కోమటిరెడ్డి బ్రదర్స్.. తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో మంచి పట్టున్న నేతలు. మహామహులైన నాయకులను ఓడించి తమ ఉనికిని చాటుకుంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ కు ఆయువుపట్టు ఈ జిల్లానే. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భువనగిరి ఎంపీగా కొనసాగితే.. తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎప్పట్నుంచో బీజేపీ లో చేరుందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. గత సాగర్ ఉప ఎన్నికలో బీజేపీ నుంచి బరిలో దిగేందుకు కూడా ప్రయత్నించారు. ఆ తర్వాత ఏమైందో ఏమో.. మళ్లీ సైలంట్ అయ్యారు. ఇక కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి టీపీసీసీ చీఫ్ ఆశించి భంగపడ్డారు. కాంగ్రెస్ అధిష్ఠానం రేవంత్ రెడ్డి పేరు ప్రకటించడంతో కోపం ప్రదర్శించారు. గాంధీభవన్ బ్రోకర్లకు అడ్డగా మారిందని.. టీపీసీసీ టీటీడీపీగా అవతరించనుందని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్ అవ్వడంతో.. నో పాలిటిక్స్ అన్నారు.
కిషన్ రెడ్డితో భేటీ
తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర పర్యాటక శాఖమంత్రి బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఢిల్లీలో ఆయనను ప్రత్యేకంగా కలుసుకొని అభినందనలు తెలిపారు. తెలంగాణ వారసత్వ సంపదకు ప్రతీకగా నిలిచిన భువనగిరి కోటను అభివృద్ధి చేయాలని, ఇందుకోసం కేంద్రం నుంచి నిధులు మంజురుచేయించాలని కోమటిరెడ్డి ఓ వినతిపత్రం అందించారు.
పీసీసీ చాలా చిన్నది
కిషన్ రెడ్డి భేటీకి ముందు కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి చిన్న పిల్లాడు అయితే.. పీసీసీ పదవి చాలా చిన్నదని అన్నారు. రేవంత్ రెడ్డి గురించి తన వద్ద ఎవరూ ప్రస్తావించవద్దని, తాను రాజకీయాలు మాట్లాడనని ఇటీవలే చెప్పానని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నడిపే సమర్థమంతమైన నాయకుడు లేడని, నాయకులు అందరూ రాజకీయాలు వదిలేసి.. అభివృద్ధి కోసం పనిచేయాలని అన్నారు. ప్రజా సమస్యల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడుతానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. తాను కాంగ్రెస్ పార్టీ వీడేది లేదని స్పష్టం చేశారు. టీపీసీసీ చీఫ్ పదవి దక్కని కోమటిరెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారనేది చర్చనీయాంశంగా మారుతోంది.
Must Read ;- రేవంత్ స్టైల్.. కాంగ్రెస్‌కు టానిక్ ప్లాన్!