ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలన్నీ హుజురాబాద్ చుట్టూ తిరుగుతున్నాయి. రోజురోజుకూ ఆసక్తికరమైన విషయాలు చోటుచేసుకుంటున్నాయి. ఎప్పుడో జరుగబోయే ఉప ఎన్నిక కోసం.. ఇప్పట్నుంచే అన్ని పార్టీల నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ నియోజకవర్గవ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ ప్రజాబలం కూడగడుతుంటే.. అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో అధికార పార్టీ తలమునకలవుతోంది. హుజురాబాద్ ప్రజలు ఏ అభ్యర్థి వైపు మొగ్గుచూపుతున్నారో తెలుసుకునేందుకు రహస్యంగా సర్వేలు సైతం చేయిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ బీసీ వర్గానికి చెందిన ప్రముఖ తెలంగాణ ఉద్యమ నేత ఒకరిని అభ్యర్థిగా రంగంలోకి దించే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అయితే ఆ అభ్యర్థికి పార్టీ టికెట్ ఇవ్వడమా? బయటినుంచి మద్దతు ఇవ్వడమా? అన్నదానిపై తర్జనభర్జన నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని టీఆర్ఎస్ ఖరారు చేస్తే.. బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని రంగంలోకి దించాలని కాంగ్రెస్ వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది.
హుజురాబాద్ ఈటలకే మొగ్గు
హుజూరాబాద్ ఉన ఎన్నికలో బీజేపీ నేత ఈటల రాజేందర్ విజయం పక్కా అని కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తేల్చి చెప్పారు. తాను చేయించిన సర్వేలో ఈ విషయం వెల్లడైందన్నారు. ఇక్కడ కాంగ్రెస్కు ఐదు శాతానికి మించి ఓట్లు వచ్చే అవకాశం లేదన్నారు. ఈటలకు 67 శాతం, టీఆర్ఎస్కు 30 శాతం ఓట్లు వస్తాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ తన అభ్యర్థిని ప్రకటించి ప్రచారాన్ని ముమ్మరం చేస్తే కొంత మార్పు వచ్చే అవకాశం ఉందదని కోమటిరెడ్డి అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కాంగ్రెస్ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందన్నారు. నల్గొండ, భువనగిరి లోక్సభ పరిధిలోని అన్ని ఎమ్మెల్యే స్థానాల్లోనూ కాంగ్రెస్ను గెలిపించడమే తన లక్ష్యమని వెంకటరెడ్డి అన్నారు.
కోమటిరెడ్డి బ్రదర్స్ కు మంత్రి వార్నింగ్
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంత్రి జగదీశ్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. రేషన్ కార్డుల పంపిణీలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరినొకరు దూశించుకున్నారు. తనకు సమాచారం ఇవ్వకుండానే మంత్రి ఎలా పర్యటిస్తారని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మంత్రి జగదీశ్ రెడ్డి కాన్వాయ్ ను అడ్డుకున్నారు. ఈ విషయమై మంత్రి స్పందిస్తూ.. ఎక్కువ మాట్లాడితే బట్టలు విప్పుతా, ఇష్టమొచ్చినట్టు మాట్లాడొద్దు అని చెప్పినా వినకుండా.. ఇయ్యాల ఇంకోసారి ఉత్తర కుమారుడి ప్రగల్భాలు పలికారని మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. నియోజకవర్గానికే రాకుండా ప్రొటోకాల్ పేరుతో రాద్ధాంతం చేయడం సరికాదని మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు.
Must Read ;- గులాబీకి ప్లస్!.. బీజేపీ, కాంగ్రెస్ లకు మైనస్!