కొండను తవ్వి ఎలుకను పట్టడం అంటే ఏమిటో విన్నాం…కొండను తవ్వి ఎలుకను కూడా పట్టకపోవడం అంటే ఏమిటో తెలియాలంటే సోమవారం నిర్వహించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం చెబుతోంది. పార్టీ అధ్యక్ష స్థానం నుంచి తప్పుకుంటానన్న సోనియా… తాను అధ్యక్ష స్థానం చేపట్టేది లేదన్న రాహుల్…గాంధీయేతర కుటుంబం నుంచి కొత్త అధ్యక్షుడు రావాలన్న ప్రియాంక…కాంగ్రెస్‌లో సమూల ప్రక్షాళన జరగాలన్న సీనియర్లు… ఈ నేపథ్యంలో నిర్వహించిన అత్యవసరంగా భేటీ అయిన కాంగ్రెస్ సీడబ్లూసీ సమావేశం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు.
దేశ రాజకీయాలను ఓ మలుపు తిప్పే నిర్ణయాలు కాకపోయినా కనీసం కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు అందించే నిర్ణయం ఏదైనా తీసుకోవచ్చని కూడా అనుకున్నారు. సోనియా గాంధీ కుటుంబానికి చెందని నేతకు కాంగ్రెస్ అధ్యక్షుడిని చేయాలని దేశంలో మెజార్టీ కాంగ్రెస్ వాదులు కోరుకోలేదన్నది వాస్తవం. కానీ ఈ చర్చతో అయినాసరే పార్టీలో సమూల ప్రక్షాళన చేస్తారని… కొత్త రక్తం ఎక్కిస్తారని… యువ నేతలకు కీలక బాధ్యతలు అప్పగిస్తారని సగటు కాంగ్రెస్ వాది ఆశించారు.
కానీ చివరికి ఏమీ తేల్చకుండా చేతులెత్తే ‘సోనియా పాహిమాం ’అనే శరణుజొచ్చారు. పైగా సీనియర్లపై రాహుల్ దురుసు వ్యాఖ్యలు…దానిపై సీనియర్లు గట్టిగా కౌంటర్ ఇవ్వడంతో పార్టీలో తరాల మధ్య అంతరాలు మరోసారి బైటపడటం తప్ప, ఈ సమావేశంతో పార్టీకి ఎలాంటి ఉపయోగం లేకుండాపోయింది. దేశంలో అతి పెద్ద పార్టీ… సుదీర్ఘ చరిత్ర ఉన్న పార్టీ ఇంత క్రియాశూన్యంగా మారిపోవడం రాజకీయ వైచిత్రే.
సోనియా రాజీనామా ఎత్తుగడ
వరుసగా రెండుసార్లు ఎన్నికల్లో ఓటమిపాలవడంతో కాంగ్రెస్ రాజకీయ భవిష్యత్ సందిగ్దంలో పడింది. నరేంద్రమోదీ వంటి కరిష్మా ఉన్న నాయకుడిని రాహుల్ సరితూగరని ప్రజలు తేల్చిచెప్పేశారు. మరోవైపు వయోభారం, అనారోగ్యంతో సోనియా క్రియాశీలంగా లేరు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు పార్టీలో సమూల ప్రక్షాళన చేయాలని 23మంది సీనియర్లు అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. అప్పటికే వర్గపోరుతో మధ్య ప్రదేశ్‌లో అధికారాన్ని కోల్పోవడం… రాజస్థాన్‌లో చావుతప్పి కన్నులొట్టబోవడంతో సోనియా గాంధీ కుటుంబం రాజకీయంగా ఆత్మరక్షణలో పడిపోయింది.
అదే సమయంలో సీనియర్లు ప్రక్షాళన అనే మాట లేవదీసేసరికి సోనియా కుటుంబానికి ఏం చేయాలో పాలుపోలేదు. దాంతో అసంతృప్తులను చల్లార్చడానికి కొత్త ఎత్తుగడ వేశారు. తాను అధ్యక్ష స్థానం నుంచి తప్పుకుంటానని లీకులు ఇచ్చారు. మరోవైపు ఇందిరా గాంధీ కుటుంబానికి చెందని నేత పార్టీ అధ్యక్ష పదవి చేపట్టాలని ప్రియంక గాంధీ వ్యూహాత్మకంగా ప్రకటించారు.
తద్వారా సీడబ్లూసీ భేటీకి ముందే పార్టీలో సోనియా–రాహుల్‌లకు వీరవిధేయులు… పార్టీ ప్రక్షాళన డిమాండ్ చేసిన సీనియర్లకు మధ్య విభేదాలు తెరతీశారు. తద్వారా సీడబ్లూసీ సమావేశంలో ఆ రెండు వర్గాల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుని… తమ నాయకత్వాన్ని ప్రశ్నించకుండా వ్యవహారాన్ని దాటవేయాలన్నది సోనియా కుటుంబ వ్యూహం.
సీడబ్లూసీలో హైడ్రామా…
తల్లీ కొడుకులు సోనియా– రాహుల్ ఆశించినట్టుగానే సీడబ్లూసీ సమావేశానికి ముందే పార్టీలో రెండు వాదాల నేతల మధ్య కస్సుబుస్సులు మొదలయ్యాయి. రాజస్థాన్, పంజాబ్ ముఖ్యమంత్రులతోపాటు సోనియా కుటుంబ కోటరీ పార్టీ సీనియర్లపై విమర్శల దాడి చేసింది. దాంతో రాహుల్ గాంధీ కాస్త అత్యుత్సాహానికి గురై సంయమనం కోల్పోయారు. బీజేపీతో కుమ్మక్కు అయి పార్టీ అధిష్టానానికి లేఖ రాశారా అని సీనియర్లను నిలదీశారు.
పార్టీకి బద్ధులుగా ఉంటూ 30ఏళ్లుగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న తమను అంత మాట అనేసరికి సీనియర్లు గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్ తీవ్రంగా నొచ్చుకున్నారు. బీజేపీతో కుమ్మక్కు అయ్యామనిపిస్తే తమపై చర్య తీసుకోండి అని గులాం నబీ ఆజాద్ నేరుగా సవాల్ చేయగా… తమను అంత మాట అంటారా అని కపిల్ సిబల్ ట్విట్లర్లో పోస్టు చేసి తన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మళ్లీ రాహుల్ సర్ది చెప్పారు. దాంతో అసంతృప్తిని దిగమింగుకుని అంతా గుంభనంగా ఉండిపోయారు.
సోనియా పాహిమాం
సోనియా కుటుంబం గేమ్‌ప్లాన్ వర్క్ ఔట్ అయ్యింది. ఈ వ్యవహారంతో పార్టీ నాయకత్వ మార్పు, పార్టీలో ప్రక్షాళన అన్న అంశాలు పక్కదారిపట్టాయి. ఇన్ని వైరుధ్యాలు ఉన్న పార్టీకి- వేరెవరూ నాయకత్వం వహించలేరనే వాదనకు బలం చేకూరింది. దాంతో సోనియా గాంధీనే పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగాలని సీడబ్లూసీ కోరింది. ఆ తాత్కాలికం అన్నది ఎంతవరకో తెలియదు. వచ్చే ఏడాది నిర్వహించే కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాల వరకూ యథాతథ స్థితి కొనసాగుతుందన్నది సుస్పష్టం. అంతవరకూ పార్టీ ప్రక్షాళన విషయాన్ని ఎవరూ మాట్లడకూడదని చెప్పకనే చెప్పినట్టు అయ్యింది.
ఈ పరిణామం కాంగ్రెస్ వాదులను నిస్పృహకు గురి చేసింది. సోనియా గాంధీ కాకపోతే రాహుల్‌గానీ ప్రియంకగానీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలన్నదే కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల అభిమతం. కానీ తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో అయినా సరే కనీసం పార్టీని ప్రక్షాళన చేసి కొత్త తరానికి కీలక బాధ్యతలు అప్పగిస్తారని ఆశించారు. కానీ ఆ మాత్రం ధైర్యం కూడా చేయలేక చతికిలబడటం సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ బలహీనతను తెలుపుతోంది. దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ రాజకీయంగా ఇంత క్రియాశూన్యంగా మిగిలిపోవడం ప్రజాస్వామ్యానికి మంచి సంకేతం కాదని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. కానీ ఆ ఉద్దేశ్యమే తమకు లేనట్టుగా కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరిస్తుండటం విడ్డూరమే.