అమరావతి రాజధాని రైతులపై రాళ్లు రువ్వి, వారే మాపై రాళ్లు వేశారంటూ మూడు రాజధానుల రైతులు ఎంపీ నందిగం సురేష్ కు ఫిర్యాదు చేయడం వెనుక మరో కుట్రరచన సాగుతోందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరో పది రోజుల్లో అమరావతి ఉద్యమం ఏడాది పూర్తి చేసుకోనుంది.
ఈ సందర్భంగా పెద్ద ఎత్తున తమ ఉద్యమ గళం వినిపించాలని అమరావతి రాజధాని ఐకాస నిర్ణయించింది. ఈ లోగానే రాజధాని రైతుల శిబిరాలు పీకేయించే కుట్ర సాగుతున్నట్టు అనుమానాలు వస్తున్నాయి. నిన్న ఉద్దండరాయునిపాలెంలో జరిగిన ఘటనలే ఇందుకు ఊతం ఇస్తున్నాయి. ప్రధాని మోడీ రాజధానికి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంలో శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న మహిళలపై, మూడు రాజధానులు కావాలంటూ వచ్చి కొందరు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో రాజధాని ప్రాంతం ఒక్కసారిగా హీటెక్కింది. మహిళలపై రాళ్లదాడి చేయడంతో రాజధాని గ్రామాల రైతులంతా అక్కడకు చేరుకున్నారు. దీంతో పోలీసు బలగాలను పెద్ద ఎత్తున దించారు. రాత్రంతా రాజధాని రైతులు రోడ్డపైనే పయనించారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో? అన్న భయాందోళన నెలకొంది.
కుట్ర కోణం ఉందా..
మూడు రాజధానులు కావాలంటూ సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన కొందరు శిబిరం నిర్వహిస్తున్నారు. వారు అమరావతి రైతులు మాపై రాళ్లదాడులు చేశారంటూ నిన్న ఎంపీ నందిగం సురేష్ కు ఫిర్యాదు చేశారు. అయితే జరిగిన విషయం మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఉద్దండరాయునిపాలెంలో అమరావతి రాజధాని ఉద్యమం నిర్వహిస్తోన్న మహిళలపై కొందరు రాళ్లదాడికి పాల్పడ్డారు. అక్కడి రైతులను రెచ్చగొట్టే పనులు చేశారు. బ్యానర్లు పీకేశారు. అమరావతి రైతుల శిబిరాల వైపు- మూడు రాజధానులు కోరుతున్న వారు దూసుకొస్తున్న సమయంలో పోలీసులు అడ్డుకుంటే.. వారిని ఛేదించుకుని మరీ.. వచ్చి రాళ్లు రువ్వి దాడికి పాల్పడ్డారు.
ఒక పక్షం రెచ్చగొట్టి, ఒక తరహా దాడికి తెగబడి రాళ్లు రువ్వినప్పుడు, రెండో పక్షం నామమాత్రంగానైనా దూకుడుగా స్పందించి ఉంటే ఏమై ఉండేది.
అదే కుట్రపూరిత వ్యూహమా?
‘ఏమై ఉండేది’ అనే ప్రశ్నకు సమాధానమే.. కుట్ర ఉన్నదనే అనుమానాలకు బీజం వేసేలా ఉంది. రెండో పక్షం కూడా ఏమాత్రం రెచ్చిపోయినా.. ఈ వ్యవహారాలకు ఘర్షణ అనే ముద్ర వేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆ వెంటనే దానిని ఇరుపక్షాల దీక్షలను ‘శాంతిభద్రతల’ సమస్య కింద బ్లోఅప్ చేసి చూపించడానికి వీలవుతుంది. ఆ వెంటనే ఆ మిష మీద ఇరుపక్షాల దీక్షలకు అనుమతులను రద్దు చేసి శిబిరాలను పూర్తిగా తొలగించేయడం సాధ్యం అవుతుంది.
రాజధాని రైతులు 355 రోజులుగా శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నారు. ఏ మాత్రం హద్దు దాటినా సరే.. నిషేధాజ్ఞలతో అసలు తమ పోరాటగళం వినిపించడానికే అవకాశం ఉండదనే స్పృహతోనే వారు చాలా జాగ్రత్తగా, ఇన్ని నెలలుగా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వారు రెచ్చగొట్టినా శాంతియుతంగానే ఉద్యమం సాగుతుందని అమరావతి జేఏసీ స్పష్టం చేసింది.
365 రోజుకు శిబిరాలు లేకుండా చేస్తారా?
అమరావతి రాజధాని ఉద్యమం ప్రారంభించి 355 రోజులవుతోంది. మరో పది రోజుల్లో సంవత్సరం పూర్తి కానుంది. అమరావతి ఉద్యమానికి సంవత్సరం పూర్తి కానున్న సందర్భంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని రైతులు భావిస్తున్నారు. అయితే అసలు శిబిరాలు లేకుండా చేయాలనే ఆలోచనలో కొందరు ఉన్నట్టు తెలుస్తోంది. శాంతియుతంగా సాగుతున్న ఉద్యమంలో అసాంఘిక శక్తులను చొప్పించి, హింసాత్మకంగా మార్చాలనే కుట్ర జరుగుతున్నట్టు అమరావతి రైతులు అనుమానిస్తున్నారు. ఉద్యమాన్ని హింసాత్మకంగా మార్చాలనే ఉద్దేశంతో మూడు రాజధానులు కావాలంటూ శిబిరం నడుపుతున్నారని రాజధాని రైతులు విమర్శిస్తున్నారు. ఎవరు ఎంత రెచ్చగొట్టినా అమరావతి ఉద్యమం శాంతియుతంగానే జరుగుతుందని రైతులు తేల్చి చెప్పారు. అయితే అమరావతి ఉద్యమాన్ని హింసాత్మకంగా మార్చి శిబిరాలు పీకేసి, ఉద్యమం లేకుండా చేయాలని చూస్తున్న శక్తుల వ్యూహాలు ఫలించడం లేదు. అమరావతి రైతులను ఎంత రెచ్చగొట్టినా వారు శాంతియుతంగా ముందుకు సాగడమే ఇందుకు కారణం.
దళిత వ్యతిరేక ముద్ర వేయడానికా?
అమరావతి రాజధాని ఒక సామాజికవర్గానికి చెందినది అంటూ మొదటి నుంచి వైసీపీ మంత్రులు ప్రచారం చేస్తూ వచ్చారు. రాజధాని గ్రామాల్లో దళితులకు సెంటుభూమి పేరుతో అమరావతి రైతులకు, దళితులకు మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయత్నాలు ఫలించలేదు. తాజాగా కూడా అమరావతికోసం పోరాడుతున్న వారిపై దళిత వ్యతిరేక ముద్ర వేయాలని చూస్తున్నట్లు అర్థమవుతోంది. దళితులపై అమరావతి రాజధాని రైతులు దాడులు చేశారని, మూడురాజధానులకోసం ఉద్యమం చేస్తున్న వారు నందిగం సురేష్ కు వినతిపత్రం కూడా ఇచ్చారు. దీని ద్వారా ఆ సామాజికవర్గానికి, దళితులను దూరం చేసే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇలాంటి ఫిర్యాదులు అన్నీ కూడా శాంతి భద్రతల సమస్యగా ప్రొజెక్ట్ చేయడానికి సన్నాహాల్లో భాగమే అనే వాదన వినిపిస్తోంది.
అయితే రాష్ట్రంలో ఓ వైపు దళితులపై అనేక దాడులు చేస్తూ, అమరావతిలో ఆ సామాజికవర్గం దళితులపై దాడులు చేస్తోందని ప్రచారం నిర్వహిస్తే జనం నమ్మడానికి సిద్దంగా లేరని అమరావతి జేఏసీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అనేక దశాబ్దాలుగా అమరావతి రాజధాని గ్రామాల్లో అన్ని కులాల వారూ కలిసే ఉంటున్నామని, ఎలాంటి గొడవలు లేవని రైతులు చెబుతున్నారు. కావాలనే కొందరు రాళ్లదాడికి పాల్పడ్డారని, అయినా అమరావతి రైతులు శాంతియుతంగానే ఉన్నారని తెలిపారు. ఆ సామాజికవర్గం దళితులపై దాడులకు పాల్పడుతోందని ప్రచారం చేసుకోవాలనే కుట్రతోనే ఇలా చేస్తున్నారని అమరావతి జేఏసీ అనుమానం వ్యక్తం చేసింది. ఏది ఏమైనా అమరావతి రాజధాని ఉద్యమాన్ని కుట్రలతో అణచివేయడానికి అనేక బలమైన శక్తులే పనిచేస్తున్నట్టు తెలుస్తోంది.
Also Read: పోలీసుల పక్షపాతం.. 350వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఉద్యమం