టీడీపీ ప్రభుత్వంలో అడ్వకేట్ జనరల్ గా పనిచేసిన దమ్మలపాటి శ్రీనివాస్ కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన ‘గ్యాగ్ ఆర్డర్’ ఏపీ ప్రభుత్వ ఆగ్రహానికి కారణమైంది. 43,000 వేల కోట్ల అక్రమ ఆస్తులలో నిందుతుడిగా ఉన్న వ్యక్తి అత్యున్నత న్యాయమూర్తులకు దురుద్దేశాలను ఆపాదిస్తూ లేఖ వ్రాయడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అన్ని వ్యవస్థలను నాశనం చేస్తూ న్యాయవ్యవస్థలపై కూడా తమ అధికారాన్ని చూపాలని సీఎం జగన్ ప్రయత్నిస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితులలో సమర్ధించకుండా ఖండించాలని న్యాయనిపుణులు, మేధావులు కోరుతున్నారు.
అనుమానాలు
న్యాయవ్యవస్థలపై ప్రజలు నమ్మకాన్ని పెట్టుకుంటారు. తమకు ఎక్కడ న్యాయం జరగకపోయినా ఇక్కడ న్యాయం జరుగుతుందని ఆశలు పెట్టుకుంటారు. అలాంటి వ్యవస్థను కూడా నాశనం చేయాలని జగన్ సర్కార్ చేస్తున్న చర్యలు గర్హనీయమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ముఖ్యమంత్రి చంద్రబాబు, న్యాయశాఖల మధ్య జరిగిన నివేదికలను బహిరంగం చేయరాదని నిబంధనలు ఉన్నా వాటిని తుంగలో తొక్కి బయటికి వెలువరించడమేంటని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ప్రమాణ స్వీకారం చేసే సమయంలో అవసరమైన వాటినే తెలియచేస్తానని కొన్నింటిని రహస్యంగా ఉంచుతామని ముఖ్యమంత్రి చెప్పే సంగతిని కూడా జగన్ విస్మరించారని విమర్శలు వస్తున్నాయి.
రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థలు స్వంతంత్రంగా వ్యవహరిస్తాయని పొందుపరిచారు. అలాంటి న్యాయవ్యస్థలపై ఊహాజనితమైన ఆరోపణల ఆధారంగా జగన్ లేఖ వ్రాయడం దుస్సాహసమే అంటూ వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. న్యాయవ్యస్థలు, న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదించడం చట్టపరంగా తప్పే. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి తప్పు చేయడం క్షమించరాని నేరమని అందరూ ముక్తకంఠంతో చెబుతున్నారు.
విచారణను తప్పించుకోవడానికే
ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని అనుసరించి శాసనసభ్యులపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసులకు సంబంధించిన విషయాలను వింటున్న ప్రిసైడింగ్ న్యాయమూర్తికి దురుద్దేశాలు ఆపాదించడం ద్వారా జగన్ ఈ కేసులో విచారణ నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. చీఫ్ జస్టిస్ కు లేఖ రాసిన జగన్ పై అనేక కేసులు ఉన్నాయి. అమికస్ క్యూరీ సిఫారసుల మేరకు ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసులను సుప్రీం వేగవంతం చేసింది. ఈ కేసులను విచారణ జరుపుతున్న ఎన్వీ రమణపై ఫిర్యాదు చేయడం ద్వారా ఈ కేసుల విచారణను ఆలస్యం చేయాలని ఏపీ ప్రభుత్వ ఆలోచనగా ఉన్నట్లు చర్చ జరుగుతోంది. జైలు నుంచి కొన్ని షరతులతో జగన్ బయటికి వచ్చారు. సాక్షాలను, సాక్షాదారులను ప్రభావితం చేయకుండా ఉండాలని జగన్ కు షరతులు విధించారు.
తమ అధికారాన్ని అడ్డపెట్టుకొని ప్రభావితం చేస్తున్న జగన్ కు బెయిల్ కూడా రద్దు చేయాలని డిమాండ్ లు వినబడుతున్నాయి. న్యాయ వ్యవస్థలపై దాడి, ఇతర వ్యవస్థలను నాశనం చేయడం, పరిపాలన ఉల్లంఘన, బెయిల్ నిబంధలను అతిక్రమించడం లాంటివి చేస్తున్న జగన్ పై ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలని మేధావులు కోరుతున్నారు.
దుస్సాహసమే
చీఫ్ జస్టిస్ కు ఈ నెల 6న జగన్ లేఖ వ్రాస్తే 10న మీడియాకి విడుదల చేయడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. శనివారమే మీడియాకి ఈ లేఖ విడుదల చేయడంపై పలు గుసగుసలు వినబడుతున్నాయి. ఆదివారం కోర్టులకు సెలవు. ఆ రోజు ఎటువంటి విచారణలు ఉండవు. అందుకే ఏరి కోరి మరి ఈ లేఖను శనివారం విడుదల చేసినట్లు అర్ధమవుతోంది. ఇలాంటి ఉద్దేశాలు ద్వారా ప్రస్తుత ప్రభుత్వం న్యాయవ్యవస్థల విశ్వసనీయతను దెబ్బకొట్టాలని ప్రయత్నిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. లేఖలోని విషయాలను లేదా అనుబంధాలను ప్రచురించడం నేరుగా కోర్టు ధిక్కారానికి సమానం. అందువల్ల పెండింగ్‌లో ఉన్న కేసులలో న్యాయమైన విచారణ నుండి తప్పించుకోవడానికి నేరస్థులు వేసిన నేరపూరిత కుట్రకు పార్టీగా మారడంతో పాటు వార్తాపత్రికలు / ఛానెల్‌లకు భవిష్యత్తులో వచ్చే అసౌకర్యాన్ని పూర్తిగా నివారించడం మంచిదని వారు హితవు పలుకుతున్నారు.