దేశంలో వ్యాక్సిన్ నిల్వలు నిండుకోవడంతో తెలుగు రాష్ర్టాల్లో టీకా కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కరోనా టీకా కొరత కారణంగా సర్కారు ఆస్పత్రుల్లో ఆదివారం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిలిపివేసింది. అయితే ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు ఓ ప్రకటన జారీ చేశారు. సోమవారం నుంచి టీకా వేస్తామని ఆయన తెలిపారు. అయితే ఆదివారం కేంద్రం నుంచి 2.7 లక్షల టీకాలు వస్తేనే మరుసటిరోజు వ్యాక్సినేషన్ కొనసాగే అవకాశముంది. లేకుంటే ఆ రోజు కూడా కొనసాగుతుందా లేదా అన్నది తెలియడంలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా టీకా నిల్వలు తగ్గిపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎక్కడైనా ఉంటే నిర్దేశిత వయసుల వారు వేసుకోవచ్చని, లేదంటే వారు కూడా నిలిపివేస్తారని అంటున్నారు. శనివారం సాయంత్రానికి రాష్ట్రంలో 29.44 లక్షల టీకాలు వేశారు. అందులో 25.78 లక్షల మందికి మొదటి డోస్ వేయగా, 3.66 లక్షలు రెండో డోస్ వేశారు.
Must Read ;- కరోనా కల్లోలం.. బెడ్లుకూడా దొరక్క రోగుల వెతలు