దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. నిన్న ఒక్క రోజే దేశంలో 2 లక్షల 97వేల కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో 17 రాష్ట్రాల్లో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. మహారాష్ట్ర, గోవా, ఢిల్లీ, కర్ణాటక, గుజరాత్, ఝార్జండ్ రాష్ట్రాల్లో రోజుకు 20వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. మరో 11 రాష్ట్రాల్లో రోజుకు 10 వేలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఆసుపత్రుల్లో ఆక్సిజన్ లేక వందలాది మంది రోగులు ప్రాణాలు విడుస్తున్నారు. ఓ వైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందక కొందరు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ప్రయివేటు ఆసుపత్రుల దోపిడీతో రోగుల కుటుంబ సభ్యులు బెంబేలెత్తుతున్నారు. ఇక రెమిడిసీవర్ సూది మందు రూ.2500కు అమ్మాల్సి ఉండగా రూ.25 వేల నుంచి 40 వేల దాకా వసూలు చేస్తున్నారు. ఓవైపు వైద్యం అందక రోగులు యాతనపడుతుంటే మెడికల్ మాఫియా ఇదే అదునుగా చెలరేగిపోతోంది.
ఏపీలో కోరలు చాస్తున్న కోవిడ్
ఏపీలో కరోనా తీవ్ర రూపం దాల్చింది. నిన్న ఒక్క రోజే 9700పైగా కేసులు నమోదయ్యాయి. 27 మంది మాత్రమే కరోనా బారినపడి చనిపోయారని ప్రభుత్వం చెబుతున్నా, స్మశానాల వద్ద మాత్రం శవాల గుట్టలు పేరుకుపోతున్నాయి. గుంటూరు నగరంలో బొంగరాలబీడు స్మశానవాటికకు సాధారణ రోజుల్లో రోజుకు 2 నుంచి 3 శవాలు మాత్రమే వచ్చేవి. గత వారం రోజులుగా అక్కడ ప్రతి రోజూ 40 శవాలు తగ్గకుండా వస్తున్నాయి. ఈ ఒక్క స్మశాన వాటికలోనే గడచిన వారం రోజుల్లో 280మందికి దహన సంస్కారాలు పూర్తి చేశారు. 24 గంటలు పాడెలు కాలుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఏపీలో శ్రీకాకుళం, చిత్తూరు, గుంటూరు, విశాఖ, నెల్లూరు జిల్లాల్లో రోజుకు ప్రతి జిల్లాలో వెయ్యికి పైగా కేసులు నమోదువుతున్నాయి. నెల్లూరు జిల్లాలో నిన్న 5 వేల శాంపిళ్లు పరీక్షించగా 24 శాతం మందికి కరోనా పాజిటివ్ నిర్థరణ అయింది. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివిటీ రేటు 16 శాతంగా ఉండగా ఏపీలో మాత్రం 24 శాతం ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
స్వచ్ఛందంగా మూసుకుంటున్న వ్యాపారులు
ఏపీలో ఎక్కడికక్కడే అధికారులు నిర్ణయాలు తీసుకుంటూ వ్యాపార, వాణిజ్య దుకాణాల సమయాలను కుదించారు. విజయవాడలో సాయంత్రం 6 గంటలకే షాపులన్నీ మూసివేయాలని కలెక్టర్ ఆదేశించారు. అయితే సగానికిపైగా దుకాణాలు అసలు తెరవడం లేదు. వ్యాపారులు ఎక్కువగా కరోనా భారినపడటంతో వారు దుకాణాలు తెరిచేందుకు భయపడుతున్నారు. దీంతో విజయవాడ నగరం బోసిపోయింది. ఇక గుంటూరు నగరంలో కరోనా తీవ్రంగా ఉంది. ఒక్క గుంటూరు నగరంలోనే నిన్న 300 కరోనా కేసులు నమోదయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా టెస్టులు పెద్ద ఎత్తున చేయాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. కరోనా లక్షణాలు ఉన్న వారి నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షిస్తే పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్ కేసులు బయటపడే అవకాశం ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఏపీలో మాత్రం కరోనా టెస్టులు సంఖ్యను పెంచడం లేదు. దీనిపై అనేక విమర్శలు వస్తున్నాయి.
లాక్ డౌన్‌లో పలు రాష్ట్రాలు
మహారాష్ట్రలో ఇప్పటికే రెండు వారాల లాక్ డౌన్ కొనసాగుతోంది. తాజాగా గోవా, ఝార్జండ్ రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఇక అనేక నగరాల్లో రాత్రి కర్ఫ్యూ కొనసాగుతోంది. ఢిల్లీ, గాంధీనగర్, అహ్మదాబాద్, హైదరాబాద్, చెన్నై నగరాల్లో రాత్రి కర్ఫ్యూ విధించారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నా కరోనా వ్యాప్తి వేగం ఏ మాత్రం తగ్గడం లేదు. ఇదే పరిస్థితి మరో ఆరు వారాలు కొనసాగే అవకాశం ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అప్పటిదాకా కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఒవైపు కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటూనే టీకా వేసే కార్యక్రమం కూడా వేగవంతం చేశారు. ఇప్పటికే దేశంలో 12కోట్ల 30 లక్షల మందికి కరోనా టీకాలు వేశారు. ప్రతి రోజూ దేశ వ్యాప్తంగా 30 లక్షల టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇలా నెలకు 9 కోట్ల మందికి టీకాలు వేయడం ద్వారా కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
అందని ఆక్సిజన్
దేశంలో ఆక్సిజన్ కొరత పీడిస్తోంది. ఇప్పటికే ఆక్సిజన్ తయారు చేసే కంపెనీలు 24 గంటలూ ఉత్పత్తి చేస్తున్నాయి. అయినా ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసీయూల్లో ఆక్సిజన్ అందక వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో గడచిన మూడు రోజుల్లోనే 220 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చాలా మందికి ఆక్సిజన్ అందకపోవడం వల్లే చనిపోయారని తెలుస్తోంది. ఇక ప్రైవేటు ఆసుపత్రుల్లో ఒక్కో కరోనా రోగి వైద్యానికి రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల దాకా వసూలు చేస్తున్నారు. ఇక వైద్యులు సూచించే రెమీడిసీవర్ దొరక్క రోగుల బంధువులు మెడికల్ డీలర్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. విజయవాడలో హెటిరో డీలర్ కార్యాలయం వద్ద ప్రతి రోజూ 200 మంది రోగుల బంధువులు రెమిడిసీవర్ మందు కోసం పడిగాపులు పడుతున్నారు.
బెంగాల్‌లో మూడో దశ కరోనా స్ట్రెయిన్
దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుండగా పశ్చిమబెంగాల్లో మూడో దశ కరోనా కేసులను గుర్తించారు. రెండో దశలోనే కరోనా వేలాది మందిని పొట్టనబెట్టుకుంటోంది. ఇక దేశ వ్యాప్తంగా థర్డ్ వేవ్ ప్రారంభం అయితే అది మరింత తీవ్రంగా ఉండే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Must Read ;- ఏచూరికి పుత్ర వియోగం : కరోనాతో పెద్ద కమారుడు మృతి











