పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు టైటిల్ సాంగ్ రాసినందుకు ఆనంద పడాలో, సాహిత్యంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేసినందుకు బాధ పడాలో అర్థం కాని స్థితిలో భీమ్లా నాయక్ పాట రచయిత రామజోగయ్య శాస్త్రి ఉన్నారు. ఒక్క రోజులోనే 10 మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టిన పాట వివాదంలో చిక్కుకుంది.
‘ఆడాకాదు ఈడాకాదు…అమిరోళ్ళ మేడ కాదు.. గుర్రంనీల్ల గుట్టకాడ.. బొమ్మాజెముడు చెట్టున్నాది.. బొమ్మాజెముడు చెట్టు కింద అమ్మ నొప్పులుపడుతున్నాది. . ఎండలేదు.. రాత్రి కాదు ఏగు సుక్క పొడవంగానే పుట్టిందాడ పులిపిల్ల పుట్టిందాడ పులిపిల్ల. నల్లమల తాలుకాల .. అమ్మపేరు మీరాభాయి.. నాయన పేరు సోమలగండు.. నాయన పేరు సోమలగండు తాత పేరు బహదూరు. ముద్దుల తాత ఈర్య్యా నాయక్ పెట్టిన పేరు భీమ్లా నాయక్’ అంటూ ఈ పాట సాగిపోయింది. యూట్యూబ్ లో ఇప్పుడు ట్రెండింగులో ఉన్న పాట ఇది. జానపద గాయకుడు, కిన్నెరమెట్ల వాయిద్య కారుడు దర్శనం మొగలయ్య దీని సాకీ ఆలపించారు.
మరో గాయకుడు రామ్ మిరియాల కూడా గళం కలిపారు. కాకపోతే తెలంగాణ పోలీసులకు ఈ పాట మీద కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ,ఐపీఎస్ రమేశ్ ఈ పాట సాహిత్యంలో తనకున్న అభ్యంతరాలు ఏమిటో ట్విట్టర్ ద్వారా తెలిపారు. తెలంగాణ పోలీసులు ప్రజలతో స్నేహపూరితంగా ఉంటారని, ప్రజల రక్షణ కోసం జీతాలు తీసుకునే తాము వారి బొమికలను ఎలా విరగ్గొట్టబోమని అన్నారు. రచయితకు ఇంతకుమించిన పదాలు దొరకలేదా అని ప్రశ్నించారు. పోలీసులు చేసే సేవ రచయితకు కనిపించకపోవడం శోచనీయమన్నారు.
‘చెమడాలొలిచే లెక్క కొట్టాడంటే పక్కా విరుగును బొక్క, ఎవ్వడైనా ఈడి ముందు గడ్డిపోస.. ఎర్రి గంతులేస్తే ఇరిగిపోద్ది ఎన్నుపూస, కుమ్మడంలో వీడు ఒక బ్రాండు తెల్సా.. వీడి దెబ్బతిన్న ప్రతివాడు పాస్టు టెన్సా’.. ఇలా సాగిపోయింది పాట. భీమ్లా నాయక్ వీరత్వం తెలపాలన్నది రచయిత ఉద్ధేశం. పోలీసులంటే బొమికలు విరగ్గొట్టేవారే కాదు కదా.. తాము సేవ కూడా చేస్తున్నాము కదా అన్నది పోలీసుల ఉద్ధేశం. వివాదం మాట ఎలా ఉన్నా దీనివల్ల పాటకు మరింత క్రేజ్ పెరిగింది. ఇందులో రచయిత రామజోగయ్య శాస్త్రి ఈర్యా నాయక్ అనే పేరు వాడారు.
అది వరంగల్ నిట్ లో చదువుకునేటప్పుడు తన బ్యాచ్ మేట్ ఈర్యా నాయక్ పేరట, ఈ పాట వినగానే ఈర్యా నాయక్ ఎంతో సంతోషం వ్యక్తం చేశాడట. ఈ విషయాన్ని రామజోగయ్యశాస్త్రి ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. అంతరించిపోతున్న కిన్నెరమెట్ల వాయిద్య కళకు వెండితెరపైకి తీసుకురావాలన్న పవన్ ఆలోచనను అందరూ మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా జానపద కళాకారులకు పవన్ తన సినిమాల ద్వారా ప్రోత్సహిస్తున్నారు. గతంలో మాస్టర్జీని ప్రోత్సహించి జానీలో ఓ పాట రాయించారు. ఇప్పుడు ఓ కళాకారుడిని ప్రోత్సహించారు.
Must Read ;- తమిళ అసెంబ్లీలో పవన్.. తెలుగు మాట కూడా