‘కలర్ ఫొటో’ అనగానే దాని వెనుక బ్లాక్ అండ్ వైట్ కథ ఏదో ఉండి ఉండాలి. అమృత ప్రొడక్షన్ బ్యానర్ పై శ్రవణ్ కొంక, లౌక్య ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో సందీప్ రాజ్ దర్శకత్వంలో రూపొందిన ‘కలర్ ఫొటో’ ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సుహాస్, చాందీని చౌదరి జంటగా నటిస్తున్నారు. ప్రముఖ నటుడు సునీల్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమా ప్రత్యేకత ఏమిటి? ఇంతకీ ఈ ‘కలర్ ఫొటో’ ఎలా ఉందన్నది చూద్దాం.
కథ ఏమిటంటే..
కథగా చెప్పాలంటే ఇది ఓ నల్లబ్బాయి ప్రేమకథ. పాత్ర పేరు జయకృష్ణ. అతని కలర్ అతనిలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ను పెంచుతుంది. ఒక అమ్మాయిని చూడగానే ప్రేమించేస్తాడు. కానీ తనలోని ఇన్ఫీరియారిటీ కాంపెక్స్ వల్ల తన ప్రేమను వ్యక్తం చేసుకోలేకపోతాడు. తన ప్రేమను ఆమెకు చెప్పాలంటే భయపడతాడు. తను నల్లగా ఉండటంవల్ల ఆమె తననుప్రేమించదని అతని ఉద్దేశం. ఆమెను దూరం నుంచే ఆరాధిస్తుంటాడు. ఆమె ముద్దు పేరు దీపు. ఓ రోజు కాలేజీలో అతన్ని కొందరు అందరి ముందూ కొడతారు. ఆ నేపథ్యంలోనే అతనికి దీపుతో పరిచయం ఏర్పడుతుంది. అదికాస్తా ఆ తర్వాత ప్రేమగా మారుతుంది. ఈ ప్రేమ విషయం ఆమె అన్నయ్య ఎస్పై రామరాజు (సునీల్)కు తెలుస్తుంది. అతనికి జయకృష్ణ నచ్చడు. వీరి వీరి ప్రేమ కథ సుఖాంతమైందా? లేదా అన్నది చూడాల్సిందే.
ఎలా తీశారు?, ఎలా చేశారు?
కథ పాతదే అయినా సినిమాని కళాత్మంగా మలిచారు. కథనంలో వేగం తగ్గినట్టు అనిపించింది. కులమతాల జోలికిపోకుండా రంగును ఎంచుకున్నారు. హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలు సరిగా పండలేదు. జయకృష్ణ తన పాత్రకు న్యాయం చేశాడు. దర్శకుడు అక్కడక్కడా తడబడటంవల్ల ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయిందన్న అనుమానం కలిగింది. కాలభైరవ నేపథ్యం సంగీతం ప్లస్ అయ్యింది. కొన్ని సన్నివేశాల్లో ఎమోషన్ బాగా పండింది. అక్కడక్కడా డైలాగులు కూడా బాగా పేలాయి.
నటీనటులు తమ నటన పరంగా మంచి మార్కులు కొట్టేశారు. సినిమాలో మెలో డ్రామా మరీ ఎక్కువైంది. డైలాగులు బాగున్నా అవి అలరించలేకపోయాయి. ఓటీటీలో విడుదల చేయటం వల్లనేమో అశ్లీల డైలాగులు వచ్చేశాయి. పిల్లలతో కలిసి చూడాలంటే ఇబ్బందికరమే. సన్నివేశాలను బలంగా ప్రెజెంట్ చేయలేకపోవడం ఈ కథలో ప్రధాన లోపం. వైవా హర్ష టైమింగ్, డైలాగులు బాగానే పేలాయి. పాటల పరంగా మంచి మార్కులే పడతాయి. చివరి అరగంట ఈ సినిమాకి ప్రాణం పోసింది. బహుశా ఓటీటీలో విడుదల కావడం ఈ సినిమాకు ప్లస్ అయ్యిందని అనుకోవచ్చు.
నటీనటులు – సాంకేతిక వర్గం: సుహాస్, చాందినీ చౌదరి, సునీల్, వైవా హర్ష తదితరులు. సంగీతం: కాలభైరవ, కథ: సాయి రాజేష్ నీలం, ఆర్ట్: క్రాంతి ప్రియం, కెమెరామెన్: వెంకట్ ఆర్ శాఖమురి, ఎడిటర్: కోదాటి పవన్ కళ్యాణ్, ఫైట్స్: ఎ.విజయ్, సమర్పణ: శ్రవణ్ కొంక, లౌక్య ఎంటర్త్సైన్మెంట్స్, సహ నిర్మాత : మణికంఠ
నిర్మాతలు: సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని
రచన, దర్శకత్వం : సందీప్ రాజ్
ఎక్కడ చూడాలి? : ఆహా (ఓటీటీ)
విడుదల తేదీ: 23 – 10- 2020
ఒక్క మాటలో: ఓటీటీ కి మాత్రం ది బెస్ట్
రేటింగ్ : 3/5
– హేమసుందర్ పామర్తి