హీరో అంటే ఆరడుగుల అందగాడు.. రేంజ్ రోవర్ కారులో తిరిగే రేంజ్.. అని అనుకుంటే తప్పులో కాలేసినట్టే. సినిమా హీరోలు యద్దనపూడి సులోచనారాణి నవలల్లోని హీరోల్లానే ఉండాలనుకునే రోజులకు కాలం చెల్లినట్టే అనిపిస్తోంది.
కలర్ లేని ఫొటోతో కలర్ ఫొటో లాంటి సినిమా చేయడం అంటే అతి పెద్ద సాహసమే. కథలో దమ్ము, నటనలో సత్తా ఉంటే చూసే జనాలకు ఎలాంటి లోటూ ఉండదు.. ఏ కరోనా ఏమీ చేయలేదు. ఈ ఓటీటీ కాలంలో బ్లాక్ బస్టర్ సినిమా ఏదైనా ఉంది అంటే అది కలర్ ఫొటో మాత్రమే. సినిమాలో దమ్ముంటే ఏ రివ్యూ ఏమీ చేయలేదని నిరూపించిన సినిమా కూడా కలర్ ఫొటోనే. ఓ చిన్న సినిమా నెగిటివ్ రివ్యూల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని దూసుకుపోతోందంటే ఇది ఎవరి సత్తా అనే దిశగా ఆలోచించే లా చేసింది.
హీరో సుహాస్ సరే.. హీరోయిన్ మాటేంటి? ఆమె అంత గొప్ప అందగత్తె కాదు.. అంగాంగ ప్రదర్శనా చేయలేదు.. పాత్రలో ఒదిగిపోయింది చాందినీ చౌదరి. ఇక వైవా హర్ష.. అతని బాన పొట్ట.. ఏ మాత్రం కళా కాంతులు లేని మొహం.. కానీ అతనికున్న టైమింగ్ ఏమిటో ‘వైవా’ మొదట్లో చూపిస్తే ‘కలర్ ఫొటో’ ఇప్పుడు చూపించింది. ఇవన్నీ ఒక ఎత్తు.. ఈ సినిమాని ఆకాశమంత ఎత్తులో నిలిపిన డైలాగులు ఇంకో ఎత్తు. సందీప్ రాజ్.. ఎవరీ కుర్రాడు? అసలు నిర్మాత సాయి రాజేష్ ఒక డైరెక్టర్.. అలాంటి సందీప్ రాజ్ లాంటి కుర్రాడికి ఏం చూసి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చాడు? ఇన్ని ప్రశ్నలకు సమాధానం ఒక్క ఆ సినిమానే ఇచ్చేసింది. సందీప్ రాజ్ లో దమ్ము ఎలాంటిదో చూపించింది.
ఆహా ఓటీటీలో విడుదలైన రోజు..
కలర్ ఫొటో సినిమా ఆహాలో విడుదలవుతుంటే ఎలాంటి బజ్ లేదు. సినిమా చూశాక కొందరు ప్ఛ్.. అంటూ పెదవి విరిచారు. దానికి కారణం ఈ సినిమా మీద అంచనాలు లేవు.. స్టార్ డమ్ అంతకన్నా లేదు. కథనం నిదానంగా సాగుతుంటే చేతిలో ఉన్న ఆయుధమే కాబట్టి వేరే సినిమాలోకి జంప్ అయిపోయారు. ఎలా జంప్ అయిపోయార్ తిరిగి అదే జంప్ లో మళ్లీ వెనక్కి వచ్చి ఇప్పుడు సినిమా చూసేస్తున్నారు. చూశాక అందరూ అంటున్నారు.. ‘నిజమే ఇది ఫీల్ గుడ్ మూవీ’ అని. సందీప్ రాజ్ కలం బలం, సుహాస్ సహజమైన నటన.. వెరసి ఇది ఈస్టమన్ కలర్ ఫొటోనే. మంచి సినిమా అనేది మల్లెపూవు లాంటిది.. ఎంత నలిపినా దాని పరిమళాలు ఎక్కడికీ పోవు. అందుకే ఓటీటీలో ఈ మల్లెపూవు గుబాళిస్తూనే ఉంది.
ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే..
అందమైన లోకంలో రంగు రంగులుంటాయని అందరూ అనుకుంటే అది భ్రమే.. భ్రమరంలోని రంగులు కూడా అంతే. బ్లాక్ అండ్ వైట్ నుంచే ఆ రంగులు కూడా పుడుతుంటాయని ఎందరికి తెలుసు. మరి ఈ కలర్ ఫొటోకీ ఆ రంగులకూ ఏమిటి సంబంధమో చూద్దాం. ప్రేమ అనే కథాంశంతో ఎందరో ఎన్నో రకాల ప్రయోగాలు చేశారు. కులమతాల అంతరాలను దాటి కలర్ తో సాగించిన ప్రేమ ప్రయాణం ఈ సినిమా. అందుకే సినిమా చూశాక మనకు లభించేది కించిత్ ఆనందం, మరెంతో ఆర్ద్రత.. మనల్ని వెంటాడే ఆ సన్నివేశాలు.
ఈ సినిమాకి ఆఖరి అరగంటే ఆయువు పట్టు.. ఎన్నో ప్రేమ కథలు వస్తాయి.. కొన్నే మదిలో నిలుస్తాయి. ఎడారిలో నీరు దొరికినంత ఆనందాన్నీ.. తడారిన గొంతులోకి రెండు నీటి చుక్కలు పడితే లభించే అనుభూతినీ ఈ సినిమా ఇస్తుంది. ఆవుదూడ మాంసంతో బిర్యానీ వడ్డించే మనిషిలోని పశుప్రవృత్తిని దర్శకుడు చక్కగా ఆవిష్కరించాడు. ఈ సన్నివేశం కొంత జుగుప్సాకరంగా ఉన్నా కథ డిమాండు అలాంటిది.
మాటలతోనే కలర్ ఫొటో కోట
ఈ సినిమా డైలాగులు విషయంలో దర్శకుడు సందీప్ రాజ్ ఎంత శ్రద్ధ పెట్టాడో అర్థమవుతుంది. ‘ప్రేమించినవారిని అందనంత ఎత్తులో నిలబెట్టడమే నిజమైన ప్రేమ’ అంటాడో సన్నివేశంలో. ఈ ప్రపంచంలో స్వచ్ఛమైన వాటిలో రెండోది అమ్మాయి నవ్వు అయితే మొదటిది ఒకమ్మాయి కన్నీళ్లు అంటాడు. ఇక సముద్రం దగ్గర సన్నివేశం ఒకటి హైలైట్ గా నిలుస్తుంది. ఆడపిల్ల ఇంట్లో ఉన్న మనిషి, సముద్రం గట్టున నిల్చున్న మనిషి ఒకటేనట. ‘సముద్రం వచ్చి చల్లాగా మన కాళ్లు కడుగుతుందని అనుకుంటాం కానీ మనకే తెలియకుండా మన కాళ్ల కింద ఇసుకను లాగేసుకుపోతుంది’ అనే డైలాగులో నిగూఢంగా ఎంత అర్థముందో కదా. మురికి నీళ్లు మన దాహం తీర్చకపోవచ్చు.. కానీ నిప్పును ఆర్పివేస్తాయి అంటాడు ఇంకో చోట.
అలాగే ఇంకో చోట సుహాస్ తో పలికించే డైలాగ్ ‘చీమ ఆయుష్షు పదిహేను సంవత్సరాలు. అలాంటి చీమను మనం వేళ్ల మధ్య పెట్టి నలిపేస్తున్నాం. పక్కోడి ప్రేమ కూడా అంతే. వేళ్ల మధ్య నలుగుతున్న చీమకు తెలుసు ఆ బాధ’.. ఈ డైలాగ్ లో ప్రేమికుడి ఆవేదన ప్రస్ఫుటమవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అల్పమైన పదాలతో అనల్పమైన అర్థాన్ని ఇచ్చే డైలాగులు ఈ సినిమాలో కనిపిస్తాయి. అందరికీ వస్తున్న సందేహం ఒక్కటే ఈ సినిమా థియేటర్లలో రిలీజైతే ఎంత వసూలు చేసి ఉండేదా అని. ఒక్క మాటలో చెప్పాలంటే బ్యాడ్ టైమ్ లో గుడ్ సినిమా ఇది. మొత్తానికి అందరితోనూ ‘ఆహా’ అనిపిస్తోంది.
ఐఎండీబీ టాప్ రేటింగ్
ఐఎండీబీ టాప్ రేటింగ్ తెలుగు సినిమాల జాబితాలో అగ్రతాంబూలం ఇప్పుడు కలర్ ఫోటోకే దక్కింది. పది పాయింట్లకు గాను కలర్ ఫోటోకు 8.6 పాయింట్లు దక్కాయి. మనం పాన్ ఇండియా మూవీ అనుకుంటున్న బాహుబలి 2కు ఐఎండీబీ ఇచ్చిన పాయింట్లు ఎన్నో తెలుసా 8.2. కలర్ ఫొటో తర్వాతి స్థానంలో 1957 నాటి మాయాబజార్ ఉంది. ఆ సినిమా నేటికీ 8.4 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత స్థానంలో కేరాఫ్ కంచరపాలెం ఉంది.
– హేమసుందర్ పామర్తి