సినిమా కథలు, కాపీ బాగోతాలు ఇప్పుడు తెలుగు సినిమా రంగంలో హాట్ టాపిక్. కాపీ అనే మాట నిజానికి ఇవ్వాల్టిది కాదు. ఎన్నోకాపీ కథలతో ఎన్నో సినిమాలు రూపొందాయి. కొన్ని మాత్రమే గొడవలకు కారణమయ్యాయి. తెలుగు సినిమా రంగంలో అగ్రదర్శకులు అనుకుంటున్న వారందరిపై ఇలాంటి ఆరోపణలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. దర్శకరత్న దాసరి నారాయణరావు నుంచి నేటి అగ్రదర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి వరకు ఎవరూ ఇందుకు మినహాయింపు కాదు. ఆరోపణలు వచ్చినపుడు వారు దిగివచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కథ బాగా నచ్చినపుడు, మరో మార్గాంతరం లేనపుడు కూడా ఈ చౌర్యానికి పాల్పడుతూ ఉండి ఉండవచ్చు.
దాసరి విషయానికి వస్తే…
ప్రముఖ దర్శకుడు స్వర్గీయ దాసరి నారాయణ రావు సినిమాల మీద కూడా కాపీ ఆరోపణలు వచ్చాయి . అప్పుడు దాసరి ఎలా ప్రతిస్పిందించారో ఇప్పుడు ఒకసారి గుర్తు చేసుకుందాం. దాసరి స్వయంగా రచయిత అయినా కొన్ని సార్లు వేరే వాళ్ళ కథలు తీసుకుని సినిమాలు చేశారు. అందులో రీమేక్స్ కూడా ఉన్నాయి. శోభన్ బాబు హీరోగా ‘ గోరింటాకు ‘ సినిమా తీశారు దాసరి. ఆ సినిమా కి రచయిత్రి కె. రామలక్ష్మి కథ ఇచ్చారు .
అయితే ఆ కథ తన నవల ఆధారంగా తీశారని మరో ప్రముఖ రచయిత్రి రంగనాయకమ్మ కోర్టులో కేసు వేశారు. దాసరి ఈ సందర్భంలో మౌనంగానే ఉన్నారు. కోర్ట్ తీర్పు రంగనాయకమ్మ కి అనుకూలంగా వచ్చింది. ఫైన్ కూడా కట్టకతప్పలేదు దాసరికి. అయితే సినిమాలో మాత్రం రామలక్ష్మి ఆరుద్ర పేరే ఉంటుంది . ఆ తర్వాత దాసరి అధిక శాతం తన కథలతోనో, లేదంటే తాను రాయించుకున్న స్క్రిప్ట్స్ తోనో సినిమాలు తీశారు.
రాజమౌళి మాటేంటి?
రాజమౌళి ‘ సింహాద్రి’ మీద కూడా ఈ తరహా ముద్రపడింది. ఎస్.ఎస్ . రాజమౌళి కెరీర్ ‘ సింహాద్రి’ సినిమా నుంచే మలుపు తిరిగింది. ఆ సినిమా కథ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ది అని చాలా మందికి తెలుసు. రాజమౌళి మొదటి సినిమా ‘ స్టూడెంట్ నెంబర్1 ‘ కి కథ రాసింది పృథ్వి అనే రచయిత.‘సింహాద్రి’ సినిమా నుంచే తండ్రీ కొడుకుల సక్సెసఫుల్ కాంబినేషన్ మొదలైంది. అయితే ‘ సింహాద్రి ‘ కథ కూడా కాపీ అని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి .
జి.ఎస్. రావు అనే రచయిత ‘ సింహాద్రి’ కథ తనదని, తాను ఓ ప్రముఖ నిర్మాత కి కథ చెబితే అక్కడి నుంచి లీక్ అయి ‘ సింహాద్రి’ గా మారిందని గొడవ చేశాడు. తగిన ఆధారాలు ఉండటంతో వీరు దిగి రాక తప్పలేదు. సినిమా టైటిల్స్ లో థాంక్స్ కార్డు వేసి, డబ్బులు కూడా ఇచ్చి సెటిల్ చేసుకున్నారు. అదే రచయిత జి.ఎస్. రావు కథతో ఎన్. టి. రామారావు ‘ సాంబ ‘ సినిమా చేశారు. తర్వాత రావు డైరెక్టర్ గా మారి ఓ సినిమా కూడా చేశాడు. అది కాపీ కథా, ఇంకోటా అనే విషయాన్ని పక్కన పెడితే ఆరోపణలు మాత్రం సర్వసాధారణమై పోయాయి. ఒక్కోసారి అసలు రచయితకు న్యాయం జరగకపోవచ్చు.