‘కిల్ రాజు’ ఇదేదో సినిమా టైటిల్ అనుకుంటే పొరపాటే. ఈ మధ్య తెగ వైరల్ అయిన పేరిది. ఎందుకిలా జరిగింది? అసలేం జరుగుతోంది? అనేది తెలియాలంటే సినిమా థియేటర్ల దాకా వెళ్లాల్సిందే. సినిమా థియేటర్ అనే వ్యవస్థ పరిస్థితి ఇప్పుడు అడకత్తెరలో పోకచెక్క మాదిరి తయారైంది. ఓ పక్క సినీ పెద్దల గుత్తాధిపత్యం, మరో పక్క ఓటీటీ, ఇంకో పక్క షాపింగ్ కాంప్లెక్సులు, కళ్యాణ మండపాలుగా మారిపోతున్న థియేటర్ల వ్యవస్థ.. ఇవన్నీ కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నాయి.
ఒక్క సారిగా నాలుగైదు సినిమాలు విడుదలైతే పరిస్థితి ఎలా ఉంటుందో ఈ సంక్రాంతికి చూశాం. థియేటర్లు ప్రారంభమవబోతున్నాయని తెలియగానే కర్చీఫ్ లు వేయడం ప్రారంభమై పోయింది. ఒకప్పుడు సినిమా థియేటర్లలో కర్చీఫ్ లు వేసే వ్యవస్థ ఉండేది. ఇప్పుడా వ్యవస్థ సినిమా పెద్దలకు పాకింది. ఇది మరింత ముదిరి పాకాన పడింది. ఈ సంక్రాంతికి రవితేజ క్రాక్ మొదటగా విడుదలైంది. ఆ తర్వాత మాస్టర్, రెడ్, అల్లుడు అదుర్స్ విడుదలయ్యాయి. క్రాక్ సినిమా నైజాం పంపిణీదారుడు వరంగల్ శ్రీను తన సినిమాకు సరైన థియేటర్లు లభించలేదని ఆక్రోశం వెళ్లగక్కారు. దిల్ రాజును ‘కిల్ రాజు’ అని సంబోధిస్తూ ప్రెస్ మీట్ పెట్టారు.
థియేటర్ల విషయంలో దిల్ రాజు, శిరీష్ లు తన సినిమాను దెబ్బతీశారని ఆరోపించారు. క్రాక్ నిర్మాత ఠాగూర్ మధు కూడా నిర్మాతల మండలిలో దిల్ రాజు బృందంపై ఫిర్యాదులు చేసే దాకా పరిస్థితి వెళ్లింది. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు నిర్మాతల మండలి రంగంలోకి దిగి రాజీ యత్నాలు చేసింది. వరంగల్ శ్రీను వెనక మరికొందరు సినీ పెద్దలు ఉన్నారన్న మాటలు కూడా వినిపించాయి. దీంతో నిర్మాతల మండలి అత్యవసరంగా సమావేశమై దీన్ని పరిష్కరించగలిగింది. కాగల కార్యాన్ని గంధర్వుడే తీర్చాడన్నట్టు క్రాక్ తప్ప మిగతా సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడటంతో క్రాక్ కు థియేటర్లు లభించాయి. క్రాక్ కు ఎక్కువ థియేటర్లు కేటాయించడానికి కూడా కౌన్సిల్ తన వంతు ప్రయత్నం చేసింది.
నిర్మాతల మండలి సమావేశంలో అల్లు అరవింద్, సురేష్ బాబు పాల్గొన్నట్లు తెలిసింది. ఇకముందు ఇలాంటి పరిస్థితి ఏర్పడితే సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలన్న నిర్ణయానికి వచ్చారు. సునీల్, సుధాకర్ రెడ్డి ల కోఆర్డినేషన్ లో ఈ సమస్యను పరిష్కరించడానికి నిర్ణయం జరిగింది. అయితే ఈ సమస్య ఇక్కడితో సమసిపోయేది కాదు. ప్రతి సినిమా విడుదలకూ ఓ సీజన్ ఉంటుంది. అదే సమయంలో పెద్ద సినిమాలన్నీ ఒకేసారి విడుదలవుతాయి. వాటి కోసం థియేటర్లపై ముందుగానే కర్చీఫ్ లు వేసేస్తుంటారు. మళ్లీ ఈ వేసవిలో కూడా అలాంటి పరిస్థితే రాబోతోంది. ఇదే సమస్య మళ్లీ పునరావృతం కావడానికే అవకాశం ఎక్కువ ఉంది.
Must Read ;- క్రాక్& కోసం ఉత్సాహం చూపుతున్న థియేటర్లు
ఆ నలుగురిలో అంతర్యుద్దం
ఎగ్జిబిట్లర్ల వ్యవస్థ ముఖ్యంగా నలుగురి చేతిలోనే ఉందన్నది జగమెరిగిన సత్యం. దిల్ రాజు, అల్లు అరవింద్, ఏషియన్ ఫిలింస్ సునీల్, సురేష్ బాబుల కంట్రోల్ లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ థియేటర్లు ఉన్నాయి. ప్రస్తుతం వీరి మాధ్య కూడా సంబంధాలు అంతగా లేవనేది ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఒక సినిమా అనేది విడుదల కావాలంటే థియేటరే కీలకం. ఈ అంశాన్ని గ్రహించబట్టే ఈ నలుగురూ థియేటర్లను తమ చేతుల్లోకి తీసుకుని నిర్మాతలను శాసిస్తున్నారు.
ఈ థియేటర్ల వ్యవస్థను పర్యవేక్షించడంలోనూ కొన్ని లొసుగులు ఉన్నాయి. సరైన అజమాయిషీ లేని కారణంగా సిబ్బింది వేరే వారితో కుమ్మక్కు అవుతున్న విషయం పెద్దల దృష్టికి వెళ్లింది. ముఖ్యంగా సురేష్ బాబు లాంటి నిర్మాతలు దీన్ని పసిగట్టి దిద్దుబాటు చర్యలకు దిగినట్టు సమాచారం. నిర్మాతల మండలికి పోటీగా దిల్ రాజు గిల్డ్ పేరుతో మరో ప్రత్యామ్నాయ వ్యవస్థను కూడా నిర్మించుకోగలిగారు. ఈ రెండు వ్యవస్థల మధ్య కూడా సమన్వయం కొరవడింది. ఈ థియేటర్ల వ్యవహారంలో దిల్ రాజు ఇమేజ్ కు కొంత డామేజ్ జరిగింది.
ఓటీటీల ఫలితం ఏమిటి?
ఓటీటీ వ్యవస్థ వల్ల భవిష్యత్తులో థియేటర్ల వ్యవస్థ మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్న ఆలోచనతో చాలావరకు థియేటర్లు తగ్గిపోయాయి. చాలా థియేటర్లు షాపింగ్ కాంప్లెక్స్ లుగా, కళ్యాణ మండపాలుగా మారిపోయాయి. దాంతో థియేటర్ల సంఖ్య క్రమేపీ తగ్గిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ సినిమాలు రిలీజైతే థియేటర్లు దొరక్క ఇబ్బంది పడే నిర్మాతలు చాలామందే ఉన్నారు. లాక్ డౌన్ సమయంలో థియేటర్లు లేక ఓటీటీలో విడుదలైన సినిమాలను మళ్లీ థియేటర్లలో విడుదల చేయానుకోవడం వల్ల మొదట్లో కొంత సమస్య కూడా ఏర్పడింది.
ముఖ్యంగా ఇలాంటి సినిమాలను ప్రదర్శించడానికి మల్టీ ప్లెక్స్ లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సినిమాలు థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల చేయడం సరికాదని పీవీఆర్ సంస్థ అభిప్రాయపడుతోంది. ఇకముందు కూడా థియేటర్లలో విడుదలైన తర్వాతే ఓటీటీ విడుదలకు వెళ్లడం ఉత్తమ మనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. మొత్తం మీద కిల్ రాజుల వ్యవస్థకు చరమగీతం పాడాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది.
– హేమసుందర్ పామర్తి
Also Read ;- సమస్యలపై దృష్టి సారించిన తెలుగు నిర్మాతల మండలి