కరోనా సెకండ్ వేవ్ వేగానికి బ్రేకులు పడ్డాయి. గత వారం సగటున రోజుకు 4 లక్షలకుపైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా నిన్న మాత్రం 3.29 లక్షలు మాత్రమే నమోదయ్యాయి. ఇక కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3.59 లక్షలుగా ఉంది.అంటే కరోనా సోకిన వారికంటే కోలుకున్న వారి సంఖ్య 30 వేలు అధికంగా ఉంది. కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైన తరవాత కరోనా భారిన పడిన వారికంటే కోలుకున్న వారి సంఖ్య అధికంగా నమోదు కావడం ఇదే మొదటి సారి. ఇక దేశంలో ఇప్పటికీ 37 లక్షల కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే కరోనా సెకండ్ వేవ్ ఉదృతి తగ్గుతోందనడానికి ఇది సంకేతంగా చెబుతున్నారు. ఇలా కరోనా కేసులు తగ్గుతూ వస్తే మూడు వారాల్లో కరోనా కేసులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.18 రాష్ట్రాల్లో కరోనా వేగం తగ్గింది. గతంలో కన్నా తక్కువ కేసులు నమోదవుతున్నాయి.ఇక పాజిటివిటీ రేటు కూడా తగ్గింది. గత వారం సగటున 20.45 ఉండగా, గడచిన రెండు రోజుల్లో అది 17.85 శాతానికి తగ్గింది.దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గడంతోపాటు పాజిటివిటీ రేటుకూడా క్రమంగా తగ్గుతూ రావడం కొంత ఊరట నిస్తోంది.
కర్నాటకలో కల్లోలం
కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైనప్పటి నుంచి కరోనా కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలిచింది.అక్కడ గరిష్ఠంగా రోజుకు 67 వేల కోవిడ్ కేసులు కూడా నమోదయ్యాయి.అప్రమత్తమైన మహా సర్కార్ వెంటనే లాక్ డౌన్ విధించింది. దేశంలో మొదటి సారిగా సెకండ్ వేవ్ ను అడ్డుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం వేసిన లాక్ డౌన్ చక్కగా పనిచేసిందనే చెప్పాలి.ఇప్పుడు అక్కడ రోజుకు 37వేల కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. ఇక కర్నాటకలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. మహారాష్ట్రను మించి పోయింది.నిన్న ఒక్క రోజే కర్నాటకలో 42 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క బెంగుళూరులోనే సగటున రోజుకు 17 వేల కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో కర్నాటక సర్కారు కూడా లాక్ డౌన్ ప్రకటించింది.కరోనా కట్టడికి బెంగళూరలో వార్ రూమ్ ఏర్పాటు చేశారు. ఏ ఆసుపత్రిలో ఎన్ని బెడ్లు ఉన్నాయి, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అనే వివరాలతో డాష్ బోర్డు ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రంగా కర్నాటక నిలిచందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రకటించారు.
టీకాల ప్రక్రియ వేగవంతం
దేశంలో ఇప్పటికే 17.5 కోట్ల మందికి టీకాలు వేశారు. ఇంకా 90 లక్షల టీకాలు ఆయా రాష్ట్రాల వద్ద ఉన్నాయని, రాబోయే మూడు రోజుల్లో మరో 7 లక్షల టీకాలు పంపిణీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే దేశంలో రెండు కంపెనీలు కరోనా టీకాలు తయారు చేస్తున్నాయి.అదే టీకాలను మరికొన్ని కంపెనీల్లో కూడా ఉత్పత్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రస్తుతం సీరం ఇనిస్టిట్యూట్, భారత్ బయోటెక్ కంపెనీలు నెలకు 7 కోట్ల టీకాలు ఉత్పత్తి చేస్తున్నాయి. కేవలం ఈ రెండు కంపెనీలపైనే ఆధారపడితే దేశంలో అందరికీ టీకాలు వేయడానికి మూడు సంవత్సరాల కాలం పట్టే అవకాశం ఉంది. అందుకే మరికొన్ని టీకాల ఉత్పత్తికి అనుమతి ఇవ్వడంతోపాటు, దేశీయంగా మరికొన్ని కంపెనీల్లో కోవాగ్జిన్,కోవీషీల్డ్ ఉత్పత్తి చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది.
సగం కేసులు 6 రాష్ట్రాల్లోనే
దేశంలో సగం కరోనా కేసులు కేవలం ఆరు రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కర్నాటక, తెలంగాణ, ఏపీ, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లోనే రోజుకు లక్షకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దాదాపు 16 రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి.మరో 8 రాష్ట్రాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. ఒక వైపు కరోనా టీకాలు వేసే కార్యక్రమం వేగవంతం చేస్తూనే, సెకండ్ వేవ్ వేగాన్ని అందుపులోకి తీసుకువస్తే నెల రోజుల్లో పరిస్థితులు చక్కబడవచ్చని అంచనా వేస్తున్నారు.ఇక ఉత్తరాది రాష్ట్రాల్లోనూ కరోనా కల్లోలం రేపుతోంది. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లో సగటున రోజుకు లక్ష కేసులు నమోదవుతున్నాయి.ఆయా రాష్ట్రాలు ఇప్పటికే లాక్ డౌన్ వేశాయి.ఇక కరోనాతో చనిపోయిన వారి శవాలతో గంగానది కలుషితం అవుతోంది. యూపీలో గంగా నదిలో పడేసిన కరోనా శవాలు బీహారు, బెంగాల్ కు కొట్టుకు వచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఆక్సిజన్ సరఫరా మెరుగవుతోందా?
కరోనా రోగులకు ఆక్సిజన్ సరఫరాలో అంతరాయాలు తప్పడం లేదు.తిరుపతి రుయా ఘటన మరువక ముందే గోవా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక గంట వ్యవధిలోనే 26 మంది కరోనా రోగులు మృత్యువాత పడ్డారు. ఇక దేశీయంగా ఆక్సిజన్ ఉత్పత్తి, రవాణా కత్తిమీద సాములా మారింది.ఆక్సిజన్ నిల్వకు ఆసుపత్రుల వద్ద సౌకర్యాలు లేకపోవడం, వచ్చిన ఆక్సిజన్ ఒక్క రోజులోనే ఖాళీ కావడంతో సమస్యలు తలెత్తుతున్నాయి.ఇక ఏపీకి రోజుకు 920 టన్నుల ఆక్సిజన్ కేటాయించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఇలా ప్రతి రాష్ట్రంలో ఆక్సిజన్ అవసరాలు వేగంగా పెరిగిపోతున్నాయి. దీంతో ఆక్సిజన్ రవాణా కీలకంగా మారింది. ఏది ఏమైనా దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతూ ఉంటడం కొంత ఊరట నిచ్చే అంశంగా చెప్పవచ్చు.