(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖలో మీడియాకు శుక్రవారం హితబోధ చేశారు. ఎప్పటిలాగే ఆ రెండు పత్రికల యజమానుల పైన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకరు జర్నలిస్టు కాని యజమాని అని.. మరొకరు జర్నలిస్టు అయినా వాస్తవాలు వక్రీకరించి అడ్డగోలు రాతలు రాస్తారని మండిపడ్డారు. పూర్తిగా తెలిసిన వాళ్లతో మాట్లాడవచ్చని, ఏమీ తెలియని వాళ్ళతో మాట్లాడవచ్చని అయితే.. మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళతో వేగలేమని స్పష్టం చేశారు. పత్రికలు నిర్వహించేవారు నైతిక విలువలు పాటించాలని, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా కథనాలు రాయకూడదని హితబోధ చేశారు. పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
త్వరలోనే భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన..
త్వరలోనే.. అతిత్వరలోనే భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారని వెల్లడించారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విషయంలో పలు పత్రికల్లో తప్పుడు కథనాలు వస్తున్నాయని ప్రజలను పక్కదారి పట్టించడం అత్యంత నీచమైన వ్యవహారమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొత్త భాష్యం చెప్పారు…
మీడియా సమావేశంలో ఎంపీ విలేకరులకు కొత్త భాష్యం చెప్పారు. ఇక మీదట ప్రశ్నలడిగే ముందు అందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని, తెలుసుకొని ప్రిపేరై ప్రశ్నలు అడగాలని సెలవిచ్చారు. వాస్తవాలు తెలుసుకోకుండా, డాక్యుమెంట్లు సమగ్రంగా చదవకుండా ప్రశ్నలు అడగడం సరైన జర్నలిజం కాదని చెప్పుకొచ్చారు. ఇకపై తనను ప్రశ్నలు అడిగే ముందు దానికి సంబంధించిన పూర్తి విషయాలు తెలుసుకుని రావాలని స్పష్టం చేశారు. మీడియా అంటే ఎలా ఉండాలో కూడా వివరించారు.
ఎస్ఈసి టిడిపిలో చేరుతారేమో?
రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరుపైన ఆయన అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు తొత్తులా వ్యవహరిస్తున్నారని విమర్శించారు . నిమ్మగడ్డ రిటైరయ్యాక తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చేరుతామేమో అన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. మొత్తంగా ఆయన సమావేశం అంతా అసంతృప్తిగా, అసహనంగానే పూర్తిచేశారు.
Must Read ;- విజయసాయికి సొంత పార్టీ నేతలే షాక్!











