Controversy Of Priyamani Marriage Life :
నారప్ప సుందరమ్మకు ఎంత కష్టమొచ్చింది? ముస్తఫాతో ముగ్గులోకి దిగినందుకు ప్రియమణి పేరు అందరి నోళ్లలోనూ నానుతోంది. సినిమా తారలు పెళ్లయిన వ్యక్తులను చేసుకోవడం షరామమూలే. ప్రియమణి విషయంలోనూ అదే జరిగింది. ముస్తఫా రాజ్ తో కలిసి జీవిస్తోంది. భార్యకు విడాకులు ఇవ్వకుండా ఇంకొకరితో కలిసి జీవించడం చట్టరీత్యా నేరం. ప్రియమణితో ముస్తఫాకు పెళ్లికాక ముందే అతనికి ఓ భార్య కూడా ఉంది. ఆమె పేరు అయేషా. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
ఇద్దరి మధ్యా పొసగక పోవడంతో ఇద్దరూ విడివిడిగా బతుకుతున్నారు. దాదాపు 2010 నుంచి ఇదే పరిస్థితి. పేర్లు ముస్తఫా, అయేషా కాబట్టి వీరికి తేలికగానే విడాకులు వచ్చేస్తాయి. కానీ ముస్తఫా ఎందుకో ఆ పనిచేయలేదు. 2017లో ప్రియమణిని పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యకు ప్రతి నెలా డబ్బు పంపిస్తున్నాడు కూడా. ఇప్పుడు అయేషా మీడియా ముందుకు రావడంతో ప్రియమణికి మింగుడు పడటం లేదు. తనపై వచ్చిన ఆరోపణలను ముస్తఫా కూడా ఖండిస్తున్నాడు.
తన మొదటి భార్యకు అవసరమైన డబ్బును క్రమం తప్పకుండా పంపిస్తున్నానని, తన దగ్గరున్న డబ్బును కాజేయడానికి ఆమె ఇలా నాటకమాడుతోందని అతను అంటున్నాడు. ముస్తఫా తనను హింసించాడని, తనకు భరణంగా ఏమీ ఇవ్వలేదన్నది అయేషా ఆరోపణ. తాను హింసిస్తే ఇంతకాలం ఈ విషయాన్ని ఎందుకు బయటపెట్టలేదని ముస్తఫా అంటున్నాడు. అసలు ముస్తఫా తనకు మాజీ భర్త కాదని, ఇప్పటికే అతను భర్తేనని కూడా అయేషా అంటోంది. తాము విడాకుల కోసం ఇంతవరకు ప్రయత్నించలేదని చెబుతోంది.
ఈ విషయం ఇంతలా రచ్చ కావడంతో ప్రియమణికి ఏమీ పాలుపోవడం లేదు. తనకు సంబంధించిన వ్యవహారం కాదు కాబట్టి ఆమె మౌనంగానే ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆమె సినిమాలతో బిజీగా ఉంది. రెండ్రోజుల క్రితమే నారప్ప విడుదలైంది. అంతకుముందు ఫ్యామిలీమ్యాన్ 2 వెబ్ సిరీస్ విడుదలైంది. దాదాపు ఐదారు భాషల్లో ఆమె నటించింది. తన పెళ్లి వ్యవహారం ఇలా మీడియాకు ఎక్కడంతో ఆమెకు ఏమీ పాలుపోవడం లేదు.