పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం జగన్మోహన్‌రెడ్డి ఎంపీలకు దిశానిర్ధేశం చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఎంపీలతో ఆయన సమావేశం నిర్వహించారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డితో పాటు మిథున్‌రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి సహా పలువురు ఎంపీలు సమావేశానికి హాజరయ్యారు. ఈ నెల 29న బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉభయ సభల్లో ఎంపీలు అనుసరించాల్సి వ్యూహాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం పెండింగ్ నిధుల విడుదల, ప్రత్యేక హోదాలపై ప్రధానంగా చర్చ సాగినట్లు తెలుస్తోంది.
రైల్వే జోన్ తీసుకువస్తాం..
విశాఖ రైల్వే జోన్, కర్నూలుకు హైకోర్టు తరలింపు, ప్రత్యేక హోదా, పోలవరానికి పూర్తి నిధులు అంశాలను పార్లమెంటులో ప్రస్తావిస్తామని సమావేశం అనంతరం ఎంపీలు మీడియాకు వెల్లడించారు. నివర్ తుపాను నష్టపరిహారం విషయంలోనూ కేంద్రంపై ఒత్తిడి పెంచనున్నారు. ఏపీ రెవెన్యూలోటు భర్తీని కూడా పార్లమెంటులో ప్రస్తావించనున్నారు. దేవాలయాల ధ్వంసంలో టీడీపీ నాయకుల ప్రమేయం ఉందనే ఆధారాలు పోలీసులకు లభించాయని ఎంపీల సమావేశం అనంతరం రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని కూడా పార్లమెంటులో ప్రస్తావిస్తామని ఆయన వెల్లడించారు.
Must Read ;- 2020 రివ్యూ : ఆదాయం లేక అప్పులు.. పథకాల పప్పు బెల్లాలు