కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుని కరోనా కేసులు మళ్లీ పెరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆదివారం ప్రగతి భవన్లో ఉన్నతాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా సెకెండ్ వేవ్ వచ్చినా దానికి తట్టుకుని నిలబడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రజలు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించడమే అసలైన మందన్నారు.
ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో మామూలు పరిస్థితులు నెలకొంటున్నాయి. కరోనా కేసుల సంఖ్య తెలంగాణలో బాగా తగ్గింది. పాజిటివ్ కేసుల సంఖ్య 10 శాతం లోపే ఉందని సీఎం పేర్కొన్నారు. రికవరీ రేటు 94.5 శాతం ఉందని చెప్పారు. రాజస్తాన్, ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కేసులు బాగా పెరుగుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ వైద్యారోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. కోవిడ్ వ్యాప్తిని తట్టుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, దీనికి ప్రజలు కూడా సహకరించాలని కోరారు.
కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన ఆరోగ్య సిబ్బందికే ముందు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు. అయితే ఈ కరోనా వ్యాక్సిన్ డిసెంబర్ నెలలో అందుబాటులో తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. సుమారు 10 కోట్ల మేర డోసులను మొదటి విడతలో భాగంగా పంపిణీ చేయనున్నట్లు ఇప్పటికే తెలిపింది.