పుకున్నాడు. అయితే, మళ్లీ ఇంతలోనే ఏం జరిగిందో కానీ, నిన్న అర్ధరాత్రి సమయంలో యువతిపై దారుణానికి పాల్పడ్డాడు రాంబాబు.
సీఎం జగన్ ఆరా
ఈ ఘటనపై సీఎం జగన్ స్పందించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధితురాలి ఆరోగ్యం నిలకడగానే ఉందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. బాధితురాలికి మరింత మెరుగైన వైద్యం అందించాలని, ఆమెను విశాఖ తరలించాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో బాధితురాలిని విశాఖ ఆసుపత్రికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అటు, ఈ వ్యవహారంలో సీఎం జగన్ మంత్రి బొత్స సత్యనారాయణకు కూడా దిశానిర్దేశం చేశారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించాలని, వారికి అండగా నిలవాలని సూచించారట. సీఎం ఆదేశాలతో బొత్సతో పాటు ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి, అధికారులు బాధితురాలిని పరామర్శించారు. ఇదంతా ఓ సీఎంగా జగన్ చేయాల్సిందే. అయితే జగన్ సర్కారు మహిళలపై వరుసగా జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. దిశ చట్టం, దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు అంటూ ఊదరగొడుతున్న జగన్ సర్కారు.. ఆచరణలో మాత్రం నిందితులకు చెక్ పెట్టడంలో విఫలమవుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Must Read ;- నారా లోకేశ్ ను చూస్తుంటే జగన్ కు దడే